మనోహర్, సోని(ఫైల్)
వివాహ బంధంతో ఒక్కటవ్వాలని కలలు కన్న బావామరదళ్లను మృత్యు రూపంలో వచ్చిన రైలు కబళించింది. వచ్చే వేసవిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం గుంటూరులోని బంధువుల ఇంటికి బయలుదేరగా..మధ్యలోనే మృత్యువాత పడింది. చందానగర్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన మనోహర్, సోనీలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు వెళ్లేందుకు బయలుదేరారు. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఢీకొంది. దీంతో మనోహర్, సోనీ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదాన్ని మనోహర్ తల్లి సూర్యకళ సమీపం నుంచి చూసి తీవ్ర షాక్‌కు గురైంది. ఈ స్టేషన్‌లో మూల మలుపు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు రైలు కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
చందానగర్: వారిద్దరూ బావా మరదళ్లు, వారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కొద్ది రోజుల్లోనే ఒకటికానున్న ఈ జంటను విధి వెంటాడింది. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన రైలు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం చందానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన పెంటయ్య, సూర్యకళ దంపతుల కుమారుడు మనోహర్(24) హైటెక్‌సిటీలో జీహెచ్‌ఎంసీ చెత్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శాంతినగర్‌కు చెందిన భిక్షపతి, లక్ష్మమ్మ కుమార్తె సోని(18) ఇంట్లోనే ఉంటుంది. మనోహర్‌కు మేనమామ కూతురైన సోనితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. మనోహర్, సోని క్రిస్మస్ వేడుకల నిమిత్తం గుంటూరుకు వెళ్లేందుకు మంగళవారం చందానగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వారిని ఎంఎంటీఎస్ రైలు ఎక్కించేందుకు తల్లి సూర్యకళ కూడా వారి వెంట వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ప్లాట్ ఫాం పక్క నుంచి పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మనోహర్ పట్టాలపై పడంతో తల, మొండెం వేరయ్యాయి. సోని ఎగిరి పట్టాల పక్కన పడటంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. తల్లి సూర్యకళ కొద్దిగా వెనకగా ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడింది. కళ్ల ముందే కొడుకు, కోడలు చనిపోవడంతో సూర్యకళ కన్నీరు మున్నీరైంది. ఘటనా స్థలాన్ని హైదరాబాద్ రైల్వే ఎస్‌ఐ జీఆర్‌పీ దాస్యా నాయక్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉదయం వెళ్లాల్సి ఉండేది...
గుంటూరులో ఉంటున్న సూర్యకళ అక్క కుమారుడు సంతోష్ ఆహ్వానం మేరకు మనోహర్, సోని గుంటూరుకు బయలుదేరారు. ఇందుకుగాను మూడు రోజుల క్రితమే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం లింగంపల్లి స్టేషన్‌కు వెళ్లగా వారు ఎక్కాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మిస్ అయ్యింది. దీంతో మధ్యాహ్నం ఎంఎంటీఎస్ రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు. ముందుగా బ్యాగులు తీసుకుని ఫ్లాట్‌ఫాం మీద పెట్టి తిరిగి వచ్చిన మనోహర్ మరదలు, తల్లిని తీసుకొని పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యకళ పెద్ద కొడుకు రాజుకు మతిస్థిమితం లేదు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మనోహర్ మృతి చెందడంతో సూర్యకళ బోరున విలపిస్తోంది. కాగా సోని తల్లి లక్ష్మమ్మ హఫీజ్‌పేట్ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. మనోహర్, సోని మృతి వార్త తెలియడంతో పాపిరెడ్డి నగర్ కాలనీ, శాంతినగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మూలమలుపు కారణంగానే..
చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌కు వచ్చే వారు పాపిరెడ్డినగర్ కాలనీ, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్ప మీదుగా కాలినడకన వచ్చి పట్టాలు దాటుతుంటారు. అయితే అక్కడ మూల మలుపు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు రైలు కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment