ఆశలు అడియాసలే..! | 'New rail zone in Telangana state has remained an empty promise' | Sakshi
Sakshi News home page

ఆశలు అడియాసలే..!

Published Wed, Jul 9 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఆశలు అడియాసలే..!

ఆశలు అడియాసలే..!

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో బడ్జెట్ రైలు పరుగులు తీసింది. కానీ తెలంగాణవైపు మళ్లకుండా వెళ్లిపోయింది. ఆశలపై నీళ్లు చల్లుతూ.. అంచనాలను తలకిందులు చేస్తూ .. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం వెక్కిరించింది. లక్షన్నర కోట్ల భారీ బడ్జెట్‌తో రైల్వేలు మురిపించినా.. తెలంగాణకు దక్కింది మాత్రం కొన్ని వందల కోట్లే! మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ైరె ల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రకటించినవి నాలుగు రైళ్లు కాగా.. అవన్నీ వారానికోసారే(ఒక్కటి మాత్రం రెండు సార్లు) ప్రయాణికులను పలకరిస్తాయి. రెండు రైళ్లు రాష్ర్టం నుంచే ప్రారంభమవుతుండగా.. మరో రెండు మాత్రం ఈ ప్రాంతం మీదుగా వెళతాయి. తాజా బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది ఇంతే! గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల కాలంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుండగా.. తాజాగా మోడీ ప్రభుత్వం అంతకంటే చిన్నచూపే చూశారు.
 
 రైల్వేల ఆర్థిక స్థితి సరిగా లేదని, పదేళ్లుగా ప్రకటించిన పథకాలకు సరిపడా నిధులు లేనందున కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేమని వారం క్రితమే ఆయన కుండబద్దలు కొట్టినా.. అంతకుమించిన రీతిలో తెలంగాణ ను నిర్లక్ష్యం చేశారు. కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకున్నా.. ఇప్పటికే మొదలైన పనులకు నిధుల కేటాయింపు. కీలక మార్గాల్లో డబ్లింగ్ పనుల పూర్తి, కొత్త రైళ్లు, ఉన్నవాటి నిడివి పొడగింపు తదితరాల విషయంలో రాష్ర్ట ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆది నుంచీ రైల్వే మార్గాల విషయంలో బాగా వెనకబడి ఉన్నందున.. కొత్త రాష్ర్టంగా ఏర్పడినందున ప్రోత్సాహకరంగా నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇవ్వకుండా.. పాతవాటినే పూర్తి చేయాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరారు. కానీ రైల్వే మంత్రి సదానంద గౌడ ఇవేవీ పట్టించుకోలేదు.
 
 ప్రాజెక్టులు సరే... రైళ్లేవి?
 గత బడ్జెట్‌లో 11, అంతకుముందు 15, ఆపైయేడు 17.. ఇలా దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లు వచ్చాయి. వాటిని చూసే ప్రజలు పెదవి విరిచారు. అలాంటిది ఈసారి ఆ స్థాయిలో కూడా కొత్త రైళ్లను కేటాయించలేదు. కేవలం నాలుగు ైరె ళ్లను మాత్రమే ప్రకటించారు. ఒకటి హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్. ఇది వారానికి ఒక్కసారే తిరుగుతుంది. ప్రీమియం రైలు కావడంతో దీని టికెట్ రేట్లు పేలిపోతాయి. వెరసి ఇది ఫ్రీక్వెన్సీ, టికెట్ ధరల పరంగా ఏమాత్రం అనుకూలం కాదు. కాజీపేట-ముంబై మధ్య మరో రైలును ప్రకటించారు. అది కూడా వారానికి ఒక్క రోజే నడుస్తుంది. ఇవి కాకుండా తెలంగాణ మీదుగా వెళ్లేవి మరో రెండున్నాయి. వారానికోరోజు నడిచే జైపూర్-మధురై ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌తో పాటు వారానికి రెండు రోజులు నడిచే అహ్మదాబాద్-చెన్నై (వయా వసాయ్ రోడ్డు) ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రం ప్రకటించింది. ఇవి కూడా ప్రజలకు అంతగా ఉపయోగపడేవి కావు.  
 
 సెమీ బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లేదెన్నడు?
  హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను ఆధునీకరించి.. హైస్పీడ్ సెమీ బుల్లెట్ రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు.  వీటి గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇందుకు లైన్ల పటుత్వాన్ని బాగా మెరుగుపరచాల్సి ఉంటుంది. కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లు ఉండకూడదు. ఇదంతా జరగాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్‌లో ఇందుకు ప్రతిపాదించింది కేవలం రూ. 100 కోట్లు.
 
 అర్థం కాని కమిటీ.. అంతుచిక్కని ఆలోచన!
 ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనను కమిటీకి అప్పగిస్తామనడం గందరగోళంగా ఉంది. ఆ కమిటీ ఏంటో, దానికి పెండింగు ప్రాజెక్టుల బాధ్యత ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటో అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకారం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల ఏర్పాటును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో గతంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీలలో 29 పెండింగ్ (పనులు కొనసాగుతున్నవి) ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్లు అవసరమవుతాయని అంచనా.
 
 అయితే ఈ ప్రాజెక్టుల విషయం తేల్చే బాధ్యతను ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగిస్తున్నామని, అందులో రైల్వే అధికారులతోపాటు రెండు రాష్ట్రాల అధికారులుంటారని, తాను స్వయంగా వారితో చర్చిస్తానని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. విభజన సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఐదుగురు రైల్వే అధికారులు తప్ప ఇరు రాష్ట్రాల ప్రతినిధులు లేరు. మరి మంత్రి చెప్పేది అదే కమిటీనా, వేరే కమిటీనా అన్నది దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కూడా అర్థం కావడం లేదు.
 
 ఎంఎంటీఎస్‌ది నత్తనడకే!
 ఎంఎంటీఎ స్ రెండో దశకు ఈసారి కూడా మొండిచేయే ఎదురైంది. స్మార్ట్ సిటీ ఫార్ములాను కేంద్రం సిద్ధం చేసి న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆశించారు. కానీ కేవలం రూ. 20 కోట్లతోనే కేంద్రం సరిపెట్టింది. దీంతో రైల్వే శాఖ ఇప్పటివరకు కేటాయించిన నిధుల మొత్తం రూ. 40 కోట్లకు చేరుకోగా రాష్ట్రప్రభుత్వం వాటాగా రూ. 80 కోట్లు ఇచ్చింది. రైల్వే నుంచి రూ. 60 కోట్లు వస్తే పనులు వేగిరమయ్యేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు.రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల కంటే అందంగా తీర్చిదిద్దాలంటూ ఇటీవల స్వయంగా ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో... సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ప్రాజెక్టుకు నిధులు వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ బడ్జెట్‌లో దాని ఊసే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement