బుక్‌ చేయబోయి బుక్కయ్యాడు! | - | Sakshi
Sakshi News home page

బుక్‌ చేయబోయి బుక్కయ్యాడు!

Apr 24 2025 8:42 AM | Updated on Apr 24 2025 8:42 AM

బుక్‌ చేయబోయి బుక్కయ్యాడు!

బుక్‌ చేయబోయి బుక్కయ్యాడు!

ఆన్‌లైన్‌ విధానంలో శ్రీశైలంలో రూమ్‌ బుకింగ్‌

జీఎస్టీ కోసమంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు

నగదు రిఫండ్‌ చేస్తామని రూ.1.33 లక్షలు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: శ్రీశైలం వెళ్లాలని భావించిన నగర వాసి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూమ్‌ బుక్‌ చేసుకున్నారు. జీఎస్టీ విషయంలో తేడా రావడంతో ఆ బుకింగ్‌ రద్దు చేసుకోవాలని భావించారు. చెల్లించిన మొత్తం రిఫండ్‌ ఇస్తామంటూ ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.1.33 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి శ్రీశైలంలోని వైశ్య సత్రంలో రూమ్‌ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఓ వెబ్‌సైట్‌ ఆధారంగా ఒక రోజు కోసం రూమ్‌ బుక్‌ చేసుకుని, అందుకు సంబంధించి రూ.1000 చెల్లించారు. అది బోగస్‌ వెబ్‌సైట్‌ కావడంతో బాధితుడి వివరాలను సైబర్‌ నేరగాళ్లకు చేరాయి. కొద్దిసేపటికే అతడికి కాల్‌ చేసిన నేరగాళ్లు... రూమ్‌ అద్దె మాత్రమే చెల్లించారని, బుకింగ్‌ ఖరారు కావడానికి జీఎస్టీగా మరో రూ.180 చెల్లించాలని కోరారు. దీంతో తనకు రూమ్‌ వద్దని చెప్పిన బాధితుడు తాను చెల్లించిన రూ.వెయ్యి రిఫండ్‌ చేయాలని కోరాడు. దీంతో సైబర్‌ నేరగాడు రిఫండ్‌ కోసం సంప్రదించాలంటూ మరో నెంబర్‌ ఇచ్చాడు. బాధితుడు ఆ నెంబర్‌కు కాల్‌ చేసి విషయం చెప్పగా... రిఫండ్‌ ప్రాసెస్‌ ప్రారంభించడానికి తొలుత తమకు రూ.1 చెల్లించాలని కోరారు. యువకుడు అలానే చెల్లించగా... రూ.2 రిఫండ్‌ చేశారు. తమ కంపెనీ రిఫండ్‌ పాలనీ ఇలానే ఉందని... తమకు చెల్లించిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తూ రిఫండ్‌ పూర్తి చేస్తామని నమ్మబలికారు. ఆపై బాధితుడి నుంచి రూ.1,180 కట్టించుకుని రెట్టింపు ఇచ్చారు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత రూ.76,500 చెల్లించాలని చెప్పడంతో బాధితుడు నిరాకరించాడు. ఇప్పటి వరకు తాను చెల్లించింది తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో తమ వద్దకు నేరుగా వచ్చి డబ్బు తీసుకోవాలని వాళ్లు చెప్పడంతో నగర యువకుడు అంగీకరించలేదు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు లెక్కలు చూడగా సైబర్‌ నేరగాళ్లకు రూ.1,33,564 చెల్లించినట్లు తేలింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement