నిబంధనలకు పాతర!
నిబంధనలకు విరుద్ధంగా షావుకారు పేట పరిసరాల్లో కోకొల్లలుగా గోడౌన్లు ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. సోమవారం అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్‌ను
నిబంధనలకు విరుద్ధంగా షావుకారు పేట పరిసరాల్లో కోకొల్లలుగా గోడౌన్లు ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. సోమవారం అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా సెంట్ తయారీ పరిశ్రమగా కూడా ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు సజీవ దహనం అయినట్లు, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. దీంతో అధికారులు అక్రమ కట్టడాల అంతు చూసేందుకు చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఏటా అగ్ని ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది 25వేల అగ్ని ప్రమాదాల్లో వెయ్యిమంది మరణించినట్టు, రూ. 42 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు, గోడౌన్లలో అత్యధికంగా ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాలు జరుగుతున్నా, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చే వారిపై భరతం పట్టే వారే లేరు. చెన్నైలో ఏదేని నిర్మాణాలు చేపట్టాలన్నా, మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ, చెన్నై కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ అనుమతి తప్పని సరి. అయితే, అనుమతులు పొందకుండానే కోకొల్లలుగా భవనాలు నిర్మించారు. అలాగే, అనుమతులు ఓ రకంగా ఉంటే, నిర్మాణాలు మరో విధంగా చేపట్టే వాణిజ్య సముదాయాలు, భవనాల యాజమానులూ ఉన్నారు.
తాజాగా సోమవారం షావుకారు పేటలో జరిగిన అగ్ని ప్రమాదంతో మేల్కొన్న అధికారులు నిబంధనల మీద దృష్టి కేంద్రీకరించారు. నిబంధనలకు స్వస్తి : షావుకారు పేట పరిసరాల్లో గోడౌన్లు కుప్పలు కుప్పలుగా ఉన్నట్టుగా మంగళవారం జరిపిన పరిశీలన లో తేలింది. ఎలాంటి అనుమతులు పొందకుండా, నివాస ప్రాంతాల్లో ఈ గౌడౌన్లు వెలసి ఉండడం చూస్తే, ఆ పరిసరవాసులకు భద్రత ఏమేరకు ఉందో స్పష్టం అవుతోంది. గోడౌన్లే కాకుండా, చిన్న చిన్న పరిశ్రమలు ఎలాంటి అనుమతులు లేకుండా వెలిసి ఉండడం గమనార్హం. టోకు వర్తకులు పెద్ద ఎత్తున అలంకరణ వస్తువులు, సెంట్, సుగంధ ద్రవ్యాలు, ఇళ్లకు ఉపయోగించే వస్తువులు ఇలా అనేక రకాల గోడౌన్లు ఉన్నారుు, వాటికి చిన్న చిన్న మరమ్మతులు చేయడం, ఆ గోడౌన్ల పరిసరాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉండటం వెలుగులోకి వచ్చింది. షావుకారు పేట పరిసరాల్లోని రోడ్లు ఆక్రమణలకు గురి కావడం, అందు వల్లే సందులన్నీ ఇరుకుగా మారినట్టు నిర్ధారించారు.
మృతదేహం లభ్యం: సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ మరణిం చ లేదని తొలుత నిర్ణయించారు. అయితే, పూర్తిస్థాయిలో పొగ అదుపులోకి వచ్చాక, రాత్రి అగ్నిమాపక సిబ్బందిలోనికి వెళ్లారు. అక్కడ ఓ చోట కాలి బుడిదైన యువకుడి మృత దేహం బయట పడింది. ఆ గోడౌన్‌లోని రసాయన మిక్సింగ్‌లో పనిచేస్తున్న మదుర వాయిల్‌కు చెందిన లోకేష్(24)గా గుర్తించారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో మొదటి అంతస్తులో పడి ఉండడం గుర్తించారు. ఆ యువకుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మంటలు మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు పాకడంతో, మొదటి అంతస్తులో ఉన్న ఆ యువకుడు గాయాలతో తప్పించుకోగలిగారు. రెండో అంతస్తులో చిక్కుకు పోయిన లోకేష్ సజీవ దహనం అయ్యాడు. దీంతో మురళీ కాంప్లెక్స్ యజమాని, అక్కడ గోడౌన్, పరిశ్రమను నడుపుతున్న యజమానిపై కేసులు నమోదు అయ్యాయి.