అక్రమ కట్టడాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ
బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కారు నిర్ణయం!
పురపాలక శాఖ నుంచి {పతిపాదనలు కోరిన సీఎంవో
గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలూ రెట్టింపు
హైదరాబాద్: మళ్లీ అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భవనాలు/లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాల(బీపీఎస్/ఎల్‌ఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను తాజాగా సీఎం కార్యాలయం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 తేదీని అక్రమాల క్రమబద్ధీకరణకు ‘కటాఫ్ డేట్’గా ప్రభుత్వం నిర్ణయించి నట్లు తెలుస్తోంది. అంటే, 2014 జూన్ 1 లోపు నిర్మాణం పూర్తై భవనాలు, లే ఔట్లనే క్రమబద్ధీకరించనున్నారు. ఆ తర్వాత పుట్టుకొచ్చిన అక్రమ కట్టడాలు, లే అవుట్లను కూల్చేయాలా? లేదా? అన్న అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కటాఫ్ డేట్‌కు ముందు నిర్మితమైన భవనాలు, లే అవుట్లను గుర్తించేందుకు ‘గూగుల్ మ్యాప్స్’ సహాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి క్రమబద్ధీకరణ చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తే రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ తమ వార్షిక బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. నగరంలో దాదాపు 65 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా కుదేలైన మిగిలిన 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదే చివరిసారి..: అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని 2002లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని అధికారవర్గాలు గుర్తించాయి. ఆ ఆదేశాల తర్వాత కూడా.. ఇదే చివరి క్రమబద్ధీకరణలు అంటూ 2007-08లో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేశారు. 2002లో సైతం ‘ఇదే చివరిసారి’ అంటూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గత ప్రభుత్వాల నిర్ణయాలు, హైకోర్టు ఆదేశాల ప్రభావం లేకుండా బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు అనువుగా ఏపీ మునిసిపల్ చట్టం, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం, భవన నిర్మాణ నియమావళి, డీటీసీపీ చట్టాలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు.
పెండింగ్ దరఖాస్తులు మళ్లీ పరిశీలన
ఉమ్మడి రాష్ట్రంలో 2007-08లలో పెండింగ్‌లో వున్న 57,473 బీపీఎస్, 4,586 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీ ప్రణాళికల అమలుకు కావాల్సిన నిధుల కోసం క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
కటాఫ్ డేట్.. జూన్ 2, 2014
Published Thu, Jul 30 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement