సాక్షి, నిజామాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అస్సలు పట్టించుకోకపోవడం వెనుక అనేక ఆరోపణలున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఖలీల్‌వాడిలో వెలిసి ఆకాశహర్మ్యాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడ దాదాపు 80 శాతం భవనాలు నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించినవే. సెట్‌బ్యాక్ లేకుండా కట్టారు. కొన్ని భవనాలైతే ఏకంగా ఇరుకు రోడ్లను కూడా ఆక్రమించేశాయి. రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకుని తలదాచుకున్న తమ గుడిసెలపైకి వచ్చిన యంత్రాలు అక్రమంగా వెలిసిన భవనాలను ఎందుకు కూల్చవని నిరుపేదలు, చిరువ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. పలు వాణిజ్య సముదాయాలు అగ్ని ప్రమాద జాగ్రత్తలు కూడా పా టించడం లేదు. రాజకీయ ఒత్తిళ్లను సాకుగా చూపుతున్న బల్దియా బాబులు ‘మామూలు’తో సరిపెడుతున్నారు.
అంతస్తుకు రూ.లక్ష చెల్లిస్తే చాలు
మున్సిపల్ కార్పొరేషన్‌లోని సిటీ ప్లానింగ్ విభాగం అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. బడాబాబులు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు మున్సిపల్ శాఖ డెరైక్టరేట్, రీజనల్ డెరైక్టరేట్‌ల నుంచి నామమాత్ర అనుమతులు పొంది.. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఐదు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను అస్సలు అడ్డుకోవడం లేదు. దీంతో చూస్తుండగానే అవి ఆకాశాన్నంటుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు కొందరు ఒక్కో ఫ్లోర్‌కు రూ. లక్ష ముడుపులు తీసుకోవడం బహిరంగ రహస్యంగా మారిందంటున్నారు. అధికారులకు స్థాయిని బట్టి వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలున్నాయి.
నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులే
నగరంలోని పలు వ్యాపార, వాణిజ్య కాంప్లెక్సులు, ప్రైవేటు ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. పార్కింగ్ స్థలాలను కూడా వ్యాపార అవసరాలకే వినియోగించడంతో వాహనాలను రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. శనివారం ఆక్రమణలను తొలగించిన బస్టాండ్- రైల్వేస్టేషన్ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారాలను తొలగించిన అధికారులకు..ఖలీల్‌వాడిలోని ట్రాఫిక్ సమస్య ఎందుకు కనిపించదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆధారం కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్నారు.
పేదలే దొరికారా?
Published Sun, Dec 22 2013 6:37 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement
Advertisement