పడకేసిన ‘ఈ–ఆఫీస్‌’ | E office Home Department Not Working Properly | Sakshi
Sakshi News home page

పడకేసిన ‘ఈ–ఆఫీస్‌’

Published Wed, Sep 4 2019 12:10 PM | Last Updated on Wed, Sep 4 2019 6:51 PM

E office Home Department Not Working Properly - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కాగిత రహిత సేవల అమలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతుల కోసం ఆన్‌లైన్‌ సేవల్లో భాగంగా తీసుకొచ్చిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) తరహాలోనే ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను గతేడాది అక్టోబర్‌ 2న పరిచయం చేసినా ఇప్పటివరకు పూర్తిస్థాయి అమలుకు నోచుకొలేదు.  ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేస్తున్న నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ సహకారంతో హెచ్‌ఎండీఏలోని దాదాపు 15కు పైగా శాఖల్లో ఈ–ఆఫీసు సేవలను దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే అందులో పురోగతి కనిపించడం లేదు. గత ఏడాది అక్టోబర్‌ 2న అప్పటి కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అంతర్గతంగా జరిగే సేవలను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టినా ఆ తర్వాత అంతగా పట్టించుకున్న వారు కరువయ్యారు. ప్రస్తుత హెచ్‌ఎండీఏ కమిషనర్‌  అరవింద్‌ కుమార్‌కు వివిధ ప్రభుత్వ విభాగాల అధనపు బాధ్యతలతో బిజీగా ఉండటంతో ఈ విభాగాన్ని చూసే అధికారులు దీనిపై శ్రద్ధ చూపడం లేదు. 

డీపీఎంఎస్‌  తరహాలోనే...
లేఅవుట్, భవన నిర్మాణ అనుమతుల కోసం అమలులోకి  తెచ్చిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) ఆన్‌లైన్‌ సేవలు అటు దరఖాస్తుదారులకు తమ ఫైల్‌ ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయా విభాగ ఉన్నతాధికారులు కూడా సంబంధిత ఫైల్‌ ఏ అధికారి వద్ద ఉందో క్షణాల్లో తెలుసుకొని క్లియర్‌ చేసేలా ఆదేశాలిస్తుండటంతో ఆన్‌లైన్‌ సేవల వల్ల దరఖాస్తుదారులకు త్వరిగతిన సేవలు అందుతున్నాయి. ఇదే విధానాన్ని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అంతర్గతంగా జరిగే సేవలకు అనుసంధానించాలని అప్పటి  హెచ్‌ఎండీఏ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి  ఐటీ విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ సహకారంతో హెచ్‌ఎండీఏలోని దాదాపు 15కుపైగా శాఖల్లో ఈ–ఆఫీసు సేవలను అమలు చేయాలని నిర్ణయించారు. అకౌంట్స్, ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, అర్బన్‌ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్, స్టోర్స్, ఓఆర్‌ఆర్‌ భూసేకరణ విభాగం, పీఆర్‌వో...ఇలా వివిధ విభాగాల్లో ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్‌ పద్ధతికి స్వస్తి పలికి ఆన్‌లైన్‌ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకరావల్సి ఉన్నా అవి కార్యాచరణకు నోచుకోలేదు. ఒకవేళ ఆయా విభాగ అధికారులు సెలవులో ఉన్నా ప్రాధాన్యం గల ఫైల్స్‌ను క్లియర్‌ చేసేందుకు ఈ–ఆఫీసు ఉపయుక్తకరంగా ఉంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడినా పనులు నత్తనడకన సాగుతున్నాయి.  ఈ–ఆఫీసు వల్ల అటు కార్యాలయ సిబ్బందికి, ఇటు ప్రజలకు కూడా ఉపయుక్తం ఉంటుందని, ఇప్పటికైనా ఈ పనుల్లో వేగిరం పెరిగేలా ఐటీ విభాగంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement