
నల్లాలకు వ్యవసాయ మోటార్లు
యథేచ్ఛగా నీటిని తోడుతున్నట్లు బహిర్గతం
నీటి సరఫరాలో పెరుగుతున్న ప్రెషర్..
మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ స్పెషల్ డ్రైవ్‌తో నీటి సరఫరాలో ఒత్తిడి పెరుగుతోంది. క్షేత్ర స్థాయిలో తనిఖీలు కొనసాగుతుండటంతో కొందరు వినియోగదారులు నల్లాలకు మోటార్లను తొలగిస్తున్నారు. దీంతో నీటి సరఫరాలో ఒత్తిడి పెరిగి సమపాళ్లలో సరఫరా కొనసాగుతోంది. దీంతో లో పెష్రర్‌తో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి సరఫరాలో లోప్రెషర్ ప్రాంతాలపైనే జలమండలి దృష్టి సారించి తనిఖీలను ముమ్మరం చేసింది.
● వాణిజ్య సముదాయాల్లో డొమెస్టిక్ కనెక్షన్లు
● పలు ప్రాంతాల్లో పర్యటించిన జలమండలి ఎండీ
● స్పెషల్ డ్రైవ్‌తో పెరుగుతున్న నీటి ప్రెషర్
● రెండో రోజూ కొనసాగిన మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో తాగునీటి నల్లాలకు వ్యసాయ మోటార్లను బిగించి నీటిని తోడుతున్నట్లు బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తోంది. జలమండలి నీటి సరఫరాలో లో ప్రెషర్ తగ్గించేందుకు పకడ్బందీగా చేపట్టిన ‘మోటర్ ఫ్రీ ట్యాప్’ వాటర్ స్పెషల్ సర్వే తనిఖీలో నల్లాలకు బిగించిన మోటార్లు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. మరోవైపు వాణిజ్య భవన సముదాయాలు డొమెస్టిక్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తనిఖీ బృందాలు గుర్తిస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం పలు ప్రాంతాల్లో నల్లాలకు వినియోగిస్తున్న సుమారు 32 మోటార్లను సీజ్ చేసి 39 మంది వినియోదారులకు జరిమానాలు విధించారు. రెండో రోజూ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఆర్ నగర్‌లోని మధురానగర్ పరిధిలో నీటి సరఫరాను పరిశీలించారు. లోప్రెషర్‌ను గుర్తించి సమీపంలోని హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలును తనిఖీ చేశారు.
2 హెచ్‌పీ మోటార్ వినియోగంపై ఆగ్రహం
వ్యవసాయానికి వినియోగించే 2 హెచ్‌పీ మోటార్లను నల్లాలకు వినియోగించడంపై అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పది గృహ సముదాయాలకు సరిపడే నీటిని ఒకే గృహానికి వాడితే మిగతావారు ఏమైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గృహ సముదాయంలోని ఆ హాస్టల్‌కు నెలవరకు నీటిని నిలిపివేసి ట్యాంకర్ సైతం బుక్ చెయ్యకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మరో భవనానికి సైతం వ్యవసాయ మోటార్ వాడుతూ పట్టుపడగా కనెక్షన్ తొలగించి, నెల వరకు ట్యాంకర్ సరఫరా కూడా నిలిపివేయాలంటూ అధికారులకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ వాటర్ సరఫరా సమయంలో తనిఖీలు కొనసాగించాలని ఆయన సూచించారు.