ఇల్లు కట్టి చూడు! | Illegal permissions With old dates in DPMS | Sakshi
Sakshi News home page

ఇల్లు కట్టి చూడు!

Published Tue, Dec 25 2018 1:56 AM | Last Updated on Tue, Dec 25 2018 1:56 AM

Illegal permissions With old dates in DPMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ పట్టణం రెహ్మత్‌ నగర్‌లో సయ్యద్‌ షర్ఫోద్దీన్‌ (పేరుమార్చాం) ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి. తనకు 230 చదరపు మీటర్ల ప్లాట్‌ ఉంది. కష్టార్జితం నుంచి దాచిన డబ్బుతో పాటు కొంత బ్యాంకు లోన్‌ తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నారు. అనుమతి కోసం డీపీఎంఎస్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 14 రకాల ఫీజులు, పన్నులు కలిపి రూ.96,783 ఫీజు వసూలు చేశారు. డీపీఎంఎస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ రూ.10 వేలు తీసుకోగా, అధికారులు సంతకం పెట్టడానికి మామూళ్లు తీసుకుంటారని పేర్కొని మరో రూ.10 వేలు వసూలు చేశాడు. 

షర్ఫోద్దీన్‌లా సొంతిళ్లు కట్టుకోవాలని కలలు కనడం మధ్య తరగతి ప్రజలకు శాపమైంది. భవన నిర్మాణ అనుమతులు పెనుభారంగా తయారయ్యాయి. చక్కగా అనుమతి తీసుకుని పద్ధతి ప్రకారం ఇళ్లు కట్టుకుంటామని దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం డజనుకు పైగా ఫీజులు వడ్డించి నడ్డి విరుస్తోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు కనీసం 200–250 చ.మీ. స్థలంలో సాదాసీదా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టుకుందా మనుకున్నా రూ.లక్షకు పైగా ఫీజు వసూలు చేస్తోంది. సంతకాల పేరుతో మునిసిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు వసూలు చేసే వేల రూపాయల మామూళ్లు దీనికి అదనం. సామాన్య కుటుంబాలు అప్పు చేసి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల బడ్జెట్‌తో ఓ మోస్తారు ఇంటి నిర్మాణానికి ప్రణాళిక వేసుకుంటే భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు, మామూళ్ల రూపంలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 250 చ.మీ. ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20 వేల నుంచి రూ.25 వేల ఫీజులు ఉండగా, ఆ తర్వాత ఒక్కసారిగా రూ.లక్షకు చేరింది. భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలన పేరుతో ఆన్‌లైన్‌ విధానంలో అనుమతుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (డీపీఎంఎస్‌) ఇందుకు కారణమైంది. గతంలో రెండు మూడు రకాల ఫీజులు వసూలు చేసి భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే వారు కాగా, డీపీఎంఎస్‌ వచ్చిన తర్వాత ఏకంగా 14 రకాల ఫీజులను వసూలు చేస్తుండటమే దీనికి కారణం.

దరఖాస్తు చేసుకుంటే దొరికిపోయినట్లే..
ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ‘ఫీ’బకాసురులకు చిక్కినట్లే. ఇదే అవకాశం.. మళ్లీ దరఖాస్తుదారుడు తమ దగ్గరకు రాడని ప్రభుత్వం ఇంటి నిర్మాణ అనుమతులతో సంబంధం లేని ఫీజులు, పన్నులన్నింటినీ డీపీఎంఎస్‌ కింద ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా చెల్లించాల్సిన ఫీజుల జాబితాలో చేర్చింది. ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌), డెవలప్‌మెంట్‌ చార్జీ (వేకెంట్‌ ల్యాండ్‌)ల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తోంది. వర్షపు నీటి సంరక్షణ చార్జీల పేరుతో రూ.3,680 వసూలు చేస్తున్న పురపాలక శాఖ.. తిరిగి ఆ నిధులతో దరఖాస్తుదారుల ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణానికి వినియోగించకుండా సొంత జేబుల్లో వేసుకుంటోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్కడక్కడ ఇలాంటి గుంతలు నిర్మించినా, రాష్ట్రంలోని మిగిలిన మునిసిపాలిటీల్లో ఒక్క గుంతను సైతం నిర్మించలేదు. మునిసిపాలిటీల పరిధిలోని చాలా వరకు ఖాళీ స్థలాలకు లే అవుట్‌ అనుమతులు ఉండవు. మధ్య తరగతి ప్రజలు అవగాహన లేక ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరణ సైతం చేసుకోరు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరణ ఫీజుల పేరుతో రూ.వేలను వసూలు చేస్తున్నారు. 

పాత తేదీలతో అక్రమ అనుమతులు ...
డీపీఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం రూ.లక్షల్లో ఫీజులు, పన్నులు చెల్లించాల్సి రావడం చాలా మునిసిపాలిటీల్లో కొత్త రకం అవినీతికి ఆజ్యం పోసింది. డీపీఎంఎస్‌లో కాకుండా పాత తేదీల (యాంటీ డేట్స్‌)తో చాలా మునిసిపాలిటీల్లో అక్రమ అనుమతులు జారీ చేస్తున్నారు. డీపీఎంఎస్‌ ద్వారా చెల్లించాల్సిన ఫీజులు, పన్నుల మొత్తంలో 25 శాతాన్ని లంచంగా తీసుకుని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పాత తేదీలతో అనుమతులు జారీ చేసేస్తున్నారు. చాలా మునిసిపాలిటీల్లో పాత ఫైళ్లు ధ్వంసం కావడంతో ఇలాంటి అనుమతులు జారీ చేయడం సులువుగా మారింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీగా మారిన చోట్లలో ఇలాంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 

మధ్య దళారులుగా లైసెన్స్‌డ్‌ ఇంజనీర్లు..
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీకి డీపీఎంఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా దరఖాస్తుదారులు లంచాలు ఇవ్వకతప్పడం లేదు. ప్రైవేటు లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ సాయం లేనిదే బిల్డింగ్‌ ప్లాన్‌ తయారీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు లేదు. దీంతో చాలా మునిసిపాలిటీల్లో మామూళ్ల వసూళ్లలో ఈ ఇంజనీర్లు దళారుల అవతారమెత్తారు. మునిసిపల్‌ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు/సూపర్‌వైజర్లు సంతకం చేయడానికి డబ్బులు తీసుకుంటారని చెప్పి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో సైట్‌ ఇన్స్‌పెక్షన్‌కు వచ్చే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది స్వయంగా దరఖాస్తుదారుల నుంచి మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో సైట్‌ ఇన్స్‌పెక్షన్‌ నివేదికలో కొర్రీలు వేసి అనుమతుల జారీలో జాప్యం చేస్తున్నారు. కేవలం 21 రోజుల్లో డీపీఎంఎస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుండగా, అత్యధిక శాతం కేసుల్లో కొర్రీలతో జాప్యం జరుగుతుండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement