కామన్‌ కష్టాలు ఇక ఉండవ్‌! | HMDA Changes in DPMS Applications | Sakshi
Sakshi News home page

కామన్‌ కష్టాలు ఇక ఉండవ్‌!

Published Wed, Mar 6 2019 10:59 AM | Last Updated on Wed, Mar 6 2019 10:59 AM

HMDA Changes in DPMS Applications - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఘట్‌కేసర్‌కు చెందిన రాజేశ్‌ తన 200 గజాల్లో భవన నిర్మాణ అనుమతి కోసం 2018 జనవరిలో హెచ్‌ఎండీఏకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, రెవెన్యూ విభాగం నుంచి ‘నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌’ (నాలా) సర్టిఫికెట్‌ సమర్పించాలంటూ ప్లానింగ్‌ అధికారులు షార్ట్‌ఫాల్స్‌ పంపారు. దీంతో అతను ఆ సర్టిఫికెట్‌ కోసం దాదాపు మూడు నెలల పాటు రెవెన్యూ విభాగం చుట్టూ తిరగాల్సి  వచ్చింది. 

అమీన్‌పురాకు చెందిన అరుణ్‌ తన 250 గజాల ప్లాట్‌లో ఇల్లు కట్టుకునేందుకు 2018 జూన్‌లో హెచ్‌ఎండీఏకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ ప్లాట్‌ చెరువుకు సమీపంలో ఉందంటూ ప్లానింగ్‌ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌ స్థాయికి తగ్గకుండా ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తేవాలంటూ షార్ట్‌ఫాల్‌ పంపారు. దీంతో అతడు ఆ సర్టిఫికెట్ల కోసం నాలుగు నెలలపాటు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగితేగాని పని కాలేదు. 

ఇలాంటి కష్టాలు ఇంటి నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్న చాలామందికి అనుభవమే. సదరు సర్టిఫికెట్లు పొందేందుకు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ విభాగాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఫలితంగా హెచ్‌ఎండీఏ నుంచి నిర్ణీత సమయంలో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులు ఇవ్వడంలో ఆలస్యమవుతోంది. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ఎన్‌ఓసీల జారీపై ప్రత్యేక కమిటీ భేటీ అవుతున్నా.. సేవల్లో మరింత వేగాన్ని పెంచేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(డీపీఎంఎస్‌)లోనే ‘కామన్‌ అప్లికేషన్‌’ విధానానికి రూపకల్పన చేశారు. భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ఎన్‌ఓసీ బటన్‌ క్లిక్‌ చేసేలా ఫీచర్లు రూపొందించి ట్రయల్‌ రన్‌ చేశారు. ఈ సేవలను సాధ్యమైనంత త్వరగా అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు   హెచ్‌ఎండీఏ కృషి చేస్తోంది.    

ఎన్‌ఓసీల కోసం ప్రత్యేక ఫీచర్లు
భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల కోసం ఆన్‌లైన్‌ డీపీఎంఎస్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలోనే నాలా, ఇరిగేషన్‌ ఎన్‌ఓసీల కోసం ప్రత్యేక ఫీచర్స్‌ను రూపొందించారు. నాలాలు, కుంటలు, చెరువులకు సమీపంలో ఉన్న ప్లాట్ల దరఖాస్తుదారులు యథావిధిగా బిల్డింగ్‌కు అవసరమైన అన్నీ పత్రాలు ఆప్‌లోడ్‌ చేయడంతో పాటు ఇరిగేషన్‌ ఎన్‌ఓసీ అప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఒకవేళ దరఖాస్తుదారుడు ఇది క్లిక్‌ చేయకపోయినా ప్లానింగ్‌ అధికారులు సదరు ఎన్‌ఓసీకి అదే ఫీచర్‌ ద్వారా దరఖాస్తు చేస్తారు. వీటిని రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగం ఉన్నతాధికారులు పరిశీలించి 15 రోజుల్లోగా ఎన్‌ఓసీని ఆన్‌లైన్‌ ద్వారానే హెచ్‌ఎండీఏకు సమర్పిస్తారు. తర్వాత హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ అధికారులు ఆ ఫైల్‌ను క్లియర్‌ చేసి అనుమతిస్తారు. ఇరిగేషన్‌ ఎన్‌ఓసీ మాదిరిగానే నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌ (నాలా) సర్టిఫికెట్‌ కూడా రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ ద్వారానే సమర్పిస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ కొత్త విధానాన్ని సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి వచ్చినా ప్ర త్యేక ఎన్‌ఓసీ కమిటీ ప్రతి పది రోజులకోసారి భేటీ అవుతుందని, దీనిద్వారా అనుమతుల్లో వేగం పెరిగి సంస్థకు ఆదాయం పెరగడంతో పాటు దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పు తాయని హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హెచ్‌ఎండీఏ తీసుకొస్తున్న ఈ ‘కామన్‌’ అప్లికేషనతో హెచ్‌ఎండీఏ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement