
‘లెక్క’ల కాలం
రూ.1000 కోట్ల ఆదాయమే లక్ష్యం
భవనాల క్రమబద్ధీకరణపై చర్చ
నివేదిక తయారీలో అధికారుల నిమగ్నం
పార్కింగ్‌పై నో రాజీ?
సిటీబ్యూరో: నగరంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్) అమలు దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేస్తోంది. తమ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉంటాయి? తద్వారా ఖజానాకు ఎంత ఆదాయం రావచ్చనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భవనాల క్రమబద్ధీకరణ విధి విధానాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసే పనిలో పడ్డారు. ఇటీవల ఒక టీవీ చానెల్‌లో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ వారి ప్రశ్నలకు స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు దీనిపై లెక్కలు వేస్తున్నారు. గతంలో ఇదే కార్యక్రమాన్ని బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే. 2007లో ప్రారంభమైన ఆ పథకం 2013 వరకు కొనసాగింది. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.868 కోట్ల ఆదాయం లభించింది. ఆ పథకాన్ని అమలు చేసేటప్పుడే భవిష్యత్తులో ఇంకెప్పుడూ బీపీఎస్‌కు అవకాశమివ్వబోమని ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. దాని వల్లనో, ఇతరత్రా కారణాలతోనో... ఈ పథకాన్ని బీఆర్‌ఎస్‌గా సీఎం ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆదాయం కోసమే...?
బీపీఎస్ గడువు ముగిశాక కూడా అక్రమ నిర్మాణాలు ఆగలేదు. వివిధ కారణాలతో వీటికి అడ్డుకట్ట వేయలేకపోయారు. అలాంటి అక్రమ నిర్మాణాలు 60 వేల నుంచి లక్షన్నర వరకు ఉండవచ్చునని టౌన్ ప్లానింగ్ అధికారుల అంచనా. వాటి ద్వారా వీలైనంత ఆదాయాన్ని పొందడంతో పాటు... భవిష్యత్‌లో అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలనేది ప్రభుత్వ యోచన. బీపీఎస్ కంటే అధిక మొత్తంతో క్రమబద్ధీకరణ ఫీజులు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో చేపట్టనున్న ఎక్స్‌ప్రెస్‌వేలు, స్కైవేలు, మల్టీలెవెల్ గ్రేడ్‌సెపరేటర్లకు అవసరమైన నిధులు బీఆర్‌ఎస్ ద్వారా పొందవచ్చని యోచిస్తున్నారు. అయితే... అంత ఆదాయం రావడం కష్టమని కొందరు టౌన్‌ప్లానింగ్ నిపుణులు చెబుతున్నారు. అధికారులు అంచనా వేసినంత భారీగా అక్రమ నిర్మాణాలు ఉండకపోవచ్చనేది వారి అభిప్రాయం. 2008 నుంచి మార్ట్‌గేజ్(తనఖా) నిబంధన అమలు చేస్తున్నారు.
నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తేనేఓసీ జారీ చేస్తున్నారు. లేనిపక్షంలో తనఖా పెట్టుకున్న భవనంలోని కొంతభాగాన్ని విడుదల చేయడం లేదు. దీనివల్ల చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఆగాయనేది వారి ఆలోచన. ఓసీ పొందాక అదనపు అంతస్తులు నిర్మించినవారు, డీవియేషన్లకు పాల్పడ్డ వారు భారీగా ఉన్నారని... వారిని దృష్టిలో పెట్టుకుంటే మరో రూ.800 కోట్లు రాగలవని అధికారుల అభిప్రాయం. ఈ అంశాన్ని కూడా వారు నివేదికలో పొందుపరిచే వీలుంది.
పార్కింగ్‌కు మినహాయింపు లేదు
పార్కింగ్ ప్రదేశాల్లోని ఉల్లంఘనలను మాత్రం బీఆర్‌ఎస్‌కు అనుమతించవద్దనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరత్రా ఉల్లంఘనలను అనుమతించినా... నగరంలోని పరిస్థితుల దృష్ట్యా పార్కింగ్ ప్రదేశం విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని అంశాలతో నివేదిక అందించి... ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలకు సిద్ధం కానున్నారు.