పుష్పిత సాహ (ఫైల్)
శేరిలింగంపల్లి: కాలేజీకి వెళ్లేందుకు కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడటంతో ఓ యువతి మృతి చెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఆర్‌పీఎఫ్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీ ఎస్టేట్‌లో ఉంటున్న గౌతమ్ సాహ కుమార్తె పుష్పిత సాహ (20) బాపట్లలోని ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో పుడ్ ప్రాసెసింగ్ కోర్సు చేస్తుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె సెలవులు ముగియడంతో సోమవారం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అమరావతికి వెళ్లేందుకు తల్లిదండ్రులతో కలిసి తెల్లవారు జామున లింగంపల్లి స్టేషన్‌కు వచ్చింది. తల్లిదండ్రులను మూడో నంబర్ ఫ్లాట్ ఫారం వద్ద ఉంచి టికెట్ తెచ్చుకునేందుకు వెళ్లింది. అయితే అప్పటికే రైలు కదులుతుండటంతో ఒక బ్యాగ్‌ను రైల్లోకి విసిరి మరో బ్యాగ్ భుజానికి తగిలించుకొని రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. నాంపల్లి జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు...
తమ కళ్ల ముందే రైలు కిందపడి కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు సీమాసా, గౌతమ్ సాహలు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలో పెద్దదైన పుష్పిత ఎన్‌జీ రంగా యూనివర్సిటీ పంపేందుకు స్టేషన్‌కు రావడం వారి ముందే కూతురు రైలు కిందపడి మృతి చెందడం చూసి బోరుమన్నారు. స్టేషన్‌లో ఒకే టికెట్ కౌంటర్ ఉన్నందున టికెట్ల జారీలో జాప్యం కారణంగానే తమ కుమార్తె కదులుతున్న రైలు ఎక్కాల్సి వచ్చిందని, అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాలని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment