ఎలక్ట్రిక్ ఆటోను పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: వివిధ కొత్త కార్యక్రమాల ఆవిష్కరణలతో ముందుకెళ్తోన్న జీహెచ్‌ఎంసీ.. మరో నూతనాధ్యాయానికి సిద్ధమైంది. అమృత్‌సర్ స్వర్ణదేవాలం తరహాలో చార్మినార్‌ను పర్యాటక ప్రాంతంగా, ఐకానిక్ కట్టడంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టగా..తాజాగా అక్కడ ఎలక్ట్రిక్ ఆటోలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చార్మినార్ పరిసరాల్లోని వ్యర్థాలను తరలించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న స్వచ్ఛ ఆటోల స్థానే ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తెస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలుకు ఆర్డరిచ్చింది. స్వచ్ఛ కార్యక్రమాల అమలు కోసం సీఎస్సార్ ద్వారా అందిన దాదాపు రూ. 8.20 లక్షలతో రెండుఎలక్ట్రిక్ ఆటోలను కొంటోంది. స్థానికంగా ఉన్న గాయమ్ మోటార్‌వర్క్స్ (జీఎంవీ) వీటిని తయారు చేస్తోంది.
పైలట్‌ప్రాజెక్టు కోసం సిద్ధమైన ఈ ఆటోలను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి కొన్ని మార్పులను సూచించారు. ఆటో తరలించే వ్యర్థాలు గాలికి బయటపడకుండా పైకప్పు ఉండాలని సూచించడంతో నిర్మాణ కంపెనీ సదరు మార్పు చేయనుంది. కాలుష్య నివారణ కోసం జీహెచ్‌ఎంసీలోని చెత్త తరలింపు వాహనాల స్థానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతామని మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో..జీహెచ్‌ఎంసీ ఈ ఎలక్ట్రిక్ ఆటోలపై దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా వీటిì పనితీరును పరిశీలించాక, జీహెచ్‌ఎంసీలో చెత్త తరలింపుకోసం కొత్తగా కొనబోయే చెత్త ఆటోల స్థానే ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీ ఇటీవలే అధికారుల అద్దెకార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం తెలిసిందే.
ఎలక్ట్రిక్ ఆటోలు పర్యావరణహితం, కాలుష్యం తగ్గడంతోపాటు ఖర్చుకూడా తక్కువే. స్వచ్ఛ ఆటోల డీజిల్ వినియోగంతో కిలోమీటరు దూరానికి రూ.3 ఖర్చవుతుండగా, ఎలక్ట్రిక్ ఆటోలతో కిలోమీటరుకు 50 పైసలు మాత్రం ఖర్చవుతుంది. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. ఒకసారి బ్యాటరీని చార్జి చేస్తే దాదాపు 100 కి.మీ.లు ప్రయాణించవచ్చు. ఆరుగంటల్లో బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఫాస్ట్ చార్జర్లను వాడితే 3 గంటల్లోనూ చార్జింగ్ అవుతుంది. ఈ ఆటోలు గంటకు 40 –45 కి.మీ. వేగంతో ప్రయాణించగలవని జీహెచ్‌ఎంసీ ముఖ్య రవాణాధికారి ప్రదీప్‌రెడ్డి తెలిపారు. ఈ ఆటోలు అన్ని విధాలా మేలైనవని, కాలుష్యం తగ్గుతుందని కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment