DPMS
-
పడకేసిన ‘ఈ–ఆఫీస్’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కాగిత రహిత సేవల అమలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల కోసం ఆన్లైన్ సేవల్లో భాగంగా తీసుకొచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) తరహాలోనే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను గతేడాది అక్టోబర్ 2న పరిచయం చేసినా ఇప్పటివరకు పూర్తిస్థాయి అమలుకు నోచుకొలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేస్తున్న నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ) సాఫ్ట్వేర్ సహకారంతో హెచ్ఎండీఏలోని దాదాపు 15కు పైగా శాఖల్లో ఈ–ఆఫీసు సేవలను దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే అందులో పురోగతి కనిపించడం లేదు. గత ఏడాది అక్టోబర్ 2న అప్పటి కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి హెచ్ఎండీఏ కార్యాలయంలో అంతర్గతంగా జరిగే సేవలను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టినా ఆ తర్వాత అంతగా పట్టించుకున్న వారు కరువయ్యారు. ప్రస్తుత హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్‌కు వివిధ ప్రభుత్వ విభాగాల అధనపు బాధ్యతలతో బిజీగా ఉండటంతో ఈ విభాగాన్ని చూసే అధికారులు దీనిపై శ్రద్ధ చూపడం లేదు. డీపీఎంఎస్ తరహాలోనే... లేఅవుట్, భవన నిర్మాణ అనుమతుల కోసం అమలులోకి తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ఆన్లైన్ సేవలు అటు దరఖాస్తుదారులకు తమ ఫైల్ ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయా విభాగ ఉన్నతాధికారులు కూడా సంబంధిత ఫైల్ ఏ అధికారి వద్ద ఉందో క్షణాల్లో తెలుసుకొని క్లియర్ చేసేలా ఆదేశాలిస్తుండటంతో ఆన్లైన్ సేవల వల్ల దరఖాస్తుదారులకు త్వరిగతిన సేవలు అందుతున్నాయి. ఇదే విధానాన్ని హెచ్ఎండీఏ కార్యాలయంలో అంతర్గతంగా జరిగే సేవలకు అనుసంధానించాలని అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఐటీ విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ) సాఫ్ట్వేర్ సహకారంతో హెచ్ఎండీఏలోని దాదాపు 15కుపైగా శాఖల్లో ఈ–ఆఫీసు సేవలను అమలు చేయాలని నిర్ణయించారు. అకౌంట్స్, ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్, స్టోర్స్, ఓఆర్ఆర్ భూసేకరణ విభాగం, పీఆర్వో...ఇలా వివిధ విభాగాల్లో ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి ఆన్లైన్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకరావల్సి ఉన్నా అవి కార్యాచరణకు నోచుకోలేదు. ఒకవేళ ఆయా విభాగ అధికారులు సెలవులో ఉన్నా ప్రాధాన్యం గల ఫైల్స్‌ను క్లియర్ చేసేందుకు ఈ–ఆఫీసు ఉపయుక్తకరంగా ఉంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ–ఆఫీసు వల్ల అటు కార్యాలయ సిబ్బందికి, ఇటు ప్రజలకు కూడా ఉపయుక్తం ఉంటుందని, ఇప్పటికైనా ఈ పనుల్లో వేగిరం పెరిగేలా ఐటీ విభాగంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
కామన్ కష్టాలు ఇక ఉండవ్!
సాక్షి, సిటీబ్యూరో: ఘట్కేసర్కు చెందిన రాజేశ్ తన 200 గజాల్లో భవన నిర్మాణ అనుమతి కోసం 2018 జనవరిలో హెచ్ఎండీఏకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, రెవెన్యూ విభాగం నుంచి ‘నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్’ (నాలా) సర్టిఫికెట్ సమర్పించాలంటూ ప్లానింగ్ అధికారులు షార్ట్‌ఫాల్స్ పంపారు. దీంతో అతను ఆ సర్టిఫికెట్ కోసం దాదాపు మూడు నెలల పాటు రెవెన్యూ విభాగం చుట్టూ తిరగాల్సి వచ్చింది. అమీన్పురాకు చెందిన అరుణ్ తన 250 గజాల ప్లాట్‌లో ఇల్లు కట్టుకునేందుకు 2018 జూన్‌లో హెచ్ఎండీఏకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ ప్లాట్ చెరువుకు సమీపంలో ఉందంటూ ప్లానింగ్ అధికారులు జాయింట్ కలెక్టర్ స్థాయికి తగ్గకుండా ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తేవాలంటూ షార్ట్‌ఫాల్ పంపారు. దీంతో అతడు ఆ సర్టిఫికెట్ల కోసం నాలుగు నెలలపాటు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగితేగాని పని కాలేదు. ఇలాంటి కష్టాలు ఇంటి నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్న చాలామందికి అనుభవమే. సదరు సర్టిఫికెట్లు పొందేందుకు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ విభాగాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఫలితంగా హెచ్ఎండీఏ నుంచి నిర్ణీత సమయంలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు ఇవ్వడంలో ఆలస్యమవుతోంది. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ఎన్ఓసీల జారీపై ప్రత్యేక కమిటీ భేటీ అవుతున్నా.. సేవల్లో మరింత వేగాన్ని పెంచేందుకు హెచ్ఎండీఏ అధికారులు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం(డీపీఎంఎస్)లోనే ‘కామన్ అప్లికేషన్’ విధానానికి రూపకల్పన చేశారు. భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ఎన్ఓసీ బటన్ క్లిక్ చేసేలా ఫీచర్లు రూపొందించి ట్రయల్ రన్ చేశారు. ఈ సేవలను సాధ్యమైనంత త్వరగా అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ కృషి చేస్తోంది. ఎన్ఓసీల కోసం ప్రత్యేక ఫీచర్లు భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల కోసం ఆన్లైన్ డీపీఎంఎస్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలోనే నాలా, ఇరిగేషన్ ఎన్ఓసీల కోసం ప్రత్యేక ఫీచర్స్‌ను రూపొందించారు. నాలాలు, కుంటలు, చెరువులకు సమీపంలో ఉన్న ప్లాట్ల దరఖాస్తుదారులు యథావిధిగా బిల్డింగ్‌కు అవసరమైన అన్నీ పత్రాలు ఆప్‌లోడ్ చేయడంతో పాటు ఇరిగేషన్ ఎన్ఓసీ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ దరఖాస్తుదారుడు ఇది క్లిక్ చేయకపోయినా ప్లానింగ్ అధికారులు సదరు ఎన్ఓసీకి అదే ఫీచర్ ద్వారా దరఖాస్తు చేస్తారు. వీటిని రెవెన్యూ, ఇరిగేషన్ విభాగం ఉన్నతాధికారులు పరిశీలించి 15 రోజుల్లోగా ఎన్ఓసీని ఆన్లైన్ ద్వారానే హెచ్ఎండీఏకు సమర్పిస్తారు. తర్వాత హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు ఆ ఫైల్‌ను క్లియర్ చేసి అనుమతిస్తారు. ఇరిగేషన్ ఎన్ఓసీ మాదిరిగానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ (నాలా) సర్టిఫికెట్ కూడా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ ద్వారానే సమర్పిస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ కొత్త విధానాన్ని సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చినా ప్ర త్యేక ఎన్ఓసీ కమిటీ ప్రతి పది రోజులకోసారి భేటీ అవుతుందని, దీనిద్వారా అనుమతుల్లో వేగం పెరిగి సంస్థకు ఆదాయం పెరగడంతో పాటు దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పు తాయని హెచ్ఎండీఏ ప్లానింగ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ తీసుకొస్తున్న ఈ ‘కామన్’ అప్లికేషనతో హెచ్ఎండీఏ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
సిటిజన్ ఫ్రెండ్లీగా..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఇక భవన నిర్మాణ అనుమతులు మరింత సరళతరం కానున్నాయి. నిబంధనలకు లోబడి ఉన్న అన్ని దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలోనే అనుమతులు జారీచేసేలా పూర్తి ఆన్లైన్ సిస్టంను అమలు చేసేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే డీపీఎంఎస్ (డెవలప్మెంట్ ఆఫ్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం) లో భాగంగా ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తోన్న జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో భాగంగా సిటిజెన్ ఫ్రెండ్లీగా మరింత సులభతరం, పారదర్శక సేవలు అందివ్వనుంది. ఇందులో భాగంగా వివిధ శాఖల అనుమతుల కోసం ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్ని అనుమతులు సింగిల్ విండో ద్వారా ఇవ్వనున్నారు. ఏకగవాక్ష, సమగ్ర ఆన్లైన్ విధానంగా దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. ఇదీ విధానం.. సిటెజెన్ లేదా ఆర్కిటెక్ట్ ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్లౌడ్ బేస్డ్ వర్క్ ఫ్లో ద్వారా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. మాస్టర్ ప్లాన్, టెక్నికల్, లీగల్, సైట్ ఇన్స్పెక్షన్ తదితర అంశాలన్నీ ఈ క్లౌడ్ ఆధారిత విధానం ద్వారానే పరిశీలిస్తారు. అనంతరం ఈ అనుమతుల దరఖాస్తులు వెబ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆటో డీసీఆర్ డ్రాయింగ్ల ద్వారా పరిశీలించి సక్రమంగా ఉన్నాయా లేక డీవియేషన్లు ఉన్నాయా అనే అంశంపై 15 నిమిషాల్లోనే సమగ్ర నివేదికను సిస్టమ్ తెలియజేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన కూడా మొబైల్ యాప్ ఆధారితంగానే ఉంటుంది. అనుమతులన్నింటినీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారానే అందజేస్తారు. అనుమతులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జీహెచ్ఎంసీ వెబ్సైట్, ఎస్ఎంఎస్, ఈ–మెయిల్, వ్యక్తిగత మొబైల్ యాప్‌లలో అప్డేట్ అవుతాయి. అనుమతులకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు సైతం ఆన్లైన్లో చేయవచ్చు. ఆమోదించిన ప్లాన్లు, అనుమతులు కూడా మెయిల్స్‌కు వస్తాయని, వెబ్సైట్ నుంచి కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని కమిషనర్ పేర్కొన్నారు. ఈ అత్యంత ఆధునిక ఆన్లైన్ విధానం ద్వారా ఫైళ్ల ప్రాసెస్ ఏడంచెల నుంచి నాలుగంచెలకు తగ్గుతుంది. ఇందుకుగాను క్ష్రేతస్థాయి పరిశీలనలో భాగంగా సైట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఫొటోలను మోబైల్‌యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌టెక్ సంస్థ రూపొందించిన ప్రజంటేషన్ను కమిషనర్ దానకిషోర్ శుక్రవారం పరిశీలించారు. ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ అధికారులతో ఈ విధానంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో డీపీఎంఎస్ విధానం అమలులో ఉన్నప్పటికీ ఇది అధికారుల వ్యక్తిగత నియంత్రణలో ఉందని, టౌన్‌ప్లానింగ్ ద్వారా అందించే సర్వీస్‌లను విధానపరంగా కేంద్రీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకుగాను దరఖాస్తుల స్వీకరణ నుండి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ వరకు మొత్తం విధానాన్ని ఆన్లైన్ ద్వారానే చేయనున్నట్టు కమిషనర్ వివరించారు. డీపీఎంఎస్‌ను ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి మాత్రమే వినియోగిస్తుండగా, కొత్త విధానంలో ఖాళీ స్థలాల లేఅవుట్ అనుమతులు, గేటెడ్ కమ్యూనిటీల లే ఔట్ల అనుమతులు, ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలన్నింటినీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలో అవగాహన కార్యక్రమాలు.. ఈ నూతన విధానంపై నగరవాసులు, ముఖ్యంగా బిల్డర్లు, వ్యక్తిగత భవన నిర్మాణదారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు దానకిషోర్ తెలిపారు. నిర్మాణ అనుమతులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని డిప్యూటీ, జోనల్ కమిషనర్ల కార్యాలయాలతో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా డ్యాష్ బోర్డులను ఏర్పాటుచేసి ప్రజలకు తెలిసేలా ప్రదర్శించనున్నట్లు కమిషనర్ తెలిపారు. దీని ద్వారా అనుమతులు ఈజీ అవుతాయన్నారు. -
ఇల్లు కట్టి చూడు!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పట్టణం రెహ్మత్ నగర్లో సయ్యద్ షర్ఫోద్దీన్ (పేరుమార్చాం) ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తనకు 230 చదరపు మీటర్ల ప్లాట్ ఉంది. కష్టార్జితం నుంచి దాచిన డబ్బుతో పాటు కొంత బ్యాంకు లోన్ తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నారు. అనుమతి కోసం డీపీఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 14 రకాల ఫీజులు, పన్నులు కలిపి రూ.96,783 ఫీజు వసూలు చేశారు. డీపీఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి లైసెన్స్డ్ ఇంజనీర్ రూ.10 వేలు తీసుకోగా, అధికారులు సంతకం పెట్టడానికి మామూళ్లు తీసుకుంటారని పేర్కొని మరో రూ.10 వేలు వసూలు చేశాడు. షర్ఫోద్దీన్లా సొంతిళ్లు కట్టుకోవాలని కలలు కనడం మధ్య తరగతి ప్రజలకు శాపమైంది. భవన నిర్మాణ అనుమతులు పెనుభారంగా తయారయ్యాయి. చక్కగా అనుమతి తీసుకుని పద్ధతి ప్రకారం ఇళ్లు కట్టుకుంటామని దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం డజనుకు పైగా ఫీజులు వడ్డించి నడ్డి విరుస్తోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు కనీసం 200–250 చ.మీ. స్థలంలో సాదాసీదా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకుందా మనుకున్నా రూ.లక్షకు పైగా ఫీజు వసూలు చేస్తోంది. సంతకాల పేరుతో మునిసిపల్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వసూలు చేసే వేల రూపాయల మామూళ్లు దీనికి అదనం. సామాన్య కుటుంబాలు అప్పు చేసి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల బడ్జెట్‌తో ఓ మోస్తారు ఇంటి నిర్మాణానికి ప్రణాళిక వేసుకుంటే భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు, మామూళ్ల రూపంలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 250 చ.మీ. ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20 వేల నుంచి రూ.25 వేల ఫీజులు ఉండగా, ఆ తర్వాత ఒక్కసారిగా రూ.లక్షకు చేరింది. భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలన పేరుతో ఆన్లైన్ విధానంలో అనుమతుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ఇందుకు కారణమైంది. గతంలో రెండు మూడు రకాల ఫీజులు వసూలు చేసి భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే వారు కాగా, డీపీఎంఎస్ వచ్చిన తర్వాత ఏకంగా 14 రకాల ఫీజులను వసూలు చేస్తుండటమే దీనికి కారణం. దరఖాస్తు చేసుకుంటే దొరికిపోయినట్లే.. ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ‘ఫీ’బకాసురులకు చిక్కినట్లే. ఇదే అవకాశం.. మళ్లీ దరఖాస్తుదారుడు తమ దగ్గరకు రాడని ప్రభుత్వం ఇంటి నిర్మాణ అనుమతులతో సంబంధం లేని ఫీజులు, పన్నులన్నింటినీ డీపీఎంఎస్ కింద ఆన్లైన్లో తప్పనిసరిగా చెల్లించాల్సిన ఫీజుల జాబితాలో చేర్చింది. ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్), డెవలప్మెంట్ చార్జీ (వేకెంట్ ల్యాండ్)ల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తోంది. వర్షపు నీటి సంరక్షణ చార్జీల పేరుతో రూ.3,680 వసూలు చేస్తున్న పురపాలక శాఖ.. తిరిగి ఆ నిధులతో దరఖాస్తుదారుల ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణానికి వినియోగించకుండా సొంత జేబుల్లో వేసుకుంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ ఇలాంటి గుంతలు నిర్మించినా, రాష్ట్రంలోని మిగిలిన మునిసిపాలిటీల్లో ఒక్క గుంతను సైతం నిర్మించలేదు. మునిసిపాలిటీల పరిధిలోని చాలా వరకు ఖాళీ స్థలాలకు లే అవుట్ అనుమతులు ఉండవు. మధ్య తరగతి ప్రజలు అవగాహన లేక ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ సైతం చేసుకోరు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరణ ఫీజుల పేరుతో రూ.వేలను వసూలు చేస్తున్నారు. పాత తేదీలతో అక్రమ అనుమతులు ... డీపీఎంఎస్ ద్వారా ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం రూ.లక్షల్లో ఫీజులు, పన్నులు చెల్లించాల్సి రావడం చాలా మునిసిపాలిటీల్లో కొత్త రకం అవినీతికి ఆజ్యం పోసింది. డీపీఎంఎస్‌లో కాకుండా పాత తేదీల (యాంటీ డేట్స్)తో చాలా మునిసిపాలిటీల్లో అక్రమ అనుమతులు జారీ చేస్తున్నారు. డీపీఎంఎస్ ద్వారా చెల్లించాల్సిన ఫీజులు, పన్నుల మొత్తంలో 25 శాతాన్ని లంచంగా తీసుకుని టౌన్‌ప్లానింగ్ అధికారులు పాత తేదీలతో అనుమతులు జారీ చేసేస్తున్నారు. చాలా మునిసిపాలిటీల్లో పాత ఫైళ్లు ధ్వంసం కావడంతో ఇలాంటి అనుమతులు జారీ చేయడం సులువుగా మారింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీగా మారిన చోట్లలో ఇలాంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మధ్య దళారులుగా లైసెన్స్డ్ ఇంజనీర్లు.. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతుల జారీకి డీపీఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినా దరఖాస్తుదారులు లంచాలు ఇవ్వకతప్పడం లేదు. ప్రైవేటు లైసెన్స్డ్ ఇంజనీర్ సాయం లేనిదే బిల్డింగ్ ప్లాన్ తయారీ, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు లేదు. దీంతో చాలా మునిసిపాలిటీల్లో మామూళ్ల వసూళ్లలో ఈ ఇంజనీర్లు దళారుల అవతారమెత్తారు. మునిసిపల్ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు/సూపర్వైజర్లు సంతకం చేయడానికి డబ్బులు తీసుకుంటారని చెప్పి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో సైట్ ఇన్స్పెక్షన్కు వచ్చే టౌన్ ప్లానింగ్ సిబ్బంది స్వయంగా దరఖాస్తుదారుల నుంచి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సైట్ ఇన్స్పెక్షన్ నివేదికలో కొర్రీలు వేసి అనుమతుల జారీలో జాప్యం చేస్తున్నారు. కేవలం 21 రోజుల్లో డీపీఎంఎస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుండగా, అత్యధిక శాతం కేసుల్లో కొర్రీలతో జాప్యం జరుగుతుండటం గమనార్హం. -
నగరంలో ఇక ఆ వాహనాలు హల్చల్
సాక్షి, సిటీబ్యూరో:ఇప్పటికే ఈ–ఆఫీస్, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్, డీపీఎంఎస్ (డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం) వంటి వివిధ అంశాల్లో దేశంలోని ఇతర మునిసిపల్ కార్పొరేషన్ల కంటే ముందంజలో ఉన్న జీహెచ్ఎంసీ..మరో వినూత్న కార్యక్రమానికి సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలోని అధికారులకు వినియోగిస్తున్న అద్దె కార్ల స్థానే ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలిదశలో క్షేత్రస్థాయి పర్యటనలు లేని.. కార్యాలయంలో మాత్రమే విధులు నిర్వహించే అధికారులకు ఈ ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలోకి తేనున్నారు. పర్యావరణ హితం, విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా ఇప్పటికే జీహెచ్‌ంఎసీలో నాలుగులక్షల పైచిలుకు ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేసిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ద్వారానే ఎలక్ట్రిక్ కార్లను అద్దెప్రాతిపదికన తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలిదశలో 20 నుంచి 50 ఎలక్ట్రిక్ కార్లను తీసుకునే యోచనలో ఉన్నారు. క్రమేపీ వీటి సంఖ్యను పెంచుతారు. 349 అద్దె కార్ల వినియోగం... జీహెచ్ఎంసీలోని అధికారుల కోసం 349 అద్దెకార్లను వినియోగిస్తున్నారు. ఒక్కో కారుకు నెలకు రూ.34 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇదే మొత్తంతో ఎలక్ట్రిక్ కార్లను అద్దెపై వినియోగంలోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైనట్లు తెలిసింది. వాస్తవానికి ఈఈఎస్ఎల్ డ్రైవర్‌తో సహా ఎలక్ట్రిక్ కార్లకు నెలకు రూ.40 వేల అద్దె తీసుకుంటుంది. జీహెచ్ఎంసీలో 976 మంది ఔట్సోర్సింగ్ డ్రైవర్లున్నారు. జీహెచ్ఎంసీలోని పలు పాతవాహనాలకు కాలం చెల్లడంతో వీరిలో కొందరికి పనిలేక ఖాళీగా ఉంటున్నారు. వారిని ఎలక్ట్రిక్ కార్లకు డ్రైవర్లుగా వినియోగించుకోవాలనే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. ఇదే అంశాన్ని ఈఈఎస్ఎల్కు వివరిస్తూ డ్రైవర్లు లేకుండానే ఎలక్ట్రిక్ కార్లను అద్దెకివ్వాల్సిందిగా సూచించింది. కార్ల నిర్వహణ మాత్రం ఈఈఎస్‌ఎల్‌దే. ఇందుకుగాను నెలకు రూ.22 వేల అద్దె చెల్లిస్తామని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు దాదాపు రూ.12 వేల వేతనం చెల్లిస్తున్నారు. డ్రైవర్ వేతనం, కారు అద్దె రెండూ కలిపితే నెలకు రూ.34 వేలే అవుతుండటంతో జీహెచ్ఎంసీకి ఎలాంటి అదనపు భారం పడదు. పైగా ఖాళీగా ఉన్న డ్రైవర్లకు పని కల్పించినట్లువుతుంది. ఇందుకు ఈఈఎస్ఎల్ కూడా అంగీకరించినట్లు సమాచారం. తొలి దశలో 20 నుంచి 50 కార్లు అద్దెకు... క్షేత్రస్థాయి పర్యటనలు ఉండని, కార్యాలయాల్లో మాత్రమే విధులు నిర్వహించే అకౌంట్స్, ఫైనాన్స్, వంటి విభాగాల్లోని అధికారులకు వీటిని కేటాయించనున్నారు. వారు కేవలం ఇంటినుంచి కార్యాలయానికే పరిమితం కనుక చార్జింగ్ సమస్యలుండనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులను కార్యాలయంలో దింపాక చార్జింగ్ చేసేందుకు తగినంత సమయం కూడా లభిస్తుంది. స్వచ్ఛ ఆటోలకూ.. ప్రస్తుతం ఇంటింటి నుంచి చెత్త సేకరించి చెత్త రవాణా కేంద్రానికి చేర్చేందుకు ఆటో టిప్పర్లను (స్వచ్ఛ ఆటోలు)వాడుతున్నారు. ప్రస్తుతం రెండువేల ఆటోటిప్పర్లుండగా, వివిధ సర్కిళ్ల నుంచి ఇంకా కావాలనే డిమాండ్లున్నాయి. మరో 500 స్వచ్ఛ ఆటోలు త్వరలో రానున్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలైతే అన్ని విధాలా మేలు కావడంతో భవిష్యత్‌లో చార్జింగ్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ ఆటోలు ఉదయం ఇళ్ల నుంచి చెత్త సేకరించాక, మధ్యాహ్నం నుంచి పని ఉండదు. ఆ సమయంలో చార్జింగ్కు కావాల్సినంత సమయం ఉండటంతో ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుంటే మంచిదనే యోచనలో ఉన్నారు. పలు సంస్థల్లో.. ఈఈఎస్ఎల్ ఇప్పటికే పలు నగరాల్లో, పలు సంస్థలతో ఎలక్ట్రిక్ కార్లు అద్దెకిచ్చేందుకు ఒప్పందం పూర్తిచేసుకుంది. వాటిల్లో పవర్ ఫైనాన్స్కార్పొరేషన్(పీఎఫ్సీ), సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ),మధ్యగుజరాత్విద్యుత్ కంపెనీ లిమిటెడ్(ఎంజీవీసీఎల్), దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ), ఎన్టీపీసీ (నేషనల్థర్మల్ పవర్‌కార్పొరేషన్), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) తదితరమైనవి ఉన్నాయి. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సైతం పదివేల కార్లకు ఒప్పందం కుదుర్చుకోగా శాంపిల్‌గా కొన్ని అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రప్రభుత్వం 8 వేల కార్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల్ని వినియోగించే వాహన వినియోగాన్ని భవిష్యత్తులో రద్దుచేసే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం, కేంద్ర ఇంధన, పరిశ్రమల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి రోడ్లపై తిరిగే అన్ని వాహనాలూ విద్యుత్ వాహనాలే ఉండాలనేది లక్ష్యం. ఎలక్ట్రిక్ కార్ల గురించి.. ♦ ఒక సారి ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేసేందుకు 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి పూర్తి చార్జి చేస్తే 100 నుంచి 130 కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు. ♦ అత్యవసరంగా చార్జింగ్ కావాలనుకుంటే ఫాస్ట్ చార్జర్లు వాడవచ్చు. 30 నిమిషాల్లో ఫుల్‌చార్జ్ అవుతాయి. ♦ వీటి ద్వారా వాయు, ధ్వని కాలుష్యం లేకపోవడమే కాక కార్బన్ డయాక్సైడ్ వెలువడదు. ♦ గరిష్టంగా గంటకు 80 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయి. ♦ బ్యాటరీలను చార్జింగ్ చేసేందుకు జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తారు. ♦ చార్జింగ్ వల్ల కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రూ.0.89 పైసలు ఖర్చవుతుంది. ♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం. ♦ ఆరేళ్ల వరకు అద్దె ఒప్పందం కుదుర్చుకోనున్నారు. పర్యావరణానికి ప్రాధాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర కార్పొరేషన్ల కంటే జీహెచ్ఎంసీని ప్రత్యేకంగా నిలిపేందుకు ఆయన వీటిపై శ్రద్ధ చూపుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నేను ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై ఆయన అధ్యయనం చేసి వచ్చాను. ఈ కార్ల వల్ల ఎన్నో లాభాలున్నాయి. – ఇ.శ్రీనివాసచారి, జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -
ఇళ్లు కట్టనీకి ఇన్ని తిప్పలా..!
► భవన నిర్మాణ అనుమతుల జారీలో తీవ్ర జాప్యం.. ► ఆన్లైన్ దరఖాస్తుల విధానం వచ్చినా మారని తీరు ► నెలలో అనుమతులు జారీ చేస్తామన్న ప్రభుత్వం.. ► 3 నుంచి 4 నెలలు పడుతున్న వైనం.. ► టౌన్ ప్లానింగ్ పోస్టులు సగానికి పైగా ఖాళీ.. దరఖాస్తులకు బూజు ఇల్లుగానీ, భవనం గానీ కట్టాలనుకుంటున్నారా.. అయితే నగర, పురపాలక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడానికి సిద్ధమైపోండి. అనుమతులు రావాలంటే ఆ మాత్రం తిప్పలు తప్పేలాలేవు మరి. సిబ్బంది లేక, ఆన్లైన్ సర్వర్ పని చేయక నిర్మాణ దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ఆన్లైన్లో 30 రోజుల్లో అనుమతుల జారీకి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) విధానం ప్రవేశపెట్టినా.. క్షేత్రస్థాయిలో అనుమతులు చేతికందేసరికి 3, 4 నెలలు పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ సిబ్బంది లేక.. వెబ్సైట్ పని చేయక.. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉండటంతో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 నగర, పురపాలక సంస్థల్లో 390 టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లు (టీపీఎస్), టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు (టీపీఓ), టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ (టీపీబీఓ) పోస్టులుండగా.. 183 మందే పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), ప్రాంతీయ టౌన్ ప్లానింగ్, జిల్లా టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ 180 పోస్టులకు 84 ఖాళీగా ఉన్నాయి. దీంతో అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. డీపీఎంఎస్ వెబ్సైట్ సర్వర్ గంటల తరబడి మొరాయిస్తుండటమూ జాప్యానికి మరో కారణమని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. కాగా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది లేని మున్సిపాలిటీల్లో పొరుగు మున్సిపాలిటీల టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వారంలో 3 రోజులు పని చేసేలా సర్కారు సర్దుబాటు చేసింది. పరిష్కరించరు.. అనుమతులివ్వరు.. లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద లే అవుట్ల క్రమబద్ధీకరణకు చేసుకున్న దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకూ పురపాలికలు అనుమతులివ్వడం లేదు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి రూ.లక్షలు చెల్లించి అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సర్వేయర్ల సమ్మె.. ఆగిన దరఖాస్తులు బిల్డింగ్ ప్లాన్ ఉల్లంఘించి నిర్మాణాలు జరపబోమని ఇంటి యజమాని, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ)లు దరఖాస్తుతో పాటు అఫిడవిట్ సమర్పించాలని నెల రోజుల కింద కొత్త నిబంధనను పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. ప్లాన్ ఉల్లంఘించి నిర్మాణం చేస్తే ఎల్టీపీ లైసెన్స్ రద్దు చేసి చర్య లు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఉంది. యజమానుల ఉల్లంఘనలతో తమకు సంబంధం లేదని, సంయుక్త అఫిడవిట్ విధానం రద్దు చేయాలని 20 రోజులుగా ఎల్టీపీలు సమ్మె చేస్తున్నారు. దీంతో కొత్త దరఖాస్తుల నమోదు ఆగింది. శ్రీ 3 నెలలైనా అనుమతి రాలేదు... జగిత్యాలలోని మోచీబజార్‌లో ఇంటి నిర్మాణం చేపట్టాను. అనుమతి కోసం 3 నెలల క్రితం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు అనుమతి పత్రం లేనిదే బ్యాంకు లోను ఇవ్వమంటున్నారు. ఇప్పటికైనా అనుమతి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొప్పు శ్రీధర్, జగిత్యాల శ్రీ అడ్డుగా ఎల్ఆర్ఎస్... కోదాడ మున్సిపాలిటీలో ఇళ్ల అనుమతులకు ఎల్ఆర్ఎస్ అడ్డంకిగా మారింది. రెండు విడతల్లో 2,100 మంది ప్లాట్ల రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ 350 దరఖాస్తులే పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులపై అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశా. కానీ పట్టించుకోవడం లేదు. – పొడుగు హుస్సేన్, కోదాడ -
అక్రమ కట్టడాలపై చర్యలు
► ఏకీకృత మాస్టర్‌ప్లాన్ పూర్తయింది.. ప్రభుత్వానికి కూడా పంపాం ► దాదాపు 200కు పైగా కేసులను పర్యవేక్షణ చేస్తున్నాం ► గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ లేఅవుట్లపై చర్యలు ► ‘సాక్షి’తో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు సేవలు అందించడంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు పరిచయం చేసిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు వచ్చే ఆదాయం రెట్టింపయింది. గతంలో నెలకు రూ.7 కోట్ల వరకు ఆదాయం ఉంటే ప్రస్తుతం రూ.15 కోట్ల వరకు చేరింది. అంతేకాకుండా బిల్డింగ్ పర్మిషన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూ, లేఅవుట్ పర్మిషన్, ఎన్వోసీలు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ వేగవంతమై నగరవాసులకు సేవలు త్వరతగతిన అందిస్తున్నాం. తద్వారా ఆదాయం రెట్టింపునకు అవకాశం ఏర్పడింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లలో మార్పులు తీసుకురావడం ద్వారా ఆదాయం పెరిగింది. ఏకీకృత మాస్టర్ ప్లాన్ పూర్తి నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతున్న ఐదు అభివృద్ధి సంస్థలను అనుసంధానం చేసే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పూర్తి చేశాం. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ( హుడా), హైదరాబాద్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ, సైబరాబాద్ అభివృద్ధి సంస్థ (సీడీఏ), పాత హైదరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్), హెచ్ఎండీఎ వేర్వేరు మాస్టర్ప్లాన్ల వల్ల జోన్లలో చాలా సమస్యలు తలెత్తుతుండడంతో వీటన్నింటిని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒకే గొడుకు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు సేకరించాం. ఈ ఏకీకృత మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించాం. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి రెండేళ్ల నుంచి హెచ్ఎండీఏకు సంబంధించి దాదాపు 200కుపైగా కేసుల్లో న్యాయస్థానాల్లో జరిగే వాదనలను పర్యవేక్షిస్తున్నాం. ఓఆర్ఆర్ కోకాపేటకు సంబంధించి భూవిషయంపై సుప్రీంలో వాదనలు ముగిశాయి. కబ్జా కోరల్లో చిక్కుకున్న 2,370.25 ఎకరాలకు సంబంధించి జవహర్‌నగర్ భూముల విషయంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించాం. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆదాయం పెరిగింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండీఏ పరిధిలో వెలిసిన అక్రమ భవనాలు, లే అవుట్ల కూల్చివేత ప్రక్రియకు గతేడాది శ్రీకారం చుట్టాం. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. ఫలితంగా బిల్డింగ్ పర్మిషన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూ, లేఅవుట్ పర్మిషన్ల దారిపడుతున్నారు. దీంతో హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం పెరిగింది. భవిష్యత్‌లోనూ అక్రమ కట్టడాల గురించి సమాచారం తెలిస్తే కూల్చివేతకు వెనుకాడం. -
సీఆర్డీఏలో ‘డీపీఎంఎస్’ ఏర్పాటు
ఇకపై ఆన్లైన్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు సాక్షి, అమరావతి: ఆన్లైన్లో భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్)ను ప్రవేశపెడుతున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్వర అనుమతుల కోసం ఇప్పటికే ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం, ప్రతి శనివారం ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి దరఖాస్తుదారులకు అన్నివిధాల సహకారం అందిస్తున్నట్లే ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు పేర్కొంది. ఈ విధానంలో నివాస, వాణిజ్య, హైరైజ్, గ్రూపు, ప్రత్యేక భవనాలకు సంబంధించి ప్లాన్లకు ఆన్లైన్లో త్వరితగతిన అనుమతిస్తామని తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్, ఇ–మెయిల్ ద్వారా దాని పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని పేర్కొంది. వినియోగదారులు తమ దరఖాస్తు ఏ దశలో ఉన్నదీ సీఆర్డీఏ కార్యాలయానికి రాకుండానే తెలుసుకోవచ్చని, అనుమతి వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచే సంబంధిత ప్లాన్ కాపీలు, సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫీజులను నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొంది.