విజయవాడ కేంద్రంగా ఏర్పాటు
రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు
కోస్తా పరిధిలోని విశాఖకూడా అందులోకే..
ఉన్నతాధికారులు వద్దన్నా నేతల ఒత్తిడితో కేంద్రం పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కూడా విభజించాలని కేంద్రం నిర్ణయిం చింది. దీనికి రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రాంతం సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేజోన్‌గా ఉండనుండగా, విజయవాడ ప్రధాన కేంద్రంగా సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక జోన్‌గా ఆవిర్భవించనుంది. రాష్ట్ర విభజన ఖాయంగా మారిన నేపథ్యంలో.. సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ వివిధ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఆ సమయంలో కేంద్రం దీనిపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. రైల్వే జోన్‌లు రాష్ట్ర సరిహద్దులను ఆధారం చేసుకొని ఉండవని, రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రైల్వేజోన్‌ను కూడా విభజించాలనటం సరికాదం టూ రైల్వే అధికారులు కేంద్రం దృష్టికి తెచ్చారు. ప్రత్యేక జోన్ వల్ల కొత్తగా ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఒకేజోన్ పరిధిలో రెండు రాష్ట్రాలుండటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని పేర్కొంటూ.. జోన్‌ను విభజించటం వల్ల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఆ ప్రతిపాదన విరమించుకోవటమే మంచిదంటూ స్పష్టం చేశారు.
దీంతో కేంద్రప్రభుత్వం నేతల విన్నపాన్ని తిరస్కరించింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో వారిని బుజ్జగించే చర్యల్లో భాగంగా కేంద్రం మళ్లీ ఈ రైల్వే జోన్ విభజను పరిశీలిస్తానని హామీ ఇచ్చింది. కొత్త జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆరునెలల్లో నివేదిక కోరుతున్నట్టు విభజన బిల్లులో చేర్చింది. అప్పటికే అధికారులు వ్యతిరేకంగా ఉన్నందున ఆరునెలల తర్వాత జోన్‌పై అనుకూల నిర్ణయం రాదనే ఉద్దేశంతో సీమాంధ్ర నేతలు దీనిపై గట్టిగా పట్టుబట్టారు. దీంతో రెండు జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం రైల్వే అధికారులను ఆదేశించటంతో ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల చేయలేదు. కానీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు సూచించటంతో ప్రస్తుతం వారు ఆ పనిలో ఉన్నారు.
కొత్తజోన్ పరిధిలోకి విశాఖ
ప్రస్తుతం తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్) జోన్ పరిధిలో ఉన్న విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను కూడా కొత్త జోన్ పరిధిలోకి తేనున్నారు. ఈ మూడు ప్రాంతాలను ప్రత్యేక డివిజన్‌గా చేసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తేవాలని చాలాకాలంగా గట్టి డిమాండ్ ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోలేదు. ఇప్పుడు పనిలోపనిగా ఆ ప్రాంతాలను తూర్పుకోస్తా నుంచి తప్పించి విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. ఆస్తులు, అప్పుల పంపిణీ కోసం ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ విభాగాల్లో జరుగుతున్న తరహాలోనే రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది. కొత్త జోన్ పరిధిలో ఏయే తరహా సంస్థలను ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైన వాటిని ఎలా విభజించాలి.. తదితర పనులు మొదలుపెట్టింది.
సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్
Published Thu, Mar 13 2014 4:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement