
ఎంఎంటీఎస్ రెండో దశ జీఎమ్మార్‌కు అప్పగింత?
ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనులను టాటా పవర్, జీఎమ్మార్ సంస్థలకు అప్పగించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేపట్టినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వెల్లడించారు.
- తప్పుకొన్న బాల్‌ఫోర్‌బెట్టి
- టాటా పవర్, జీఎమ్మార్‌లతో రైల్వేశాఖ చర్చలు
- త్వరలో పనులు ప్రారంభం
- ‘హైలైట్స్’ పథకావిష్కరణలో జీఎం వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనులను టాటా పవర్, జీఎమ్మార్ సంస్థలకు అప్పగించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేపట్టినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ (హైలైట్స్) ప్రారంభోత్సవం సందర్భంగా రైల్‌నిలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో దశ ప్రాజెక్టు నుంచి బ్రిటన్ సంస్థ బాల్‌ఫోర్‌బెట్టి, ఇండియాలో దాని భాగస్వామ్య సంస్థ కాళింది నిర్మాణ్‌లు తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే టాటాపవర్, జీఎమ్మార్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం చోటుచేసుకున్నందువల్ల తిరిగి మరోసారి టెండర్లకు వెళ్లకుండా నేరుగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నగరంలో ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్లు వేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, రెండో దశ నిర్మాణంలో భాగంగానే ప్రత్యేక లైన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
రూ.110 కోట్లతో దేశవ్యాప్తంగా ‘హైలైట్స్’ తరహా సేవలు
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లకు వచ్చే, పోయే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల వాస్తవ వేళలతో పాటు, 26 ఎంఎంటీఎస్ స్టేషన్‌ల మీదుగా నడిచే అన్ని ఎంఎంటీఎస్ రైళ్ల రన్నింగ్ సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకొనేందుకు ప్రవేశపెట్టిన ‘హైలైట్స్’ తరహా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రైల్వేశాఖ రూ.110 కోట్లతో ప్రణాళికలను రూపొందించిందన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి దక్షిణమధ్య రైల్వే ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగించే లోకల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల వేళలను, ఇతర సమాచారాన్ని రైల్వేశాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తుందన్నారు. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మాట్లాడుతూ, ‘హైలైట్స్ ’ వల్ల ప్రతి రోజు 3 లక్షల మంది ఎంఎంటీఎస్ ప్రయాణికులకు, మరో రెండు లక్షల మంది దూరప్రాంత ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా రైళ్ల వాస్తవ సమాచారం తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ సుశాంత్‌కుమార్ మిశ్రా, అల్లాం తదితరులు పాల్గొన్నారు.
‘హైలైట్స్’ ప్రయోజనాలివీ...
ఆండ్రాయిడ్ మొబైల్ టచ్ ఫోన్ ఆధారంగా ప్రయాణికులు ఎంఎంటీఎస్ వచ్చే, పోయే వేళల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆ ట్రైన్ ఎక్కడ వరకు వచ్చింది, తాము ఎక్కవలసిన స్టేషన్‌కు ఎంతసేపట్లో రాగలదనే వాస్తవ సమాచారమూ తెలుస్తుంది.
ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్‌టేబుల్, రూట్‌మ్యాప్, చార్జీలు, ఏటీవీఎం కేంద్రాలు, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ హెల్ప్‌లైన్‌లు, హాస్పిటళ్లు, క్యాబ్‌లు, అంబులెన్స్‌లు తదితర అత్యవసర సేవల వివరాలు తెలుసుకోవచ్చు.
నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్‌లకు వచ్చే, వెళ్లే రైళ్ల వాస్తవ వేళలు, రైలు ఏ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేది, ఏ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరేది తెలుస్తాయి.