
‘దొంగ’మొగుడు
సొంత భార్య మెడలోని బంగారు గొలుసునే కొట్టేసిన ఘనుడు
ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు
కేపీహెచ్‌బీకాలనీ: గాఢ నిద్రలో ఉన్న భార్య మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తానే కాజేసి.. దొంగలు ఎత్తుకెళ్లారంటూ కథనం అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన ఓ భర్తను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్ కాలనీలోని ప్లాట్ నంబర్– 115లోని బహుళ అంతస్తుల భవనంలో మెదక్ జిల్లా వల్లూరుకు చెందిన ముక్కెర ఆంజనేయులు, భార్య భాగ్యమ్మతో కలిసి వాచ్‌మన్‌గా పని చేస్తూ ఇక్కడే ఓ గదిలో నివాసం ఉంటున్నారు. తన భార్య మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దొంగిలించాలని పథకం వేసిన ఆంజనేయులు మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భాగ్యమ్మ గాఢ నిద్రలో ఉండగా ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును దొంగిలించి దాచి పెట్టాడు. వెంటనే ఎవరో దొంగలు వచ్చి తన భార్య మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లారంటూ బుకాయిస్తూ భార్యను కూడా నమ్మించాడు. ఇదే విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా భాగ్యమ్మ, ఆంజనేయులును విచారణ చేయగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. సీసీ పుటేజీల ఆధారంగా బయటి వ్యక్తులెవరూ వీరి గదిలోకి రాలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆంజనేయులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. బంగారు గొలుసును తానే దొంగిలించానని ఒప్పుకొన్నాడు. గొలుసు పోయిందనే సానుభూతి పొందటంతో పాటు ప్లాట్ యజమానులు ఇచ్చే ఆర్థిక సహకారంతో తన అప్పులు తీర్చుకోవచ్చని పథకం వేసి చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

‘దొంగ’మొగుడు