కోటి నాగళ్ల నోము | Vardhelli Murali Article On Rural Economy Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోటి నాగళ్ల నోము

Published Sun, Aug 1 2021 12:18 AM | Last Updated on Sun, Aug 1 2021 12:21 AM

Vardhelli Murali Article On Rural Economy Andhra Pradesh - Sakshi

ఈ దేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఎంతోమంది రాజులు మారిపోయారు. రాజ్యాధికారాలు ఎన్నోసార్లు చేతులు మారాయి. కానీ, స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మటుకు శతాబ్దాల పర్యంతం చెక్కుచెదరకుండా అలాగే నిలబడి పోయింది. బ్రిటిష్‌ వలసపాలన మొదలైన తర్వాత మాత్రమే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు ఒక్కొక్కటే తెగి పోవడం ప్రారంభమైంది. భారతదేశ చారిత్రక పరిణామాలపై కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌మార్క్స్‌ అవగాహన కూడా ఇదే. మార్క్స్‌ భారతదేశం గురించి రాసింది తక్కువే. కానీ చేసిన అధ్యయనం చాలా విస్తృతమైనది. ‘భారత్‌లో బ్రిటిష్‌ పాలన భవిష్యత్‌ పరిణామాలు’ అనే వ్యాసంలో ఆయన అధ్యయనం, అవగాహన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

కాకపోతే ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కులచట్రంలో బిగు సుకుపోయిందనీ, ఈ కులం అనేది దేశ అభివృద్ధికి గుదిబండగా మారిందని మార్క్స్‌ అభిప్రాయపడ్డారు. మేధోశ్రమ, శారీరక శ్రమల ఆధారంగా కులవిభజన జరిగింది. శారీరక శ్రమకు మేధోశ్రమ తోడ్పాటు లభించలేదు. ఫలితంగా ఉత్పాదకతలో సాంకేతిక అభివృద్ధి జరగలేదు. కులవ్యవస్థతో కుంటుతున్నప్ప టికీ, సాంకేతిక పరిజ్ఞానం కొరవడినప్పటికీ భారతదేశ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అద్భుతాలనే సృష్టించింది. బ్రిటిష్‌ ఆర్థికవేత్త ఆంగస్‌ మాడిసన్‌ లెక్కల ప్రకారం పదిహేడో శతాబ్ది నాటికే ప్రపంచ జీడీపీలో భారతదేశం వాటా 23 శాతం. ఈ దేశంలో బ్రిటిష్‌ వారి పాలన ప్రారంభం కాకముందటి లెక్క ఇది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జీడీపీలో మన వాటా 7 శాతం మాత్రమే. బ్రిటీష్‌ వాళ్లు మనదేశం నుంచి ఎంత సంపదను లూటీ చేశారనే అంశంపై ఆర్థికవేత్తలు కొందరు లెక్కలు కట్టి ప్రస్తుత కరెన్సీ విలువల ప్రకారం 45 ట్రిలియన్ల అమెరికన్‌ డాలర్లుగా తేల్చారు. అంటే 45 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయి లెక్కల్లోకి మారిస్తే సుమారు 3,300 లక్షల కోట్ల రూపాయలు! ఈ సంపదంతా మన స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సృష్టి. శ్రామిక ప్రజలు తమ కరాల బిగువు, నరాల సత్తువతో కురిపించిన వరాల వర్షమే ఇదంతా!

ఈ అవగాహన ఉన్నందువల్లనే మహాత్మాగాంధీ ‘గ్రామ స్వరాజ్‌’ను స్వతంత్ర భారత్‌కు అభివృద్ధి మోడల్‌గా సూచిం చారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కులనిర్మూలన అంశాన్ని ఎజెండా పైకి తెచ్చారు. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయ కత్వం ఈ రెండు కీలక విషయాలనూ పక్కన పెట్టింది. భారత దేశ పరిణామాల విశ్లేషణలో కారల్‌మార్క్స్‌ ఈ రెండంశాలనూ ప్రధానంగా ప్రస్తావించారు. కానీ, ఈ దేశంలోని కమ్యూనిస్టులు వాటిని పెడచెవిన పెట్టి మూల్యం చెల్లించుకున్నారు. స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది వ్యవసాయం. ఇప్పటికీ అత్యధిక ప్రజానీకాన్ని అక్కున చేర్చుకొని ఆశ్రయ మిస్తున్న రంగం ఇదే. స్వరాజ్యం వచ్చిన తర్వాత మన పాల కులు ఈ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఫలితంగా  ఒక దశలో దేశానికి సరిపోయే తిండి గింజల్ని పండించలేని స్థితిలోకి మన వ్యవసాయరంగం దిగజారింది. అప్పుడు కళ్లు తెరిచి ‘గ్రీన్‌ రివల్యూషన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. హైబ్రిడ్‌ విత్తనాలను ప్రవేశపెట్టడం, రసాయనిక ఎరువుల్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించడం – ఈ ‘గ్రీన్‌ రివల్యూషన్‌’ సాధిం చిన ఘనతలు. ఫలితంగా ఉత్పత్తి పెరిగిన మాట వాస్తవమే. ఉత్పత్తి వ్యయం ఆ నిష్పత్తిని మించి పెరిగిందన్నది ఒక చేదు నిజం. ప్రజారోగ్యం అటకెక్కిందన్నది మరింత నిష్ఠుర సత్యం.

ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగం దారుణమైన అవమానాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. మార్కెట్‌ ధరలు దైవాధీనం. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి రైతును వెక్కిరించాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అందుకు కారణం అప్పుడు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు. ఆర్థిక సంస్కరణ ల్లోని అమానుష పార్శా్వనికి ఒక లోగో మాదిరిగా ఆయన ఫొటో స్థిరపడిపోయింది. ప్రపంచబ్యాంకు జీతగాడు అనే బిరుదు కూడా దొరికింది. బోరు మోటార్లకు కరెంట్‌ బిల్లు చెల్లించకపోతే ఇంటి తలుపుల్ని పెకిలించి తీసుకొనిపోయేవారు. పరువు పోయిందని రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. పరువు పోకూడదని రైతు మహిళలు పుస్తెలమ్మి మరీ కరెంట్‌ బిల్లులు కట్టేవారు. పాలుతాగే వయసు బిడ్డలున్న తల్లుల పరిస్థితి హృద యవిదారకంగా మారింది. కడుపునిండా తిండిలేక బిడ్డకు స్తన్యమివ్వలేని దైన్యం వారిది. కల్లుసీసాకు పాలపీకను పెట్టి బిడ్డ చేతికిచ్చేవారు. కల్లు మత్తులో బిడ్డ నిద్రపోతుందని, ఆ నిద్రలో ఆకలి మరిచిపోతుందని ఒక ఆశ. ఈ పరిస్థితులను వివ రిస్తూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అనే పాట జాతీయ ఆర్తనాద గీతమైంది. ‘కుమ్మరి వామిలో తుమ్మలు మొలిసెను / కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను / పెద్దబాడిసె మొద్దుబారినది / సాలెల మగ్గం సడుగులిరిగినవి / చేతివృత్తులా చేతులిరిగి పాయే నా పల్లెల్లోనా / అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనా బాయే ఈ దేశంలోనా..’ అంటూ సాగే ఆ పాట నాటి పరిస్థితులకు అద్దం పట్టింది. ‘వ్యవసాయం దండగ’ అన్నది ఆనాడు చంద్రబాబు నినాదం.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘వ్యవసాయాన్ని పండుగ’ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు. అప్పటివరకున్న అప్పులు మాఫీ అయ్యాయి. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వ డానికి జలయజ్ఞం ప్రారంభమైంది. రైతు లోకంలో మళ్లీ ఆశలు మొలకెత్తాయి. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం పాలైన తర్వాత ఉద్యమ స్ఫూర్తి, వేగం కొరవడినప్పటికీ ఆ పథకాలైతే అరకొరగానైనా కొనసాగాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రా ల్లోని పల్లెలు కొత్త చిగురులు తొడుక్కుంటున్న దృశ్యాలు కన్పి స్తున్నాయి. తెలంగాణలో రైతుబంధు, మిషన్‌ కాకతీయ, కాళే శ్వరం ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు రైతు గుండెల్లో విశ్వా సాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పల్లె ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఫలితంగా మహాత్ముని ఆశయమైన ‘గ్రామ స్వరాజ్‌’ను అమలు చేసినట్లయింది. రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా నిధులు ఠంచనుగా చెప్పిన సమయానికి అందుతున్నాయి. పల్లెలు జన సందడితో కళకళలాడుతున్నాయి. పరిపాలనంతా పల్లెలోంచే సాగుతున్నది. సచివాలయంతోపాటు మరో కొత్త ల్యాండ్‌ మార్క్‌ అడ్రస్‌ – ‘రైతు భరోసా కేంద్రం’ (ఆర్‌బీకే).

ఆంధ్రప్రదేశ్‌ యువ ముఖ్యమంత్రి దార్శనికతకు మరో మచ్చుతునక ఆర్‌బీకే సెంటర్‌. ఇదొక విప్లవాత్మక ఆలోచన. మరో ఒకటి, రెండేళ్లలోనే ఆ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఈ కేంద్రాలు తేజోమయం చేయబోతున్నాయి. వ్యవసాయం సంక్షో భంలో కూరుకొనిపోవడానికి ప్రధాన కారణమేమిటి? పెట్టుబడి వ్యయం పెరగడం, పెరిగిన ధరలకు కూడా నాణ్యమైన ఇన్‌ పుట్స్‌కు బదులు నకిలీవి దొరకడం ఒక ప్రధాన కారణం. పండించిన పంటకు లాభసాటి ధర దొరకకపోవడం, ఎక్కువ సార్లు గిట్టుబాటు ధర కూడా లభించకపోవడం మరో ప్రధాన కారణం. ఈ రెండు ప్రధాన కారణాలను ఆర్‌బీకే సెంటర్ల ద్వారా పరిహరించే కార్యక్రమం మొదలైంది. ఈ సంవత్సరం కోటి టన్నుల ధాన్యాన్ని ఈ సెంటర్ల ద్వారా కొనుగోలుచేసి రైతులకు డబ్బులు కూడా చెల్లించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే ఏడున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల సబ్సిడీ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. నాన్‌–సబ్సిడీ వాణిజ్య పంటల విత్తనాలు ఇందుకు అదనం. ఆర్‌బీకే సెంటర్‌లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లో ఆర్డర్‌ చేసిన ఇరవై నాలుగ్గంటల్లోనే సీడ్‌ టెస్టింగ్‌ కిట్లతో నాణ్యతను పరిశీలించి మరీ రైతుకు అందజేస్తున్నారు. విత్తనాల్లో నాణ్యతే కాకుండా మార్కెట్‌ ధరకంటే తక్కువకు లభిస్తున్నాయనీ, రోజూ మండల కేంద్రానికి వెళ్లి ఎదురుచూసే వ్యయప్రయాసలు ఇప్పుడు లేవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులకోసం దుకాణాల ముందు చెప్పుల్ని క్యూలో విడిచిపెట్టే రోజులు ఇక గత చరిత్ర.

నాణ్యమైన విత్తనాల లభ్యత నుంచి పంట దిగుబడుల మార్కెటింగ్‌ వరకు అండగా నిలబడుతున్న ఆర్‌బీకేలకు ఈ మధ్యనే ప్రతిష్ఠాత్మకమైన ‘స్కోచ్‌’ ఆవార్డు కూడా లభించింది. గ్రామస్థాయిలోనే ఎరువులు, విత్తనాలను రైతులకు అంద జేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవా లని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించింది. ధాన్యం కొను గోళ్లకు, ఎరువులు–విత్తనాల సరఫరాకు మాత్రమే ఆర్‌బీకేలు పరిమితం కావు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఈ కేంద్రాలు బహుళార్థ సాధక కేంద్రాలు కానున్నాయి. సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను అద్దెపై అందుబాటులో ఉంచేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఆర్‌బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్లలో సేవలందించడానికి ఒక అగ్రి కల్చరల్‌ అసిస్టెంట్‌ ఉంటారు. ఆ వూళ్లో సాగయ్యే భూవిస్తీ ర్ణాన్ని బట్టి పంటల వైవిధ్యాన్ని బట్టి కొన్ని గ్రామాల్లో ఒకరికంటే ఎక్కువ గానే ఈ అసిస్టెంట్లు ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా ‘ఈ–క్రాపింగ్‌’లో తలమునకలై ఉంటూ కూడా, ఎరువులు, విత్త నాల సరఫరాలో ఇబ్బంది లేకుండా వీరు వ్యవహరిస్తున్నారు. ‘ఈ–క్రాపింగ్‌’ అనేది రైతుకు సౌకర్యవంతమైన కార్యక్రమం. ఇందులో నమోదైన వారికి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. ఏ కారణం వల్లనైనా పంట నష్టం జరిగినా ఇన్‌ పుట్‌ సబ్సిడీ, బీమా పరిహారం లభిస్తాయి. పంటను అమ్ము కోవడం కూడా సులభం. కౌలు రైతులకైతే ‘ఈ–క్రాపింగ్‌’ ఓ వరం. భూయజమాని సంతకం పెట్టకపోయినా ఈ సౌకర్యా లన్నీ కౌలు రైతుకు దక్కుతాయి. భూయజమాని సంతకం పెట్టినట్టయితే రైతు భరోసా కూడా లభిస్తుంది.

రైతు భరోసా కేంద్రం ప్రతి పల్లెలోనూ ఏర్పాటవడం రైతులకు గొప్ప సదుపాయం. నేరుగా కేంద్రానికే వెళ్లి రైతులు పంటల గురించి, ప్రభుత్వ పథకాల గురించి వాకబు చేసే అవకాశం దొరికింది. వ్యవసాయ శాఖ యంత్రాంగం కూడా గ్రామంలో ఉన్న అసిస్టెంట్ల ద్వారా రైతులకు సలహాలు, సూచ నలూ పక్కాగా అందజేయడానికి మార్గం ఏర్పడింది. రాష్ట్రంలో భూకమతాలు సుమారు 80 లక్షల మేరకు ఉంటాయి. పూర్తిగా వ్యవసాయంపైనే కేంద్రీకరించే రైతుల సంఖ్య కోటీ ఇరవై లక్షల దాకా ఉండొచ్చు. పది లక్షల కమతాలను స్వయంగా మహిళలే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సగటు కమతం విస్తీర్ణం ఒకటిన్నర ఎకరం మాత్రమే! ఈ చిన్న కమతంలోనే రైతు కుటుంబం తిండి, బట్ట, ఇతర ఖర్చులను వెళ్లదీయాలి. అందుకు అనుకూలమైన సేద్యపు నమూనాలను వ్యవసాయ శాఖ రూపొందించవలసి ఉన్నది. సమీకృత వ్యవసాయానికి (integrated farming) రైతులను సిద్ధం చేయాలనే ఆలోచన వున్నట్టు చెబుతున్నారు. కుటుంబానికి సరిపడా తిండిగింజలతోపాటు కొంతభాగం వాణిజ్య పంటను వేస్తూ, అనుబంధంగా కోళ్ల పెంపకం లేదా పాడి, లేదా చేపల పెంపకం చేపట్టి రోజువారీ ఆదాయం పొందేవిధంగా చేసే వ్యవసాయాన్ని ‘సమీకృత వ్యవసాయం’ అంటారు. చాలామంది ఆదర్శ రైతులు ఇప్పటికే ఇందులో ప్రయోగాలు చేసి రాణిస్తున్నారు. హైడెన్సిటీతో చేసే సాగు పద్ధతులూ, ఏడాది పొడుగునా ఏదో ఒక పంట తీసే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పంటలు పండించడమే కాదు పంట దిగుబడిని ప్రయాస లేకుండా అమ్ముకోవాలి. మన దేశ వ్యవసాయరంగంలోకి అవసరమైన మేరకు పనిముట్లు, యంత్రాలు ప్రవేశించలేదు. చిన్న కమతాలున్న రైతులు కూలీల సహాయం లేకుండానే పనులు పూర్తిచేసుకునే సామగ్రి తయా రీపై దృష్టిపెట్టాలి. బ్రష్‌ కట్టర్, పవర్‌ టిల్లర్, చాప్‌కట్టర్‌ వంటి వాటి వినియోగంలో శారీరక బలం కూడా అవస రమవు తున్నది. వీటిని మహిళా రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని రీడిజైన్‌ చేయాలి. ఈ అన్ని వ్యవహారాల్లోనూ ఆర్‌బీకేలు క్రియా శీలక పాత్రను పోషించవలసి ఉన్నది. చిన్న కమతం రైతు కూడా సేద్యంలో లాభాన్ని కళ్లచూడాలన్నదే ముఖ్యమంత్రి అంతరం గమని వ్యవసాయాధికారులు చెబు తున్నారు. అది సాఫల్యమైన నాడు వ్యవసాయ లాభాలపైన ఇతర వృత్తులూ, వ్యాపారాలు ప్రవర్ధమానమై పల్లెవెలుగులీనుతుంది.

ఒక తరం గడిచేసరికి రైతు కుటుంబాల్లోని అనేకమంది వారసులు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. వారి అభీష్టం మేరకు నచ్చిన వృత్తుల్లో స్థిరపడతారు. వ్యవసాయంపై ఒత్తిడి తగ్గుతుంది. కమతాల పరిమాణం పెరుగుతుంది. వచ్చే తరం రైతు విద్యాధికుడు. అతడు సాధారణ రైతు కాదు. ఒక రైతు శాస్త్రవేత్త. అననుకూల పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు సాధించగల ఇజ్రాయెల్‌ రైతులకు దీటైనవాడు. ఒక డాక్టర్‌లా, ఒక లాయర్‌లా, ఒక ఇంజనీర్‌లా, ఒక ప్రభుత్వ అధికారిలాగా అతనికి సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. పలుకుబడి ఉంటుంది. రాబోయే తరం రైతు సంపన్నుడు. ఎంపవర్డ్‌ ఫార్మర్‌. రైతును రాజును చేసే యుగ ప్రయాణానికి రాకెట్‌ ఇంధనం – ‘రైతు భరోసా కేంద్రం’!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement