వేగం...సులభం
ఆన్‌లైన్‌లో ప్రభుత్వ శాఖల సమాచారం
భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం
మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు
సిటీబ్యూరో ఓ వైపు బీపీఎస్‌తో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. మరోవైపు భవిష్యత్‌లో ప్రజలు భవన నిర్మాణ అనుమతులను సులభంగా...త్వరితంగా పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రెవెన్యూ, వాటర్ బోర్డు, విమాన యాన సంస్థల సేవల అనుసంధానానికి యత్నిస్తోంది. ఎవరైనా భవన నిర్మాణానికిదరఖాస్తు చేసుకుంటే... అది ప్రైవేటు స్థలమేనా?.. లేక ప్రభుత్వానిదా?... నీటి సదుపాయం ఉందా? లేదా?... ఏదైనా వివాదం ఉందా? అనే వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని యత్నిస్తోంది. దీనికోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నీ తమ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని బీపీఎస్‌పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార సు చేసినట్లు తెలిసింది. అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులోని సర్వే నెంబరును నమోదు చేయగానే ఆ స్థలానికి సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా ఉండాలని సూచించింది.
ఇవి అధికారులతో పాటు ప్రజలకూ అందుబాటులో ఉండేలా చూడాలంది. ఉదాహరణకు నగరంలో ఎవరైనా ఒక ప్లాటు కొనాలనుకుంటే సంబంధిత సర్వే నెంబరును నమోదు చేయగానే వివరాలు తెలిసేలా.. ప్రభుత్వ భూముల సమాచారాన్ని రెవెన్యూ శాఖ... ఆ ప్రాంతంలో నీటి సరఫరాకు అవకాశం ఉందో లేదో తెలిపే సమాచారాన్ని వాటర్ బోర్డు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. నీటి సరఫరాకు అవకాశం ఉంటే బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చే ముందే జీహెచ్‌ఎంసీ తగిన ఫీజు వసూలు చేసి ఏర్పాట్లు చేస్తుంది. అవకాశం లేనట్లయితే తిరస్కరిస్తుంది. తద్వారా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఏదైనా స్థలానికి సంబంధించి వివాదాలున్నట్లయితే...ఆ విషయం తెలిసేలా ఉండాలి. తద్వారా దాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ముందస్తుగానే విషయం తెలుస్తుంది. అన్ని వివరాలూ ఇలా అందుబాటులో ఉంచడం (సీమ్‌లెస్ ఇన్ఫర్మేషన్) ద్వారా త్వరితంగా అనుమతులు రావడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని సబ్‌కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రస్తుతం టీఎస్ ఐపాస్ తరహాలో సింగిల్‌విండో విధానం ద్వారా ఇతర శాఖల వద్దకు వెళ్లకుండానే అనుమతులిచ్చేందుకూ వీలవుతుందని భావిస్తున్నారు. సబ్‌కమిటీ నివేదికను సీఎం పరిశీలించాక నిర్ణయం తీసుకుంటారు.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ అట్లాస్‌తో ప్రయోజనం..
ఎక్కువ ఎత్తున్న భవనాల నిర్మాణానికి ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఎంతో సమయం పడుతోంది. దీన్ని నివారించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ రూపొందిస్తున్న అట్లాస్‌ను వినియోగించుకోనున్నారు. నగరంలోని ఏ ప్రాంతంలో సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో భూమి ఉందో తెలిసేలా ఎంఎస్‌ఎల్(మీన్ సీ లెవెల్) వివరాలతో ఎయిర్‌పోర్టు అథారిటీ అట్లాస్‌ను రూపొందిస్తోంది. ఎఎంఎస్‌ఎల్‌ల వివరాలు సులభంగా అర్థమయ్యేలా వివిధ రంగుల్లో రూపొందుతున్న అట్లాస్‌తో తక్కువ ఎత్తు భవనాలను నిర్మించాల్సిన ప్రాంతాలకు ఒక రంగును, కొంత ఎత్తు వరకు అనుమతించే ప్రాంతాలకు మరో రంగును వినియోగిస్తారు. వీటిని బట్టి ఆ ప్రాంతంలో ఎంత ఎత్తు వరకు భవనం నిర్మించవచ్చునో సులభంగా తెలుస్తుంది. ఈ అట్లాస్‌ను ఆన్‌లైన్‌లో అనుసంధానించడం ద్వారా సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. త్వరితంగా అనుమతులు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. దీంతో పాటు అనుమతి లేని భవనాలకు రిజిస్ట్రేషన్లు చేయరు. తద్వారా భవిష్యత్‌లో అక్రమ నిర్మాణాలు లేకుండా చూడవచ్చని భావిస్తున్నారు.