ప్రజా మేనిఫెస్టో | Public Manifesto | Sakshi
Sakshi News home page

ప్రజా మేనిఫెస్టో

Published Tue, Jan 26 2016 2:32 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

ప్రజా మేనిఫెస్టో - Sakshi

ప్రజా మేనిఫెస్టో

పాలకుల ముందు ప్రజల మేనిఫెస్టో
సిటీజనుల ఆకాంక్షలు, అభిప్రాయాల మేరకు రూపకల్పన   
మౌలిక సదుపాయాలు, పారదర్శకత, జవాబుదారీతనం ప్రధానాంశాలు
రూపొందించిన పలు స్వచ్ఛంద సంస్థలు

 
 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. ప్రచారం పదునెక్కింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు అరచేతిలో అభివృద్ధి చూపిస్తున్నాయి. గ్రేటర్ ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అద్భుతాలు చేస్తామంటూ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. పార్టీల హామీలు, నాయకుల మాటలు శ్రద్ధగా, ఓపిగ్గా వింటున్న ప్రజలు ఏం అనుకుంటున్నారు? అసలు వారేం కోరుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానమే ‘ప్రజా మేనిఫెస్టో’. అవును.. ప్రజలే తమ మేనిఫెస్టోను రూపొందించి పార్టీల ముందుంచితే ఎలా ఉంటుంది.

అచ్చంగా అదే పనిచే శాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. ప్రజల పక్షాన మేనిఫెస్టో విడుదల చేశాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, కోవా, అప్సా, అభిప్రాయ్, బస్తీ వికాస్ మంచ్, లెట్స్ ఓట్, యునెటైడ్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సెల్ఫ్ హెల్ప్, ఛత్రి... తదితర 15కు పైగా స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాలుపంచుకున్నాయి. మౌలిక సదుపాయాలు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం.. తదితర అంశాలపై ‘ప్రజా మేనిఫెస్టో’ను రూపొందించి పార్టీల ముందుంచాయి.  

 ముఖ్యాంశాలు..
► విశాలమైన రోడ్లు, పాదచారులకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లు. ఆక్రమిత ఫుట్‌పాత్‌ల పరిరక్షణ.   
► మురుగు, వర్షపు నీటిని బయటకు పంపేందుకు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు.
► ప్రతి వార్డుకు ఒక పార్కు ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతను స్థానికులకే అప్పగించాలి. ప్రతి వార్డులో ఒక ఆటస్థలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదం చేసే ఆటలను ప్రోత్సహించాలి.
► అన్ని కాలనీలు, ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వీటి నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
► ప్రతి రోజు ఒక వ్యక్తికి 100 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలి.
► చెత్త సేకరణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
► నగరంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కాలుష్యం దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలి.
► దోమలు, కుక్కలు, పందుల బెడదను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
► ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
► ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ సేవలన్నింటినీ జీహెచ్‌ఎంసీలోని ప్రత్యేక విభాగం కింద చేర్చి 24 గంటల పాటు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచాలి.
► ఆస్తిపన్నుపై శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలి. అవినీతి లేని, పారదర్శక పరిపాలనను అందజేయాలి. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి.
► అన్ని విభాగాల్లో పౌరసేవా పత్రం అమలు.
► వార్డు కమిటీల్లో పార్టీ కార్యకర్తలు, బంధుగణాలకు తావు లేకుండా చూడాలి. చట్టంలో పేర్కొన్న విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు ఉండాలి.
► కార్పొరేటర్లకు ఏడాదికి కేటాయించే రూ.కోటి నిధులతో చేపట్టే పనుల వివరాలను వార్డు కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. మురికి వాడల అభివృద్ధి, పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
► హుస్సేన్‌సాగర్, మూసీ నది ప్రక్షాళనను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. చార్మినార్ పరిరక్షణ, సుందరీకరణ చర్యలు చేపట్టాలి.
 
 అక్రమ కట్టడాలను అరికట్టాలి. సంబంధిత అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement