ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు
ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..
లేకపోతే ఎంత గొప్పవారైనా అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదు
స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడతాం..అవసరమైతే జైలుకు పంపిస్తాం
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రసక్తే లేదు
ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న సీఎం
ప్రజల్లో విశ్వాసాన్ని, పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని సూచన
కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవశ్యమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ‘చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు. అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదిలేయాలని ఆక్రమణ దారులకు విజ్ఞప్తి చేస్తున్నా..లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం. నాలాలపై ఆక్రమణలను కూడా తప్పనిసరిగా కూల్చేస్తాం.
కూల్చివేతలపై స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడతాం. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించే లక్ష్యంతోనే హైడ్రాను ఏర్పాటు చేశామని, ఆక్రమణదారులు ఎంత గొప్పవారైనా చర్యలు తప్పవని చెప్పారు. ఇదే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం నిర్వహించిన ఎస్‌ఐల దీక్షాంత్ పరేడ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 145 మంది మహిళలు సహా 547 మంది సివిల్ ఎస్‌ఐలు, రిజర్వ్ ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలను బహూకరించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన పల్లి భాగ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి
‘పోలీస్ ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగ బాధ్యతగా మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలను కాపాడే ఉద్యోగంగా, భావోద్వేగంతో చూడాలి. ప్రకృతి విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా, ఏ ఇతర సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే. ఆ మేరకు ప్రజల్లో విశ్వాసాన్ని, పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపాలి. సైబర్ నేరాలకు తావులేకుండా యువ పోలీస్ అధికారులు పనిచేయాలి.
డ్రగ్స్, గంజాయి పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ఆక్రమణల కూల్చివేతలు, డ్రగ్స్ కట్టడి సహా ప్రభుత్వ అన్ని నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉంది. కాస్మొటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులతోనే.. నేరస్తులతో కాదు. మీ అందరినీ చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న విశ్వాసం కలుగుతోంది..’అని సీఎం అన్నారు.
రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూళ్లు
‘సైనిక్ స్కూళ్ల మాదిరిగా హైదరాబాద్, వరంగల్‌లో ఒక్కొక్కటి 50 ఎకరాలతో రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించి డీజీపీ జితేందర్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఏడాది చివర్లో కొత్తగా 35 వేల ఉద్యోగాలు
‘కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది. కేవలం 28 రోజుల్లోనే 22.22 లక్షల రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణమాఫీ చేశాం. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో జిరాక్స్ సెంటర్లలో టీజీపీఎస్సీ ప్రశ్నపత్రాలు లభించే దారుణ పరిస్థితి ఉండేది. మా ప్రజా ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షలపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాది చివరికి కొత్తగా 35 వేల ఉద్యోగాలు ఇస్తాం..’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడడంలో, ప్రజలకు న్యాయం చేయడంలో ఎస్‌ఐల పాత్ర కీలకం అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా పనిచేయాలని యువ అధికారులకు సూచించారు.
కాగా పోలీస్ అకాడమీలో శిక్షణ సంబంధిత వివరాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర సీనియర్ అధికారులు, యువ ఎస్‌ఐల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం
‘హైదరాబాద్ నుంచి వచ్చే కాలుష్యంతో నల్లగొండ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి నా దృష్టికి తెచ్చారు. ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీలో శాశ్వత నివాసదారుల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం.నివాసితులైన 11 వేల మందిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది’
..: సీఎం రేవంత్ రెడ్డి :..
Comments
Please login to add a commentAdd a comment