అక్రమ కట్టడాలపై చర్యలు
► ఏకీకృత మాస్టర్‌ప్లాన్ పూర్తయింది.. ప్రభుత్వానికి కూడా పంపాం
► దాదాపు 200కు పైగా కేసులను పర్యవేక్షణ చేస్తున్నాం
► గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ లేఅవుట్‌లపై చర్యలు
► ‘సాక్షి’తో హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు సేవలు అందించడంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు పరిచయం చేసిన డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు వచ్చే ఆదాయం రెట్టింపయింది. గతంలో నెలకు రూ.7 కోట్ల వరకు ఆదాయం ఉంటే ప్రస్తుతం రూ.15 కోట్ల వరకు చేరింది. అంతేకాకుండా బిల్డింగ్ పర్మిషన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూ, లేఅవుట్ పర్మిషన్, ఎన్‌వోసీలు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ వేగవంతమై నగరవాసులకు సేవలు త్వరతగతిన అందిస్తున్నాం. తద్వారా ఆదాయం రెట్టింపునకు అవకాశం ఏర్పడింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లలో మార్పులు తీసుకురావడం ద్వారా ఆదాయం పెరిగింది.
ఏకీకృత మాస్టర్ ప్లాన్ పూర్తి
నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతున్న ఐదు అభివృద్ధి సంస్థలను అనుసంధానం చేసే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పూర్తి చేశాం. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ( హుడా), హైదరాబాద్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ, సైబరాబాద్ అభివృద్ధి సంస్థ (సీడీఏ), పాత హైదరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్), హెచ్‌ఎండీఎ వేర్వేరు మాస్టర్‌ప్లాన్‌ల వల్ల జోన్‌లలో చాలా సమస్యలు తలెత్తుతుండడంతో వీటన్నింటిని జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్ ద్వారా ఒకే గొడుకు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు సేకరించాం. ఈ ఏకీకృత మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించాం.
కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి
రెండేళ్ల నుంచి హెచ్‌ఎండీఏకు సంబంధించి దాదాపు 200కుపైగా కేసుల్లో న్యాయస్థానాల్లో జరిగే వాదనలను పర్యవేక్షిస్తున్నాం. ఓఆర్‌ఆర్ కోకాపేటకు సంబంధించి భూవిషయంపై సుప్రీంలో వాదనలు ముగిశాయి. కబ్జా కోరల్లో చిక్కుకున్న 2,370.25 ఎకరాలకు సంబంధించి జవహర్‌నగర్ భూముల విషయంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించాం. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఆదాయం పెరిగింది..
గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్‌ఎండీఏ పరిధిలో వెలిసిన అక్రమ భవనాలు, లే అవుట్‌ల కూల్చివేత ప్రక్రియకు గతేడాది శ్రీకారం చుట్టాం. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. ఫలితంగా బిల్డింగ్ పర్మిషన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూ, లేఅవుట్ పర్మిషన్‌ల దారిపడుతున్నారు. దీంతో హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం పెరిగింది. భవిష్యత్‌లోనూ అక్రమ కట్టడాల గురించి సమాచారం తెలిస్తే కూల్చివేతకు వెనుకాడం.