రూ.44 లక్షలు స్వాహా! | - | Sakshi
Sakshi News home page

రూ.44 లక్షలు స్వాహా!

Apr 17 2025 7:09 AM | Updated on Apr 17 2025 5:51 PM

15

15

నగర ఉద్యోగి నుంచి కాజేసిన సైబర్‌ నేరగాళ్లు 

సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన రెండు గంటల్లో రుణం ఇస్తామంటూ నమ్మబలికిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వ్యక్తిని నిండా ముంచారు. రుణం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, రూ.15 లక్షలు మంజూరు అయిందని చెప్పి రూ.44 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో నివసించే ఓ ప్రైవేట్‌ ఉద్యోగికి ఇటీవల వాట్సాప్‌ ద్వారా ఓ సందేశం వచ్చింది. మహాలక్ష్మీ ఫైనాన్సెస్‌ సంస్థ నుంచి వచ్చినట్లు ఉన్న ఆ సందేశంలో అర్హులైన వారికి దరఖాస్తు చేసిన రెండు గంటల్లో వ్యక్తిగత రుణం మంజూరు చేస్తామని ఉంది. ఆ సందేశం చివరలో ఓ నెంబర్‌ సైతం ఉండటంతో బాధితుడు ఫోన్‌ చేశాడు. 

బాధితుడి నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్న అవతలి వ్యక్తి సిబిల్‌ స్కోరు చాలా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో రుణం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. ఆపై తాము పంపే క్యూఆర్‌ కోడ్‌కు కొంత మొత్తం చెల్లించాలి రీపేమెంట్‌ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించాడు. ఇలా చెల్లించిన మొత్తం రిఫండబుల్‌ అని మోసగాడు చెప్పడంతో బాధితుడు చెల్లించాడు. నేరగాళ్లు ఆధార్‌, పాన్‌కార్డులతో పాటు ఓ చెక్కు ఫొటోను పంపమని కోరడంతో బాధితుడు అలానే చేశాడు. ఈ విషయం తెలిసిన అతడి సోదరుడు వారించడంతో వాటి ఫొటోలను బాధితుడు నేరగాడి చాట్‌ నుంచి డిలీట్‌ చేసేశాడు. 

బాధితుడిని సంప్రదించిన సైబర్‌ నేరగాడు రూ.15 లక్షల లోన్‌ ప్రాసెస్‌లో ఉండగా డాక్యుమెంట్లు డిలీట్‌ చేసిన ఉల్లంఘనకు పాల్పడ్డావని చెప్పాడు. దీంతో పాటు బాధితుడి ఎస్‌బీఐ ఖాతాలో బ్యాలెన్స్‌ తక్కువగా ఉండటంతో దాని నిమిత్తం మరికొంత పెనాల్టీ అంటూ వసూలు చేశాడు. ఇలా మొత్తం ఎనిమిదిసార్లు రకరకాలైన పెనాల్టీలు, ఫీజులు వసూలు చేసిన సైబర్‌ నేరగాడు ప్రతి సందర్భంలోనూ రిఫండ్‌ అంటూ నమ్మబలికాడు. చివరకు ఓ రోజు రుణం మంజూరైందని చెప్తూ దానికి సంబంధించిన సందేశమంటూ డమ్మీ స్క్రీన్‌షాట్‌ పంపాడు. త్వరలోనే తమ సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు సంప్రదించి ఆ మొత్తం రిలీజ్‌ చేస్తారని నమ్మించాడు. వాళ్లు సూచించిన మొత్తం మరోసారి డిపాజిట్‌ చేయాలని, అలా కాకుంటే రుణం రద్దు అవుతుందని బెదిరించారు. 

అప్పటికే దాదాపు 25 సార్లు పెనాల్టీల చెల్లింపు కోసం బాధితుడు కుటుంబీకులు, బంధువులతో పాటు స్నేహితుల వద్ద అప్పు చేసి రూ.44,83,000 చెల్లించాడు. వీటికి తోడు మరికొంత చెల్లించాలంటూ వాళ్లు చెప్తుండటంతో అనుమానించిన బాధితుడు ఆరా తీశాడు. ఈ నేపథ్యంలోనే తాను మోసపోయినట్లు గుర్తించి ఆ మొత్తం తిరిగి చెల్లించాలని కోరాడు. దీంతో పంథా మార్చిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడిని బెదిరింపులతో కూడిన, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం మొదలెట్టారు. ఈ మేరకు బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement