సాక్షి, అమరావతి: అధికారం ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ‘భూ’ కబ్జాలు మాత్రం ఆగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వాగు పోరంబోకు భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయం కోసం కేటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు జీవో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం ముందే దుకాణాలు నిర్మించి వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి భూమిని సైతం కబ్జా చేసేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ‘చంద్రబాబు చిలక్కొట్టుడు.. కబ్జా’ వ్యవహారం ఇప్పుడు బయటపడింది.
కార్యాలయానికి.. వాగు పోరంబోకు భూమి
చంద్రబాబు ప్రభుత్వం 2018లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 392లో ఉన్న 3.65 ఎకరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించింది. ఎకరాకు ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లకు లీజు కింద కేటాయిస్తూ జీవో 228 జారీ చేసింది. ఆ భూమి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే వినియోగించాలని అందులో పేర్కొంది. ఇతరత్రా అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని కూడా స్పష్టం చేసింది.
ఈ భూ కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదం కూడా అయ్యింది. వాగు పోరంబోకు భూమిని చంద్రబాబు టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. వాగులు, చెరువులు, నదులు ఇతర జలవనరులకు సంబంధించిన భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది.
సహకరిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ అధికారి!
ఈ ఆక్రమణలపై ఎన్‌హెచ్‌ఏఐ యంత్రాంగం ఉదాసీనంగా ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ మీద ఎన్‌హెచ్‌ఏఐలో పనిచేస్తున్న ఓ అధికారి టీడీపీకి వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేసినా.. ఆయన పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. ఇక టీడీపీ కార్యాలయంలో సమావేశాలు జరిగితే.. ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన తూర్పు, పశ్చిమ సర్వీసు రోడ్లను పూర్తిగా ‘బ్లాక్’ చేస్తూ.. పార్కింగ్‌కు వాడేసుకుంటున్నారు. ఇష్టమొచ్చినట్లుగా సర్వీస్ రోడ్లపై కార్లు అడ్డంగా పెడుతుండటంతో ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోయారు.
దర్జాగా ఆక్రమణలు.. దుకాణాల నిర్మాణం
వాగు పోరంబోకు భూమి కేటాయింపుతో టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి చెందలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ
(ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోకి వచ్చే భూమిపైనా కన్నేశారు. నెమ్మదిగా దానిని ఆక్రమించడం మొదలుపెట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి కేటాయించిన భూమికి, ఎన్‌హెచ్‌ఏఐ సర్వీసు రోడ్డుకు మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారు.
ఏడాది క్రితం టీడీపీ కార్యాలయం ప్రధాన గేటు పక్కన ఓ దుకాణాన్ని నిర్మించి.. మైత్రి ఎంటర్‌ప్రైజస్ అనే పేరుతో ఒకరికి అద్దెకు కూడా ఇచ్చారు. తాజాగా మరో రెండు దుకాణాలను నిర్మించి.. వాణిజ్య కార్యకలాపాల కోసం ఇతరులకు అద్దెకిచ్చారు. రాజకీయ కార్యకలాపాల కోసమే వినియోగించాలని టీడీపీ ఆఫీస్‌కు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. దానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. ఎన్‌హెచ్‌ఏఐ సర్వీసు రోడ్డు పరిధిలోకి చొరబడి మరీ వాణిజ్య నిర్మాణాలు చేపట్టారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే.
Comments
Please login to add a commentAdd a comment