అదుపుతప్పిన ఎంఎంటీఎస్ రైలు | MMTS train derails, hits platform | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన ఎంఎంటీఎస్ రైలు

Published Thu, Oct 10 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

MMTS train derails, hits platform

నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం  
డ్రైవర్, గ్యాంగ్‌మెన్, ప్రయాణికుడికి గాయాలు
రెండు నెలల్లో రెండో ఘటన

 
 సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం మరో రైలు ప్రమాదానికి గురైంది. లింగంపల్లి నుంచి నాంపల్లికి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు (నం.47128) 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన తర్వాత ఆగకుండా అలానే ముందుకెళ్లి చివరనున్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గ్యాంగ్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో ఇదే రైల్వే స్టేషన్లో రెండో ప్రమాదం జరగడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న సమయంలో బోగీలను ముందుకు పుష్ చేసే హైడ్రాలిక్ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల  ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. రైలును ఆపడానికి డ్రైవర్ పి.మణ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. బ్రేకులు వేసినా ఆగకుండా రైలు ముందుకు వెళ్లి 2వ నంబర్ ప్లాట్ ఫామ్ ‘డెడ్ ఎండ్’ గోడను ఢీకొట్టింది.
 
 కేబిన్ నలిగిపోవడంతో లోపల నుంచి డ్రైవర్ బయటపడలేకపోయారు. ఆయనతో పాటు కేబిన్‌లోనే ఉన్న గ్యాంగ్‌మెన్ నర్సయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో షేక్ సద్దాం అనే ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డారు. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. చివరి స్టేషన్ కావడంతో ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్లాట్‌ఫామ్‌పైకి రైలు వచ్చాక ప్రమాదం జరగడం, గోడను ఢీకొట్టి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇదే ప్రమాదం స్టేషన్‌కు వెలుపల ప్రయాణంలో ఉండగా జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రమాదం కారణంగా డ్రైవర్ మణ్యం కాలు కేబిన్‌లో ఇరుక్కుపోవడంతో మెడికల్ రిలీఫ్ వ్యాన్ సిబ్బంది వచ్చి కట్టర్ ద్వారా ఆయనను బయటకు తీసుకొచ్చారు. డ్రైవర్ కాలు, వేళ్లు దెబ్బతినడంతో ఆయనను, తలకు గాయాలైన గ్యాంగ్‌మెన్‌ను చికిత్స కోసం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు.
 
 విచారణ జరుపుతున్నాం: డీఆర్‌ఎం
 సికింద్రాబాదు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) మిశ్రా ఉదయం సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నా రు. బ్రేకులు ఫెయిలయ్యాయా లేక ఇతరత్రా కారణాల వల్ల ప్రమాదం జరిగిందా? తెలుసుకునేందుకు విచారణ చేస్తున్న ట్లు మిశ్రా తెలిపారు. ప్రమాదంపై డ్రైవర్‌తో కూడా మాట్లాడి న తర్వాత కారణాలపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో రెండు నెలల క్రితం ఒక ప్యాసింజర్ రైలు కూడా ఇలానే ప్లాట్‌ఫామ్‌పై డెడ్ ఎండ్‌ను ఢీకొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement