
‘ఏ’ కథా సంపుటి ఆవిష్కరణ
సాక్షి, సిటీ బ్యూరో: రిటైర్డ్ పోలీస్ అధికారి, రచయిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రాసిన ‘ఏ’ కథా సంపుటిని పలువురు సాహితీ వేత్తలు ఆవిష్కరించారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్, రచయితలు ఖదీర్ బాబు, అనిల్, మానస ఎండ్లూరి, కుప్పిలి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ‘ఏ’ కథా సంపుటిలో వైవిధ్యం, వాస్తవికత, మానవీయత కలిగిన కథలు ఉన్నాయని కొనియాడారు. ఈ కథల్లో సీ్త్ర, పురుష సంబంధాల గురించి స్వేచ్ఛగా వ్యక్తపరచడం పాఠకులను ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. కథలన్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయన్నారు. సీ్త్ర, పురుష సంబంధాల పట్ల, సమాజం నిర్మించిన నైతిక చట్రపు విలువలను, సంబద్ధతను రచయిత నిశితంగా ప్రశ్నించారని వివరించారు. ఒకే మూసలో ఒదగని ఈ కథలు చెప్పేతీరు కూడా కథ కథకి మారుతుందన్నారు. కాగా ఉమామహేశ్వర శర్మ పదవీ విరమణ చేశాక రాసిన రెండో పుస్తకం ‘ ఏ’ కథలు. ఆయన మొదటి పుస్తకం ‘నేనూ శాంత కూడా–ఓ జీవన కథ’ ఇప్పటికే పాఠకుల ఆదరణ పొందింది.