
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండలం, లకుడారం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మూసాపేటకు చెందిన ఉమేశ్ తన 5 నెలల కుమారుడి పుట్టు వెంట్రుకలను తీయించేందుకు కుటుంబ సభ్యులతో వేముల వాడలోని రాజరాజన్న దేవ స్థానానికి కారులో బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఉమేశ్ చెల్లెలు కుమారుడు రామారం కార్తీక్ (7) కూడా మేనమామతో కలిసి కారులో వెళ్లాడు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామ శివారులోకి రాగానే కారు అదుపు తప్పి రాజీవ్ రహదారి పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్తీక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగితా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడి మృతికి కారణమైన బావమరిది ఉమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రామారం బాబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విషాదం నింపిన పుట్టు వెంట్రుకల వేడుక
కారులో వేములవాడకు వెళ్లిన కుటుంబం
తిరుగు ప్రయాణంలో లకుడారం గ్రామ శివారులో కారు బోల్తా
ఆరుగురికి స్వల్ప గాయాలు

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి