
ఇళ్ల స్థలాల్లోకి పేదలను అనుమతించండి
ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న ఇళ్ల స్థలాల కబ్జా కోసం లబ్ధిదారులకు సహకరించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సమక్షంలో బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిలింసిటీ చెరలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలన్నారు. గతంలో నిరుపేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటామని, ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై సీపీ స్పందిస్తూ ఇంటి స్థలాల అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సామేలు, మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గరాములు, ఇంటి స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ పి.జగన్, మండల కమిటీ సభ్యుడు ఆనంద్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న భూముల చెర విడిపించండి
సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాలయాదయ్య డిమాండ్
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం