చెరువుల్లో ఆక్రమణల తొలగింపుపై సీఎం రేవంత్‌రెడ్డి
నాడు ధర్మాన్ని గెలిపించేందుకు యుద్ధం
నేడు అదే తరహాలో చెరువుల్లో ఆక్రమణల తొలగింపు
రాబోయే రోజుల్లో హైడ్రా దూకుడు మరింత పెంచుతుంది
ఆక్రమణదారుల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీ వారున్నా తగ్గేదే లేదు
మణికొండ (హైదరాబాద్): ‘ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని గెలిపించేందుకు అర్జునుడి వెంట ఉండి కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. నేడు మేము ఆయన మార్గంలోనే భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను, చెరువులను అందించాలనే ఉద్దేశంతోనే చెరువుల్లో అక్రమ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం. ఇది కరుక్షేత్ర యుద్ధంతో సమానమే.. ఇందులో మా వారితో పాటు మంది కూడా ఉన్నారు. ఇది ఏమాత్రం రాజకీయ కక్ష కానేకాదు.. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం.
ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా తలవంచకుండా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం. వెనక్కి తగ్గేదే లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆది వారం హైదరాబాద్ నగర శివారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో హరేకృష్ణ మూవ్‌మెంట్ వారు నిర్మిస్తున్న హెరిటేజ్ టవర్‌లో అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
చెన్నై, వయనాడ్‌లా కాకూడదు
‘హైదరాబాద్‌కు హెరిటేజ్ సిటీ, లేక్ సిటీగా పేరుంది. ఆ ప్రత్యేకతను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే చెన్నై, వయనాడ్‌లా ప్రకృతి మనపై ప్రతాపం చూపిస్తుంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల చుట్టూ సంపన్నులు ఫాంహౌస్‌లు కట్టుకుని వాటి డ్రైనేజీని చెరువుల్లో కలపటం ఎంతవరకు సబబు? అలాంటి వారిలో కొందరు మా పార్టీ వాళ్లు కూడా ఉండొచ్చు. తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకునే సమయం వచ్చింది.
వారు సైతం కూల్చివేతలకు సహకరించాలి. కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయినా గండిపేట, హిమాయత్‌సాగర్ జలాలతో హైదరాబాద్ ప్రజలు దాహార్తి తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుకుని భవిష్యత్తరాలకు అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుని పనిచేస్తుంది. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇప్పటికే హైడ్రా పలు చెరువుల్లో ఆక్రమణలను తొలగించింది. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా పనిచేస్తుంది..’అని సీఎం స్పష్టం చేశారు
కాంక్రీట్ జంగిల్‌కు ఆధ్యాత్మిక శోభ
‘మన రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన ఫైనాన్షియల్ జిల్లా కాంక్రీట్ జంగిల్‌గా అభివృద్ధి చెందింది. అలాంటి చోట ఆరు ఎకరాల విస్తీర్ణంలో 430 అడుగుల ఎత్తులో ఆధ్యాత్మికతను బోధించే హెరిటేజ్ టవర్ రావటం ఎంతో అభినందనీయం. ఇలాంటి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనటంతో నా జన్మ ధన్యం అయ్యింది. 36 నుంచి 40 నెలల్లో పనులు పూర్తయ్యాక ప్రారంబోత్సవంలోనూ పాల్గొనాలని ఉంది.
ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప మందిరం అవుతుంది. ఇప్పటికే ఐటీ, వైద్యం, విద్య తదితర రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న మన రాష్ట్రం, హెరిటేజ్ టవర్ నిర్మాణంతో ఆధ్యాత్మికతలోనూ అదే స్థాయికి వస్తుంది. అనునిత్యం ఒత్తిడిలో జీవిస్తున్న ప్రజలకు ఇలాంటి దేవాలయాలతో మనశ్శాంతి, స్ఫూర్తి లభిస్తాయి.
అక్షయ పాత్ర ద్వారానే ఆస్పత్రుల్లో భోజనం
అక్షయపాత్ర ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన భోజనం అందిస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా హరేకృష్ణ మూవ్‌మెంట్ సహకారం అందించాలి..’అని రేవంత్‌రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌గౌడ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర మత్స్య సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.జైపాల్‌రెడ్డి, హరేకృష్ణ మూవ్‌మెంట్ గ్లోబల్ అధ్యక్షుడు మధుపండిత దాస, తెలంగాణ రీజియన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాసలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment