సిటిజన్‌ ఫ్రెండ్లీగా.. | GHMC Friendly With DPMS Changes | Sakshi
Sakshi News home page

సిటిజన్‌ ఫ్రెండ్లీగా..

Published Sat, Feb 2 2019 10:38 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

GHMC Friendly With DPMS Changes - Sakshi

అధికారులతో సమావేశమైన దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఇక భవన నిర్మాణ అనుమతులు మరింత సరళతరం కానున్నాయి. నిబంధనలకు లోబడి ఉన్న అన్ని దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలోనే అనుమతులు జారీచేసేలా పూర్తి ఆన్‌లైన్‌ సిస్టంను అమలు చేసేందుకు గ్రేటర్‌ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే డీపీఎంఎస్‌ (డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) లో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తోన్న జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం..ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈఓడీబీ)లో భాగంగా సిటిజెన్‌ ఫ్రెండ్లీగా మరింత సులభతరం, పారదర్శక సేవలు అందివ్వనుంది. ఇందులో భాగంగా వివిధ శాఖల అనుమతుల కోసం ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్ని అనుమతులు సింగిల్‌ విండో ద్వారా ఇవ్వనున్నారు.  ఏకగవాక్ష, సమగ్ర ఆన్‌లైన్‌ విధానంగా దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ పేర్కొన్నారు. 

ఇదీ విధానం..  
సిటెజెన్‌ లేదా ఆర్కిటెక్ట్‌ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్లౌడ్‌ బేస్డ్‌ వర్క్‌ ఫ్లో ద్వారా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పరిశీలిస్తారు. మాస్టర్‌ ప్లాన్, టెక్నికల్, లీగల్, సైట్‌ ఇన్‌స్పెక్షన్‌  తదితర అంశాలన్నీ ఈ క్లౌడ్‌ ఆధారిత విధానం ద్వారానే పరిశీలిస్తారు. అనంతరం ఈ అనుమతుల దరఖాస్తులు వెబ్‌ ఆధారిత ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఆటో డీసీఆర్‌  డ్రాయింగ్‌ల ద్వారా పరిశీలించి సక్రమంగా ఉన్నాయా లేక డీవియేషన్లు ఉన్నాయా అనే అంశంపై 15 నిమిషాల్లోనే సమగ్ర నివేదికను సిస్టమ్‌ తెలియజేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన కూడా మొబైల్‌ యాప్‌ ఆధారితంగానే ఉంటుంది. అనుమతులన్నింటినీ డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారానే అందజేస్తారు. అనుమతులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్,  ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్,  వ్యక్తిగత మొబైల్‌ యాప్‌లలో అప్‌డేట్‌ అవుతాయి. అనుమతులకు సంబంధించిన ఫీజుల  చెల్లింపులు సైతం ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

ఆమోదించిన ప్లాన్‌లు, అనుమతులు కూడా మెయిల్స్‌కు వస్తాయని, వెబ్‌సైట్‌ నుంచి కూడా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ అత్యంత ఆధునిక ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఫైళ్ల ప్రాసెస్‌ ఏడంచెల నుంచి నాలుగంచెలకు తగ్గుతుంది. ఇందుకుగాను క్ష్రేతస్థాయి పరిశీలనలో భాగంగా సైట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఫొటోలను మోబైల్‌యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌టెక్‌ సంస్థ రూపొందించిన ప్రజంటేషన్‌ను కమిషనర్‌ దానకిషోర్‌ శుక్రవారం  పరిశీలించారు. ఐటీ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ, చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో ఈ విధానంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో డీపీఎంఎస్‌  విధానం అమలులో ఉన్నప్పటికీ ఇది అధికారుల వ్యక్తిగత నియంత్రణలో ఉందని, టౌన్‌ప్లానింగ్‌ ద్వారా అందించే సర్వీస్‌లను విధానపరంగా కేంద్రీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకుగాను దరఖాస్తుల స్వీకరణ నుండి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌  జారీ వరకు మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే చేయనున్నట్టు కమిషనర్‌ వివరించారు. డీపీఎంఎస్‌ను ప్రస్తుతం  భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి మాత్రమే వినియోగిస్తుండగా, కొత్త విధానంలో ఖాళీ స్థలాల లేఅవుట్‌ అనుమతులు,  గేటెడ్‌ కమ్యూనిటీల లే ఔట్ల అనుమతులు, ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు, నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలన్నింటినీ   చేయనున్నట్లు తెలిపారు.

త్వరలో అవగాహన కార్యక్రమాలు..
ఈ నూతన  విధానంపై నగరవాసులు, ముఖ్యంగా బిల్డర్లు, వ్యక్తిగత భవన నిర్మాణదారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు దానకిషోర్‌ తెలిపారు. నిర్మాణ అనుమతులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని డిప్యూటీ, జోనల్‌ కమిషనర్ల కార్యాలయాలతో పాటు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా డ్యాష్‌ బోర్డులను ఏర్పాటుచేసి ప్రజలకు తెలిసేలా ప్రదర్శించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. దీని ద్వారా అనుమతులు ఈజీ అవుతాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement