సాక్షి, సిటీబ్యూరో:ఇప్పటికే ఈ–ఆఫీస్, ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్స్, డీపీఎంఎస్ (డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం) వంటి వివిధ అంశాల్లో దేశంలోని ఇతర మునిసిపల్ కార్పొరేషన్ల కంటే ముందంజలో ఉన్న జీహెచ్‌ఎంసీ..మరో వినూత్న కార్యక్రమానికి సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీలోని అధికారులకు వినియోగిస్తున్న అద్దె కార్ల స్థానే ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలిదశలో క్షేత్రస్థాయి పర్యటనలు లేని.. కార్యాలయంలో మాత్రమే విధులు నిర్వహించే అధికారులకు ఈ ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలోకి తేనున్నారు. పర్యావరణ హితం, విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా ఇప్పటికే జీహెచ్‌ంఎసీలో నాలుగులక్షల పైచిలుకు ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేసిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ద్వారానే ఎలక్ట్రిక్ కార్లను అద్దెప్రాతిపదికన తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలిదశలో 20 నుంచి 50 ఎలక్ట్రిక్ కార్లను తీసుకునే యోచనలో ఉన్నారు. క్రమేపీ వీటి సంఖ్యను పెంచుతారు.
349 అద్దె కార్ల వినియోగం...
జీహెచ్‌ఎంసీలోని అధికారుల కోసం 349 అద్దెకార్లను వినియోగిస్తున్నారు. ఒక్కో కారుకు నెలకు రూ.34 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇదే మొత్తంతో ఎలక్ట్రిక్ కార్లను అద్దెపై వినియోగంలోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైనట్లు తెలిసింది. వాస్తవానికి ఈఈఎస్‌ఎల్ డ్రైవర్‌తో సహా ఎలక్ట్రిక్ కార్లకు నెలకు రూ.40 వేల అద్దె తీసుకుంటుంది. జీహెచ్‌ఎంసీలో 976 మంది ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లున్నారు. జీహెచ్‌ఎంసీలోని పలు పాతవాహనాలకు కాలం చెల్లడంతో వీరిలో కొందరికి పనిలేక ఖాళీగా ఉంటున్నారు. వారిని ఎలక్ట్రిక్ కార్లకు డ్రైవర్లుగా వినియోగించుకోవాలనే యోచనలో జీహెచ్‌ఎంసీ ఉంది. ఇదే అంశాన్ని ఈఈఎస్‌ఎల్‌కు వివరిస్తూ డ్రైవర్లు లేకుండానే ఎలక్ట్రిక్ కార్లను అద్దెకివ్వాల్సిందిగా సూచించింది. కార్ల నిర్వహణ మాత్రం ఈఈఎస్‌ఎల్‌దే. ఇందుకుగాను నెలకు రూ.22 వేల అద్దె చెల్లిస్తామని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లకు దాదాపు రూ.12 వేల వేతనం చెల్లిస్తున్నారు. డ్రైవర్ వేతనం, కారు అద్దె రెండూ కలిపితే నెలకు రూ.34 వేలే అవుతుండటంతో జీహెచ్‌ఎంసీకి ఎలాంటి అదనపు భారం పడదు. పైగా ఖాళీగా ఉన్న డ్రైవర్లకు పని కల్పించినట్లువుతుంది. ఇందుకు ఈఈఎస్‌ఎల్ కూడా అంగీకరించినట్లు సమాచారం.
తొలి దశలో 20 నుంచి 50 కార్లు అద్దెకు...
క్షేత్రస్థాయి పర్యటనలు ఉండని, కార్యాలయాల్లో మాత్రమే విధులు నిర్వహించే అకౌంట్స్, ఫైనాన్స్, వంటి విభాగాల్లోని అధికారులకు వీటిని కేటాయించనున్నారు. వారు కేవలం ఇంటినుంచి కార్యాలయానికే పరిమితం కనుక చార్జింగ్ సమస్యలుండనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులను కార్యాలయంలో దింపాక చార్జింగ్ చేసేందుకు తగినంత సమయం కూడా లభిస్తుంది.
స్వచ్ఛ ఆటోలకూ..
ప్రస్తుతం ఇంటింటి నుంచి చెత్త సేకరించి చెత్త రవాణా కేంద్రానికి చేర్చేందుకు ఆటో టిప్పర్లను (స్వచ్ఛ ఆటోలు)వాడుతున్నారు. ప్రస్తుతం రెండువేల ఆటోటిప్పర్లుండగా, వివిధ సర్కిళ్ల నుంచి ఇంకా కావాలనే డిమాండ్లున్నాయి. మరో 500 స్వచ్ఛ ఆటోలు త్వరలో రానున్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలైతే అన్ని విధాలా మేలు కావడంతో భవిష్యత్‌లో చార్జింగ్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ ఆటోలు ఉదయం ఇళ్ల నుంచి చెత్త సేకరించాక, మధ్యాహ్నం నుంచి పని ఉండదు. ఆ సమయంలో చార్జింగ్‌కు కావాల్సినంత సమయం ఉండటంతో ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుంటే మంచిదనే యోచనలో ఉన్నారు.
పలు సంస్థల్లో..
ఈఈఎస్‌ఎల్ ఇప్పటికే పలు నగరాల్లో, పలు సంస్థలతో ఎలక్ట్రిక్ కార్లు అద్దెకిచ్చేందుకు ఒప్పందం పూర్తిచేసుకుంది. వాటిల్లో పవర్ ఫైనాన్స్‌కార్పొరేషన్(పీఎఫ్‌సీ), సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ),మధ్యగుజరాత్‌విద్యుత్ కంపెనీ లిమిటెడ్(ఎంజీవీసీఎల్), దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్‌డీఎంసీ), ఎన్టీపీసీ (నేషనల్‌థర్మల్ పవర్‌కార్పొరేషన్), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) తదితరమైనవి ఉన్నాయి. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సైతం పదివేల కార్లకు ఒప్పందం కుదుర్చుకోగా శాంపిల్‌గా కొన్ని అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రప్రభుత్వం 8 వేల కార్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ..
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల్ని వినియోగించే వాహన వినియోగాన్ని భవిష్యత్తులో రద్దుచేసే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం, కేంద్ర ఇంధన, పరిశ్రమల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి రోడ్లపై తిరిగే అన్ని వాహనాలూ విద్యుత్ వాహనాలే ఉండాలనేది లక్ష్యం.
ఎలక్ట్రిక్ కార్ల గురించి..
♦ ఒక సారి ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేసేందుకు 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి పూర్తి చార్జి చేస్తే 100 నుంచి 130 కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు.
♦ అత్యవసరంగా చార్జింగ్ కావాలనుకుంటే ఫాస్ట్ చార్జర్లు వాడవచ్చు. 30 నిమిషాల్లో ఫుల్‌చార్జ్ అవుతాయి.
♦ వీటి ద్వారా వాయు, ధ్వని కాలుష్యం లేకపోవడమే కాక కార్బన్ డయాక్సైడ్ వెలువడదు.
♦ గరిష్టంగా గంటకు 80 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయి.
♦ బ్యాటరీలను చార్జింగ్ చేసేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తారు.
♦ చార్జింగ్ వల్ల కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రూ.0.89 పైసలు ఖర్చవుతుంది.
♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం.
♦ ఆరేళ్ల వరకు అద్దె ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
పర్యావరణానికి ప్రాధాన్యం
జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర కార్పొరేషన్ల కంటే జీహెచ్‌ఎంసీని ప్రత్యేకంగా నిలిపేందుకు ఆయన వీటిపై శ్రద్ధ చూపుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నేను ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై ఆయన అధ్యయనం చేసి వచ్చాను. ఈ కార్ల వల్ల ఎన్నో లాభాలున్నాయి.
– ఇ.శ్రీనివాసచారి, జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment