
తెలంగాణ నుంచి ‘రెడ్ కార్నర్’లో ఉన్నవాళ్ల సంఖ్య ఇది..
తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో..
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా ఛానల్ మాజీ ఎండీ శ్రవణ్‌రావులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. తీవ్రమైన, సంచలనాత్మక కేసుల్లో వాంటెడ్‌గా ఉండి, విదేశాలకు పారిపోయినట్లు ఆధారాలు లభించిన వారిపై పోలీసులు ఈ నోటీసులు జారీ చేయిస్తారు. తెలంగాణ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉన్న వారి సంఖ్య ప్రస్తుతం ఏడుగా ఉంది. శ్రవణ్‌రావు తిరిగి రావడంతో వీరిలో వాంటెడ్ నిందితుల సంఖ్య ఆరు మాత్రమే. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసుల్ని ఇంటర్‌పోల్ కేవలం అఫీషియల్ వ్యూలోనే ఉంచింది.
ముగ్గురిపై ఉగ్రవాద సంబంధ కేసుల్లో...
ఈ ఏడుగురిలో ముగ్గురిపై మాత్రం ఉగ్రవాద సంబంధిత కేసుల్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అ/్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ దేవాలయంపై దాడి, 2004లో నగరం కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, 2005లో నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం మానవబాంబు దాడి, 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ సహా అనేక కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడితో పాటు బెంగళూరు కుట్ర కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరి పైనా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ, నాందేడ్‌లో విధ్వంసాలకు కుట్ర పన్నిన ఆరోపణలపై నమోదైన ఈ కేసులో తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ సాదిక్ బిన్ ఉస్మాన్, యాకత్‌పురకు చెందిన మహ్మద్ అబు సాద్‌ల పైనా ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది.
మరో ఇద్దరిపై వేర్వేరు కేసుల్లో...
ఈ ముగ్గురిపై ఉగ్రవాద సంబంధ కేసుల్లో, ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా.. మరో ఇద్దరిపై వేర్వేరు కేసుల్లో ఈ నోటీసులు ఉన్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నమోదైన అనేక హత్య, హత్యాయత్నం కేసుల్లో నగరానికి చెందిన తాహెర్ అన్సారీ నిందితుడిగా ఉన్నాడు. ఇతడితో పాటు అమీర్‌పేట కేంద్రంగా పని చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్‌ను నిండా ముంచిన బాబు మహ్మద్ పైనా ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. ఇతగాడు మరికొందరితో కలిసి 1997–2000 మధ్య సదరు బ్యాంకును నిండాముంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెడ్‌కార్నర్ నోటీసులు ఉన్న మోస్ట్‌వాంటెడ్ జాబితాను ఇంటర్‌పోల్ తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. అసవరాన్ని బట్టి కొందరి వివరాలు పబ్లిక్ వ్యూలో, మరికొందరివి అఫీషియల్ వ్యూలో ఉంచుతుంది. ఇలా అఫీషియల్ వ్యూలో ఉన్న కారణంగానే ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఉన్నవి ప్రత్యేక లాగిన్ అవకాశం ఉన్న అధికారులకు తప్ప సాధారణ ప్రజలకు కనిపించవు. కేవలం ఉగ్రవాద సంబంధిత, అత్యంత తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వివరాలు మాత్రమే పబ్లిక్ వ్యూలో ఉంటాయి.
శ్రవణ్‌రావుపైసుప్రీం కోర్టుకు...
ఇలా రెడ్‌కార్నర్‌లో ఉన్న నిందితుల్లో శ్రవణ్‌రావుకు సుప్రీం కోర్టు ఊరట ఇవ్వడంతో వచ్చి లొంగిపోయారు. అయితే దర్యాప్తునకు సహకరించాలంటూ న్యాయస్థానం విధించిన షరతును ఈయన ఉల్లంఘిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు నోటీసులు ఇచ్చి విచారించినా సరైన వివరాలు చెప్పలేదని, ట్యాపింగ్ సమయంలో వినియోగించిన ఫోన్లు ఇవ్వాలని కోరితే వేరేవి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఆయన స్వాధీనం చేసిన మూడు ఫోన్లకు ప్రాథమికంగా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన అధికారులు అందులో ఎలాంటి డేటా లేదని తేల్చారు. ఇలా దర్యాప్తునకు సహకరించని శ్రవణ్‌రావుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న ఊపశమనం ఎత్తివేయాలంటూ కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.