యనమలకుదురు వ్యవహారంపై సమగ్ర విచారణ
ప్రభుత్వానికి నివేదిక
నలుగురు గ్రామ కార్యదర్శులపై చర్యకు,ఇద్దరు ఆర్కిటెక్చర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు
నిబంధనల ఉల్లంఘనులపై కొరడా
విజయవాడ : యనమలకుదురు అక్రమ కట్టడాల వ్యవహారంపై విజిలెన్స్ కన్నేసింది. ఏడుగురిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేసింది. ‘చూడుచూడు మేడలు.. అక్రమాల జాడలు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. అడ్డగోలు నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అనధికారిక కట్టడాల్లో చక్రం తిప్పిన గ్రామ కార్యదర్శులు వి.బ్రహ్మం, పీఎన్‌పీ ఆనంద్ భూషణ్, ఎస్.రమేష్, పి.ఉమామహేశ్వరరావులు మామూళ్లు దండుకొని నిబంధనలు ఉల్లంఘించారని తేల్చారు. వీరిని విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. శ్రీనివాస ఇంజనీర్ ఆర్కిటెక్చర్చ్‌కు చెందిన ఉడా లెసైన్స్‌డ్ ఆర్కిటెక్చర్ కె.శ్రీనివాసరావు, లక్ష్మీ దుర్గ అసోసియేట్స్‌కు చెందిన ఆర్కిటెక్చర్ కె.రవీంద్రబాబుల ఆర్కిటెక్చర్ లెసైన్స్‌ను రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.
అక్రమాల కేరాఫ్...
రాజధాని నగరాన్ని ఆనుకొని ఉన్న యనమలకుదురు గ్రామం అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ముఖ్యంగా గ్రామంలో ప్రధాన రహదారులు మినహా మిగిలిన ప్రాంతంలో రోడ్లన్నీ పూర్తిగా 20 అడుగులవే. గడిచిన మూడేళ్లలో తాడిగడప డొంక రోడ్డు వేగంగా అభివృద్ధి చెందింది. దీంతో రియల్టర్లు పొలాలు, ఖాళీ స్థలాలను తీసుకొని లక్షల రూపాయలు ముడుపులుగా గ్రామ కార్యదర్శులకు చెల్లించి అడ్డగోలుగా అనుమతులు పొంది భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఇలా మూడేళ్ల వ్యవధిలో దాదాపు 160 భవనాలు వెలిశాయి. వీటిలో 90 శాతం వరకు అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌లే కావటం గమనార్హం. విజయవాడ నగరంలో అపార్ట్‌మెంట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవటంతో నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని యనమలకుదురులో గతంలో రేట్లు కాస్త అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువమంది ఇక్కడ అపార్ట్‌మెంట్లలోని ప్లాట్లు కొనుగోలు చేశారు.
నిబంధనలకు తూట్లు
అపార్ట్‌మెంట్లు నిర్మించాలంటే 30 అడుగుల రోడ్డు, ప్రతి ప్లాట్‌కు సెట్ బ్యాక్ తప్పనిసరి. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు జరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా అధికారుల్ని మేనేజ్ చేసిన అక్రమార్కులు విజిలెన్స్‌కు దొరికిపోయారు. గతేడాది వరకు గ్రామంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీలకే ఉండేది. గత ఏడాది సీఆర్‌డీఏ ఆవిర్భావానికి ముందు పంచాయతీలకు అధికారాలు రద్దు చేసి ఉడాకు అప్పగించారు. ఆ సమయంలో రియల్‌ఎస్టేట్ హవా ఎక్కువగా ఉండటంతో అప్పటి గ్రామ కార్యదర్శి దరఖాస్తులకు పాత తేదీలు వేసి అనుమతులు ఇచ్చేశారు. విజిలెన్స్ విచారణలో ఈ విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌లు 10, 20 అడుగుల రోడ్డులోనే నిర్మించటం, జి+2 అనుమతి తీసుకొని జి+4 నిర్మించటం, కొన్నింటిలో పెంట్ హౌస్‌లు కూడా నిర్మించటం, అపార్ట్‌మెంట్లు సెట్‌బ్యాక్ వదలకుండా నిర్మించటం, మరికొన్నిచోట్ల ఏటి ఒడ్డును కూడా ఆక్ర మించి అక్రమంగా కట్టడాలు నిర్మించటం వివాదాస్పదంగా మారింది.
అక్రమ మేడలపై... విజిలెన్స్
Published Sat, Nov 21 2015 12:52 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement