గురుకుల్ ట్రస్ట్‌లోని అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వేకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇటీవల ఈ ట్రస్ట్‌లోని నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాలను కూల్చివేయడంతో పాటు మరికొన్ని భవనాలకు తాళాలు వేసిన సంగతి విదితమే.
సాక్షి, హైదరాబాద్ : గురుకుల్ ట్రస్ట్‌లోని అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వేకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇటీవల ఈ ట్రస్ట్‌లోని నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాలను కూల్చివేయడంతో పాటు మరికొన్ని భవనాలకు తాళాలు వేసిన సంగతి విదితమే. అయితే జీహెచ్‌ఎంసీ వద్ద ట్రస్ట్‌లోని ఆయా భవనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేదు. ట్రస్ట్‌లోని భవనాలకు నిర్మాణ అనుమతి లేకపోయినప్పటికీ, చాలా వాటికి తాగునీరు, విద్యుత్ సదుపాయాలున్నాయి. కొన్ని భవనాలకు నిర్మాణ అనుమతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలతో కూడిన సమన్వయ కమిటీతో సర్వే చేయాలని నిర్ణయించారు.
ఈ కమిటీ గురుకుల్ ట్రస్ట్‌లో సోమవారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. కమిటీ గుర్తించిన అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. భవనాల ఆస్తిపన్ను టిన్ నంబర్ తరహాలో ఒక యూనిక్ నంబరును కేటాయించనున్నట్లు చెప్పారు. సదరు నంబరు ద్వారా భవనానికి సంబంధించిన పూర్తివివరాలు తెలిసేలా డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఆయా ప్రభుత్వ విభాగాలతో కూడిన ఐదు బృందాలు ఈ సర్వేలో పాల్గొంటాయని చెప్పారు.