రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్)లో ఇకపై రెండు జోన్లు ఏర్పడనున్నాయని ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ తెలిపారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్)లో ఇకపై రెండు జోన్లు ఏర్పడనున్నాయని ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మంగళవారం హెల్ప్‌లైన్ డెస్క్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జోన్ల విభజన కోసం రైల్వే యాజమాన్యం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసిందన్నారు. దీనిలో ఎస్‌సీఆర్‌కు చెందిన ఇరువురు అధికారులు ఉన్నట్టు చెప్పారు.
అయితే, జోన్ల విభజన వల్ల ఇబ్బందులు, లాభాలు రెండూ ఉన్నాయన్నారు. త్వరలో ఈ విషయమై రైల్వే యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం రైల్వే శాఖ ఏటా రూ.12 వేల కోట్ల నష్టంతో నడుస్తోందని, ప్రయాణికుల చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఉందని అన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి గుంటూరు, తిరుపతిల వరకు ఇటీవల ప్రారంభించిన డబుల్ డెక్కర్(డీడీ) రైలును విజయవాడ వరకు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.