కబ్జా చేస్తే కటకటాలే!
♦ ‘చెరువుల రక్షణ, నిర్వహణ చట్టం’ ముసాయిదా రూపకల్పన
♦ ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్, ఏడాది పాటు జైలు శిక్ష
♦ అక్రమ నిర్మాణాలు చేపడితే స్వాధీనం..
కలుషితం చేసినా, వ్యర్థాలు వేసినా చర్యలు
♦ నిర్లక్ష్యం చేసే అధికారులకూ శిక్ష విధింపు
♦ రాష్ట్ర, జిల్లా స్థాయిలో చెరువుల పరిరక్షణకు అథారిటీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న చెరువులను కబ్జా కోరల్లోంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందించింది. ‘చెరువుల రక్షణ, నిర్వహణ చట్టం-2015’ పేరుతో తయారు చేసిన ఈ ముసాయిదాలో... చిన్న నీటి వనరులను సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, సాధారణ ప్రజల అవసరాలకు సమర్థవంతంగా చెరువు నీటిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.
నీటి కాలుష్యాన్ని, కబ్జాలను నివారించేలా కఠిన చర్యలను అమల్లోకి తెస్తోంది. ఈ ముసాయిదాపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చించిన ప్రభుత్వం... అభిప్రాయం చెప్పాలంటూ జిల్లాల అధికారులకు ముసాయిదాను అందజేసింది. వారి సూచనలు స్వీకరించాక అవసరమైన మార్పులు, చేర్పులు చేసి.. చట్టాన్ని అమల్లోకి తేనున్నారు. గతేడాది అక్టోబర్‌లో చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేల సంఖ్యలో చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువుల పూడిక పనుల అంచనాల నిమిత్తం జరిపిన సర్వేలోనూ భారీగా కబ్జాలను గుర్తించింది. చెరువు పూర్తినిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకు పోయిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో చెరువుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఉక్కుపాదమే..
తాజాగా ప్రభుత్వం సిద్ధం చేసిన 30 పేజీల ముసాయిదా ప్రకారం... చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠిన చర్యలుంటాయి. చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించరాదు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహ మార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించరాదు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురదనుకానీ, రసాయన వ్యర్థాలనుకానీ చెరువులో వేయరాదు.
ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టరాదు. శుద్ధి చేయని జలాలను పంపకూడదు. వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. అంతేగాకుండా ఆక్రమణ దారులను ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే వారిని కూడా శిక్షించనున్నారు.