జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాయంలో ఉంచిన చార్జింగ్ పాయింట్ మిషన్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పెరుగుతున్న విద్యుత్ వాహనాల అవసరాలు తీర్చేందుకు త్వరలో చార్జింగ్ హబ్స్ రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్æ(ఈఈఎస్‌ఎల్)తో జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలో ప్రస్తుతం దాదాపు 1500 ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతున్నాయి. భవిష్యత్‌లో వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి రోడ్ల మీదకు వచ్చే వాహనాలన్నీ ఎలక్ట్రానిక్‌వే కావాలని కేంద్ర ప్రభుత్వం.. ఇంధన, పరిశ్రమల మంత్రిత్వశాఖలు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రికల్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి ప్రజారవాణా బస్సులన్నీ ఎలక్ట్రానివే ఉండాలని ‘డ్రాఫ్ట్ తెలంగాణ ఎలక్ట్రిక వెహికల్ పాలసీ’లో ప్రతిపాదించింది. ప్రజలు సైతం తమ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలే కొనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు కూడా ప్రకటించింది.
ఈ పాలసీ ప్రకారం 2022 నాటికి 25 శాతం, 2025 నాటికి 50 శాతం ఎలక్ట్రానిక్ వాహనాలే తిరగాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యం సాధించాలంటే ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి. వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు తగినన్ని చార్జింగ్ స్టేషన్లు (పెట్రోల్/డీజిల్ బంకులు మాదిరిగా) అందుబాటులోకి తేవాలి. ఈ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా స్థానిక సంస్థలపై ఉండడంతో జీహెచ్‌ఎంసీ అందుకు సిద్ధమైంది. సదరు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్(చార్జింగ్ హబ్స్) ఏర్పాటు చేసేందుకు తగిన స్థలమిస్తే తాము ఏర్పాటు చేస్తామని ఈఈఎస్‌ఎల్ ముందుకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలిదశలో 100 చార్జింగ్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, తగిన స్థలం అందుబాటులో ఉన్న ప్రధాన రహదారుల మార్గాలు, వాహనాలు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 3 కి.మీ ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలనే లక్ష్యాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు.
గంటన్నరలో ఫాస్ట్ చార్జింగ్
సాధారణ చార్జింగ్ సమయం 6 గంటలు కాగా, త్వరితంగా చార్జింగ్ కావాలనుకునేవారికి ఫాస్ట్(డీసీ) చార్జర్లను కూడా హబ్స్‌లో అందుబాటులో ఉంచుతారు. ఫాస్ట్ చార్జర్ల ద్వారా చార్జింగ్‌కు గంటన్నర సమయం సరిపోతుంది. ప్రతి చార్జింగ్ హబ్‌లోనూ సదుపాయాన్ని బట్టి ఒకటి లేదా రెండు ఫాస్ట్ చార్జర్లతో సహా ఆరు చార్జర్లు ఉంచుతారు.
ఒకసారి చార్జింగ్‌కు రూ.160
♦ యూనిట్లుగా పరిగణనలోకి తీసుకుంటే ఒక కారు పూర్తిగా చార్జింగ్ అయ్యేందుకు 16 విద్యుత్ యూనిట్లు అవసరమవుతుంది. ఒక్కో యూనిట్‌కు డిస్కమ్ చార్జి రూ.6గా ఉంది. చార్జింగ్ హబ్స్ నిర్వహణ, సిబ్బంది వేతనాలతో కలిపి వినియోగదారుల నుంచి యూనిట్‌కు సుమారు రూ.10 వసూలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఒక్కసారి పూర్తి చార్జింగ్‌కు రూ.160 ఖర్చవుతుందని అంచనా. బ్యాటరీ పూర్తి చార్జింగ్ చేస్తే 100–130 కి.మీ ప్రయాణించవచ్చునని సంబంధిత అధికారి తెలిపారు.
♦ ఎలక్ట్రికల్ మొబిలిటీలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు ఇప్పటికే విధాన నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని ముసాయిదా దశలో ఉండగా, కొన్ని తుది నిర్ణయం తీసుకున్నాయి. ఈఈఎస్‌ఎల్ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్ వాహనాలు, త్వరలో రానున్న వాహనాలు, చార్జర్స్(ఏసీ,డీసీ) సంఖ్య ఇలా..
♦ తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ 20 ఎలక్ట్రిక్ కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఏడాదిక్రితమే ఒప్పందానికి సిద్ధమైనప్పటికీ, ఒప్పందంలోని కొన్ని అంశాలు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది.
మొబైల్‌యాప్‌తో సమాచారం
♦ వినియోగదారుల సదుపాయం కోసం చార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి.. ఎంత దూరంలో ఉన్నాయి వంటి వివరాలు నేవిగేషన్ ద్వారా తెలుసుకునేందుకు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. దీంతోపాటు వెంటనే చార్జింగ్ పెట్టేందుకు అవకాశం ఉందా.. లేక ఎంత సమయం వేచి ఉండాలి.. తదితర సమాచారం కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
♦ తొలిదశలో 50 ప్రాంతాల్లో, నెల రోజుల్లో కనీసం ఐదు చార్జింగ్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని జీహెచ్‌ఎంసీ సమకూరుస్తుంది. చార్జింగ్ ద్వారా వచ్చే ఫీజులో యూనిట్‌కు 70 పైసలు జీహెచ్‌ఎంసీకి ఈఈఎస్‌ఎల్ చెల్లిస్తుంది. చార్జింగ్ హబ్‌లలో వాహనాలను నిలిపేందుకు తగిన స్థలంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా, చార్జర్లు కనబడేలా ఏర్పాట్లు ఉండాలి.
తొలిదశ చార్జింగ్ హబ్స్ ఏర్పాటు చేసే ప్రాంతాలు
ఎన్టీఆర్ గార్డెన్, శిల్పారామం, ట్యాంక్‌బండ్(కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం వద్ద), గచ్చిబౌలి టెలిఫోన్‌నగర్(ఉర్దూ యూనివర్సిటీరోడ్), బొటానికల్ గార్డెన్, హైటెక్స్ రోడ్(కన్వెన్షన్ సెంటర్ గేట్), ఇందిరాపార్కు, కేబీఆర్‌పార్కు(3వ గేట్, నెక్సా షోరూమ్ ఎదుట), మణికొండ(మర్రిచెట్టు బస్టాప్), నానక్‌రామ్‌గూడ(జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్), అబిడ్స్ మున్సిపల్ పార్కిగ్ కాంప్లెక్స్, గన్‌ఫౌండ్రీ, పబ్లిక్‌గార్డెన్, రాజ్‌భవన్‌రోడ్ గవర్నమెంట్ హైస్కూల్, నెక్లెస్‌రోడ్ పార్క్ హోటల్, బషీర్‌బాగ్ ఓరిస్, హైటెక్స్ కమాన్, మలక్‌పేట సూపర్‌బజార్ బస్టాప్, మూసారంబాగ్ బస్టాప్, అంబర్‌పేట పోలీస్‌లైన్, విద్యానగర్ (యూఎస్ పిజ్జా ఎదుట), విద్యానగర్–ఆర్టీసీ క్రాస్‌రోడ్(రేణుక ఎల్లమ్మ ఆలయం), సుందరయ్య పార్కు ఆడిటోరియం, హిమాయత్‌నగర్ (కొటక్ మహీంద్రా బ్యాంక్), రాణిగంజ్ బస్టాప్, బాటా(సికింద్రాబాద్), తాజ్ ట్రైస్టార్ (ఎస్‌డీరోడ్), సన్‌షైన్ హాస్పిటల్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సబ్‌స్టేషన్), కామత్ హోటల్(సికింద్రాబాద్), ఓల్డ్ పాస్‌పోర్ట్ ఆఫీస్(సికింద్రాబాద్), మెట్టుగూడ (పిల్లర్ నెంబర్ సీ–118), రైల్ నిలయం, మారేడ్‌పల్లి వెస్ట్, మదర్ థెరెసా విగ్రహం, హయత్‌నగర్ బస్టాండ్, మహవీర్ హరిణ వనస్థలి పార్కు, ఎన్జీఓస్‌కాలనీ రెడ్‌ట్యాంక్, ఉప్పల్ మెట్రోస్టేషన్.
కాలుష్యం తగ్గుతుంది
ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అన్నీ విద్యుత్ వాహనాలే ఉంటాయి. వీటి ద్వారా వాయు కాలుష్యం తగ్గుతుంది. స్థానిక సంస్థ జీహెచ్‌ఎంసీకి చార్జింగ్ ద్వారా వచ్చే వాటాతో పాటు హబ్‌లపై ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుంది. డిస్కమ్ చార్జింగ్ ధరలను తగ్గిస్తే ఎక్కువ మంది ఈ వాహనాలు కొనే అవకాశం ఉంది. ఢిల్లీలో యూనిట్ చార్జి రూ.4.50 మాత్రమే.– వేణుమాధవ్, ఎగ్జిక్యూటివ్‌ఇంజినీర్, జీహెచ్‌ఎంసీ
Comments
Please login to add a commentAdd a comment