
క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యం
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. గతంలో ఇదే పథకం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల వరకు కురిపించింది. ఈ సారి బీపీఎస్‌లో పెట్టిన షరతులు, సాంకేతిక నిబంధనల కారణంగా రూ.కోటి కూడా దాటలేదు. ఈ పథకానికి సోమవారంతో గడువు ముగియనుండడంతో స్థానిక సంస్థల ఖజానాలు కాస్త నిండుతాయనుకున్న అధికారుల ఆశలు ఆవిరికానున్నాయి.
- జిల్లాలో వెయ్యి దాటని దరఖాస్తులు
- బీపీఎస్‌కు నేటితో ముగియనున్న గడువు
చిత్తూరు (అర్బన్): అనుమతుల్లేని భవనాలు, అక్రమకట్టడాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది మే 22న ప్రత్యేక ఉత్తర్వులు (జీవో 128)ను జారీ చేసింది. 1985 తరువాత 2014 డిసెంబర్ 31 వరకు నిర్మించిన కట్టడాలకు బీపీఎస్ పథకం అమలు చేస్తూనే పలు నిబంధనల్ని పెట్టింది. బీపీఎస్ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం గతంలో ప్రజలు నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి అందచేసేవారు. ఇప్పుడు దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే అందజేయాల్సి రావడం, అన్ని పత్రాలను స్కానింగ్ చేసుకున్న తరువాతే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలనడం, దీంతో పాటు ఇంటర్నెట్ బ్యాకింగ్ నుంచి రూ.10 వేలు ప్రాథమికంగా చెల్లించాలని చెప్పడం బీపీఎస్ వనరుల్ని దెబ్బతీసింది.
ఇప్పటికే జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కార్యాలయాల్లో సరైన కంప్యూటర్లు లేకపోవడం, ఆన్‌లైన్‌లో సమస్యలు రావడంతో ప్రజలు మధ్యవర్తుల ద్వారా దరఖాస్తులను అందిస్తూ వచ్చారు. దీనికితోడు అధికారులు సైతం బీపీఎస్‌పై పెద్దగా ప్రచారం నిర్వహించకపోవడం కూడా ప్రధాన కారణం. ఫలితంగా జిల్లాలో శనివారానికి కేవలం 997 దరఖాస్తులు మాత్రమే బీపీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయ్యాయి.
గడుపు పొడిగిస్తారా...?
క్రమబద్ధీకరణకు అడ్డుగా ఉన్న కొన్ని నిబంధనల వల్ల దరఖాస్తులు చేసుకోవడం ఆలస్యంగా మారుతున్నట్లు ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంలో పలు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటిన్నింటికీ తోడు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే అధికారులను, సిబ్బందిని గోదావరి పుష్కరాల్లో విధులకు పంపడం బీపీఎస్‌పై ప్రచారానికి అడ్డుగా నిలిచింది. బీపీఎస్ గడువు పెంచాలనే వాదన ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో వేచి చూడాలి.
ఇదీ పురో‘గతి’
- చిత్తూరు నగర పాలక సంస్థలో గతంలో బీపీఎస్‌కు 1,600 దరఖాస్తులు రాగా.. రూ.5 కోట్ల వరకు ఆదాయం లభించింది. ఈ సారి కేవలం 84 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
- తిరుపతి కార్పొరేషన్‌లో క్రబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు 532. గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఆరో వంతు.
- మదనపల్లెలో ఇప్పటి వరకు 101 దరఖాస్తులు వచ్చాయి. కానీ పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాల సంఖ్య మాత్రం వెయ్యికిపైనే ఉండడం గమనార్హం.
- పుంగనూరులో 63, శ్రీకాళహస్తిలో 134, పలమనేరులో 31, నగరిలో 13, పుత్తూరులో 34 దరఖాస్తులు మాత్రమే బీపీఎస్ కింద అందాయి.
- జిల్లా మొత్తంలో ఇప్పటి వరకు బీపీఎస్ కింద అందిన
- దరఖాస్తులు 992.