దేవుని పేరుతో దౌర్జన్యం | Illegal structures in front of ankalamma temple | Sakshi
Sakshi News home page

దేవుని పేరుతో దౌర్జన్యం

Published Fri, Nov 21 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

Illegal structures in front of ankalamma temple

 కందుకూరు అర్బన్ : అనుకున్నదొక్కటి.. ఐనదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఇది ఓ చిత్రంలో సన్నివేశానికి అనుగుణంగా కవి రాసిన పాట. ఈ పాట పట్టణంలోని అంకమ్మ దేవాలయంపై పెత్తనం చేస్తున్న పెద్దలకు అతికినట్లు సరిపోతుంది. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై రాజకీయ వేధింపుల్లో భాగంగా స్థానిక అంకమ్మ దేవాలయం ముందు.. వెనుక ఉన్న స్థలం తమదేనంటూ గుడి కార్యకలాపాలు చూస్తున్న టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

అంతటితో ఆగకుండా గుడి వెనుక స్థలంలో చిరువ్యాపారుల బడ్డీబంకును రాత్రి రాత్రే తొలగించి వివాదానికి తెరలేపారు. తీరా సమాచారం చట్టం ద్వారా తెలుసుకుంటే ఆ స్థలం అంకమ్మ తల్లి దేవాలయానికి సంబంధించింది కాదని, అది మున్సిపాలిటీ స్థలమని తేలింది. కొన్నేళ్లుగా దేవాలయంపై కొందరు పెత్తనం చేస్తున్నారు. ఆలయం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ వైపున ఖాళీ స్థలాల్లో బంకులు పెట్టుకున్న చిరు వ్యాపారుల నుంచి అద్దెలు కూడా వసూలు చే స్తున్నారు.

అభివృద్ధి పేరుతో దేవాలయం ముందు భాగంలో మున్సిపల్ స్థలంలో వరిగడ్డి వామిలు, జామాయిల్, చౌక కర్రల వ్యాపారులకు అద్దెలకు ఇచ్చారు. ఫలితంగా దేవాలయానికి వెళ్లేందుకు దారి సక్రమంగా లేకపోవడంతో క్రమేపీ భక్తుల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. అద్దెల రూపలో వచ్చిన ఆదాయం ఎవరికి చెందుతుంతో తెలియదుగానీ దేవాలయం అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. చిరువ్యాపారుల్లో కొందరు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉండటం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేశారని ఓ బొంకును దేవాలయం ముఖ ద్వారం నిర్మాణం పేరుతో రాత్రికి రాత్రే తొలగించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ స్థలం ఎవరిదన్న విషయమై వివాదం జరుగుతుండగా  ఓ వ్యక్తి సమాచార చట్టం ద్వారా మున్సిపాలిటీని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీలోని రికార్డులు పరిశీలించగా తూర్పు వైపున సుమారు 78.50 సెంట్లు, ఉత్తరం వైపున సుమారు 32.00 సెంట్లు, పడమర వైపున ఉన్న 58.00 సెంట్లు, దక్షిణం వైపున 10.28 సెంట్లు మున్సిపాలిటీదేనని తేలింది. గుడికి ముందు, వెనుక వైపు మున్సిపల్ స్థలమని అప్పట్లోనే తేలింది. ఆ స్థలంలో ఇతరులకు పట్టా ఇవ్వకుండా అంకమ్మ గుడికి ఇవ్వాలని కోరుతూ 1991 అక్టోబర్ 15వ తేదీని పురపాలక సంఘం తీర్మానించింది. దీని ప్రకారం రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు.
 
 నిద్రనటిస్తున్న అధికారులు
 వాస్తవానికి స్థలం ఎవరిదైనా పట్టణంలో కట్టడం నిర్మించాలంటే మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. మున్సిపాలిటీకి న్యాయ సలహాదారులు ఉన్నా తెలుగు తమ్ముళ్లు రాత్రికి రాత్రే ఆలయం ముఖద్వారం నిర్మిస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. అనుమతులు లేకండా నిర్మాణాలు చేపడితే ముందు రోజుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైన అధికారులు స్పందించి మున్సిపల్ స్థలాన్ని కబ్జాకోరల నుంచి విడిపించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా దేవాలయం ముందు ఖళీ స్థలాలకు అద్దెల రూపంలో వసూలు చేస్తున్న నగదు మున్సిపాలిటీకి జమ కావడం లేదని చెప్పారు. ఆలయ ముఖ ద్వారం నిర్మాణానికి తమ నుంచి ఎవరూ అనుమతి తీసుకోలేదని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement