సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 12లోగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఏ ఒక్క ఆస్తిని వదిలిపెట్టవద్దని, ఆస్తుల నమోదు 100 శాతం పూర్తి అయినట్లు సంబంధిత వార్డు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవీకరించిన వ్యవసాయేతర ఆస్తుల ముసాయిదా జాబితాను వార్డు కమిటీ ముందు వుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు/ సలహాలు స్వీకరించా లని ప్రభుత్వం నిర్దేశించింది. అభ్యంతరాల ను పరిష్కరించిన అనంతరం తుది జాబితా ను ప్రకటించాలని ఆదేశించింది. ఆస్తుల న మోదుకు సంబంధించిన వివరాలను వార్డు అధికారుల నుంచి పురపాలికలు సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ఇంకా పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డులకు ఎక్కని ఆస్తుల నమోదును గడువులోగా పూర్తి చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్, వారసత్వ బదిలీ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు.
అక్రమాలకు పాల్పడితే వేటే...
ఆస్తుల నమోదు ప్రక్రియలో ఏవైనా అక్రమాలకు పాల్పడితే తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 95 కింద కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లను పురపాలక డైరెక్టర్ హెచ్చరించారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే మున్సిపల్ ఉద్యోగు లు, అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ కల్పిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల కు మెరూన్‌రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆస్తుల నమోదు ప్రక్రియ అత్యం త కీలకంగా మారింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్‌ను దసరా రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ధరణిలో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్‌లైన్ ద్వారా పురపాలికలు/ గ్రామ పంచాయతీల్లోని ఆస్తి పన్నుల రికార్డుల్లో సైతం కొత్త యజమాని పేరును నమోదు చేసి తక్షణ మ్యుటేషన్ చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఇందుకోసం ప్రతి ఆస్తికి సంబంధించిన యజమానికి వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా యజమాని పేరు, కులం, వయసు, లింగం, ఫోన్ నంబర్, గుర్తింపు రుజువు, ఫొటో, ఆస్తి వివరాలు, వినియోగం, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆస్తి సంక్రమణ విధానం, విద్యుత్, కులాయి కనెక్షన్ నంబర్లు, కుటుంబీకుల వివరాలు, చిరునామా తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి యజమానులందరూ ఇకపై పన్ను చెల్లింపు పరిధిలోకి రానున్నారు.
12లోగా ఆస్తుల నమోదు
Published Thu, Oct 1 2020 5:00 AM | Last Updated on Thu, Oct 1 2020 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment