ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు
=త్వరలో రెండోదశ పనులు ప్రారంభం
=ప్రయాణికుల భద్రతపై దృష్టి
=విలేకరుల సమావేశంలో ద.మ.రైల్వే జీఎం
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రెండో దశపై నెలకొన్న ప్రతిష్టం భన సైతం తొలగిపోయిందని, తాజాగా ఎయిర్‌పోర్టులో రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణపై సర్వే చేశామని సోమవారం విలేకరులకు చెప్పారు.
ముంబయి ఎయిర్‌పోర్టుకు కూడా సబర్బన్ ట్రైన్ సదుపాయం లేదని, ఆ సౌకర్యం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ టెండర్లను బ్రిటన్‌కు చెందిన బాల్‌ఫోర్ బెట్టి సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలోని కాళింది అనే సంస్థతో కలిసి అది ఈ ప్రాజెక్టును చేపడుతుంది. ప్రతిపాదిత రెండో దశలోని ఆరు మార్గాల్లో రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త లైన్‌లు, స్టేషన్ల నిర్మాణం వంటి పనులను త్వరలో ప్రారంభిస్తారని జీఎం వెల్లడించారు. రెండో దశ లైన్‌ల నిర్మాణం కోసం రూ.380 కోట్లు కేటాయించారు. మరో రూ.300 కోట్లతో ఇంజన్లు, కోచ్‌లు సమకూర్చుకుంటారు. మొత్తం 84 కిలోమీటర్లలో రెండో దశ చేపట్టనున్నారు.
రద్దీకి అనుగుణంగా సర్వీసుల పెంపు..
ప్రస్తుతం నాలుగు మార్గాల్లో అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు జీఎం శ్రీవాస్తవ తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంట నగరాల్లో 121 సర్వీసులు ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులన్నీ 9 బోగీలతో రూపొందించినవే. వీటిని 11 బోగీలకు పెంచడం ద్వారా ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముంబయి సబర్బన్ రైళ్ల తరహాలో ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక నుంచి అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు నిర్ణీత వేళల ప్రకారం నడుస్తాయని ఆయన వివరించారు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో జీఎం తనిఖీ
విలేకరుల సమావేశం అనంతరం జీఎం శ్రీవాస్తవ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్.కె.మిశ్రా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేశారు. ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్‌లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రత, నాణ్యత, ప్లాట్‌ఫాంల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. రిజర్వేషన్ చార్టులు, రైళ్ల అనౌన్స్‌మెంట్ పద్ధతి, రైళ్ల రాకపోకల సమాచారం డిజిటల్ ప్రదర్శన, రిజర్వేషన్ బుకింగ్ కార్యాలయాలు, టాయిలెట్లను కూడా ఆయన పరిశీలించారు.
సీసీటీవీ సర్వెలెన్స్ వ్యవస్థ, స్టేషన్‌లో భద్రతా సిబ్బంది ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఎంఎంటీఎస్ బోగీల్లో హోంగార్డుల సంఖ్యను పెంచుతామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆర్‌పీఎఫ్ సిబ్బందిని కూడా మరింత పెంచుతామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్ల వేళలపై నిర్ధిష్టమైన సమాచారం అందజేసేందుకు జీపీఎస్, జీపీఆర్‌ఎస్ వ్యవస్థను ఇటీవల ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.