ఆక్రమణకు గురైన చెరువు
కుప్పం.. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ముందుగా చంద్రబాబునాయుడు పేరే.. సొంతూరు చంద్రగిరిలో ఓడగొట్టినా.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే రికార్డునిచ్చి.. ఓ విధంగా ఆయన పరువు నిలబెట్టిన ప్రాంతం కుప్పం. అయితే ఈ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోని బాబు.. తాను అధికారంలో ఉండగా ఈ ప్రాంతాన్ని తన తాబేదార్లు, పీఏలకు అప్పజెప్పేశారు. దొరికిందే తడవుగా సదరు తాబేదార్లు ఇష్టారాజ్యంగా కుప్పాన్ని చెరబట్టేశారు. ఇందుకు ఉదాహరణే ఊరి నడి అంచున ఉన్న వెంకటరామయ్య చెరువు. నానుడిలో వెంకటప్పా చెరువుగా ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు రియల్ వెంచర్‌గా మారిన ‘అ’క్రమం ఎలాగంటే..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అమరావతి, విశాఖల్లో జరిగిన భూ కుంభకోణాల గురించి అందరికీ తెలిసిందే. రాజధాని నగరాలైన అక్కడే అలా జరిగితే మరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తమ్ముళ్లు చూస్తూ ఊరుకుంటారా..? అందులోనూ.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం ప్రాంతంలో కొన్నాళ్లుగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పక్క రాష్ట్రాల రియల్టర్లు కూడా ఆసక్తి చూపడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసేశారు. భూములే కాదు చివరికి చెరువులను కూడా చెరబట్టేశారు. ఆ క్రమంలోనే కుప్పం బైపాస్ రోడ్ సమీపంలోని వెంకటప్పా చెరువును మింగేశారు.
తప్పుడు సర్వే నంబర్లతో లే అవుట్లు
సర్వే నం.226/2తో 3.58 ఎకరాల విస్తీర్ణం కలిగిన వెంకటప్పా చెరువు ఒకప్పుడు ఆ ప్రాంత రైతులకు జీవనాడి. అలాంటి చెరువుపై 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు కన్నేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ అండ ఉండడంతో తప్పుడు సర్వే నంబర్లతో ఈ చెరువును లే అవుట్‌గా మార్చేశారు. కుప్పం సమీపంలోని సీనేపల్లి గ్రామ పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ చేసుకోవడం.. ఆ ప్లాన్‌తో కుప్పంలోని సర్వే నం.226/2లోని చెరువులో నిర్మాణం చేసుకోవడం.. ఇలా టీడీపీ నేతలు, మనోహర్ సన్నిహితులు మతిన్ హజరత్, నజీర్, మణి బినామీ పేర్లతో చెరువును ప్లాట్లుగా చేసి తెగనమ్మేశారు. అప్పటి కుప్పం అధికారులకు అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే వదిలేశారు. దీంతో స్థానికులు, రైతులు అప్పటి మదనపల్లె్ల సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్ 2017 ఆగస్టులో కుప్పం వచ్చి కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు. అక్కడికక్కడే సర్వేకి ఆదేశించి.. హద్దులు ఏర్పాటు చేస్తుండగా.. అదే సమయంలో సదరు సబ్‌కలెక్టర్‌కు అమరావతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నామమాత్రపు సర్వే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతే ఆ తర్వాత అక్రమ కట్టడాల జోరు పెరిగిపోయింది.
కేసు హైకోర్టులో ఉన్నప్పటికీ ఆగని అక్రమ నిర్మాణాలు
చెరువులో అక్రమ నిర్మాణాలపై స్థానికులు, రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కబ్జాదారులే ముందుగా హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. కోర్టుకు వాస్తవాలు వివరించి స్టే వెకేట్ చేయించాల్సిన అధికారులు సరైన సమయంలో అప్పీల్‌కు వెళ్లకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో కనీసం నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆ కేసు సాకుతో పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా ఇప్పటికీ అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కుప్పం మండల టీడీపీ కోశాధికారి మణి బినామీ పేరిట అక్కడే మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించేశారు.
వాళ్లే కోర్టుకు వెళ్లే చాన్స్ ఇచ్చారు
వాస్తవానికి అప్పట్లో చెరువు ఆక్రమణలను రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చకుండా కాలయాపన చేశారు. ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లేలా కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. చెరువును రక్షించుకునేందుకు రెవెన్యూ వారితో కలిసి ఇరిగేషన్ శాఖాపరంగా చర్యలు చేపడుతుంది.
– హరినాథరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ
చెరువులో రియల్ వెంచర్ దారుణం
ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ చెరువుగానే చూపిస్తున్న ఆ భూమిలో రియల్ వెంచర్ వేయడం దారుణం. ఇప్పటికైనా అధికారులు హైకోర్టులో కేసు అంటూ కుంటి సాకులు చెప్పకుండా రూ.కోట్ల విలువైన చెరువు భూమి, చుట్టుపక్కల భూములను పరిరక్షించాలి. ఇది ప్రజలకు సంబం«ధించిన ఆస్తిగా గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నరేంద్ర ఆజాద్,
చెరువు దురాక్రమణ నిజమే
వెంకటప్పా చెరువు దురాక్రమణ వాస్తవమే. కచ్చితంగా అది ప్రభుత్వ స్థలమే. వేరే సర్వే నంబర్‌తో అప్రూవల్ తీసుకుని 2019కి ముందు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన మాట నిజమే. అయితే ఈ రెండేళ్లుగా ఆ చెరువు ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకున్నాం. హైకోర్టులో స్టే ఉండడంతో స్టే వెకేషన్ కోసం ప్రయతి్నస్తున్నాం. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు వ్యవహరిస్తాం. వాస్తవానికి చెరువు ఆక్రమణలను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఇరిగేషన్ అధికారులదే. ఆ శాఖ బాధ్యులు సరిగ్గా స్పందించాల్సిన అవసరం ఉంది.
– సురేష్, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment