ఎంఎంటీఎస్‌ల్లో భద్రత పెంపు
- టీటీఈలపై దాడుల నేపథ్యంలో ఆర్‌పీఎఫ్ చర్యలు
- మహిళలకు ప్రత్యేక రక్షణ
- ఆకతాయిల గుర్తింపునకు మఫ్టీ పోలీసులు
సికింద్రాబాద్: టీటీఈలపై దాడులు, మహిళలకు వేధింపులు, జేబుదొంగతనాలు వంటి నేరాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గడచిన వారం రోజుల్లో టికెట్ అడిగిన పాపానికి ఇద్దరు టీటీఈలపై ఆకతాయిలు దాడి చేసిన విషయం తెలిసిందే. భద్రత లేకుంటే తాము విధులు నిర్వహించలేమని టీటీఈలు ఇటీవల ఆందోళనకు దిగడంతో ఆర్‌పీఎఫ్ పోలీసులు అప్రత్తమయ్యారు. నిత్యం లక్ష మంది వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లలో జేబుదొంగతనాలు, చోరీలు, ఈవ్‌టీజింగ్ వంటివి జరుగుతున్నట్టు ఫిర్యాదులందుతున్నాయి. దీనికి తోడు ఇటీవల టికెట్‌లేని ప్రయాణికుల సంచారం కూడా అధికమైంది. దీంతో వీటన్నింటినీ నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మహిళా రైలులో....
ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికులకు ఇకపై పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారు. ముఖ్యంగా ఈవ్‌టీజర్లను పట్టుకుని జైలుకు పంపుతారు. మహిళల కోసమే ప్రత్యేకంగా నడుస్తున్న మాతృభూమి రైలులో తొమ్మిది బోగీలు ఉండగా ఆరుగురు లేడీ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించారు. రైలు ప్రయాణం ఉదయం ప్రారంభమై రాత్రి తిరిగి యార్డుకు చేరే వరకు వీరు విధుల్లో ఉంటారు.
ఎంఎంటీఎస్‌లలో...
నగరంలో నడిచే అన్ని ఎంఎంటీఎస్ రైళ్లలో గతంలో ఒక రైలుకు ఒక హోంగార్డు మాత్రమే విధుల్లో ఉండేవాడు. ప్రస్తుతం ప్రతీ రైలుకు ముగ్గురు హోంగార్డులను నియమించారు. ప్రతీ రైలులో మహిళలకు కేటాయించిన మూడు బోగీల్లో బోగీకి ఒక్కరు చొప్పున ఆర్‌పీఎఫ్ లేడీ కానిస్టేబుల్‌ను నియమించారు. అనుమానితులపై నిఘా పెట్టేందుకు మఫ్టీలో ఉన్న ఆర్‌పీఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నారు.
ప్రత్యేక డ్రైవ్ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్..
ఎంఎంటీఎస్ రైళ్లలో పహారాలో ఉన్న సిబ్బంది పని తీరును సమీక్షించడంతో పాటు, ఆకతాయిల పనిపట్టేందుకు, సీతాఫల్‌మండి, ఆర్ట్స్ కళాశాల, సంజీవయ్యపార్కు, బేగంపేట్, బల్కంపేట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు మఫ్టీలో ఇద్దరు అధికారుల నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
తప్పు చేస్తే జైలుకే..
ఎంఎంటీఎస్ రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు ఎటువంటి తప్పు చేసినా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. మహిళల్ని వేధించేవారిని వదిలిపెట్టం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మహిళల్ని వేధించి కేసుల్లో చిక్కి భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు. రైళ్లలో జేబు, సెల్‌ఫోన్ దొంగలు, చైన్ స్నాచర్ల సంచారాన్ని పూర్తిగా నియంత్రిస్తాం.
-అశ్వినీకుమార్, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, సికింద్రాబాద్