పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం.. మళ్లీ తర్వాత గెలుస్తామో, లేదో.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరులు రాష్ట్రంలో ఖాళీగా కనిపించిన ప్రతి భూమినీ కబ్జా చేశారు. శ్మశానాలు, చెరువులు, గిరిజనుల భూములు, దళితుల భూములు, దేవుడి భూములు, ప్రభుత్వ భూములు.. ఇలా ఏదైనా కాదేదీ కబ్జాకు అనర్హం అనే రీతిలో చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ పెద్దలు, అధికారుల అండతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కబ్జా కాండ సాగించారు. వేలాది ఎకరాల భూములను చెరపట్టారు.. వాటికి తమ పేర్లు, బినామీల పేర్లతో దొంగ పత్రాలు సృష్టించారు.. వాటిని బ్యాంకుల్లో పెట్టి వందల కోట్ల రూపాయలను రుణాలుగా పొందారు. తిరిగి చెల్లించకుండా బ్యాంకులను నిండా ముంచారు. రాష్ట్ర విభజనతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన రాష్ట్రాన్ని కబ్జాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. రాష్ట్రంలో పచ్చ నేతల భూదందాలను సాక్షి క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్మయపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే..
వాస్తవానికి వీటికి నాలుగింతలపైనే భూములు కబ్జాకు గురయ్యాయని బాధితులు, ప్రజలు చెబుతున్నారు.. రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో కొట్టేసిన భూములు, విశాఖలో రికార్డులు ట్యాంపరింగ్ చేసి నొక్కేసిన భూములు వీటికి అదనం...
కబ్జా అన్న పదానికి అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పర్యాయపదంగా మారిపోయారు.రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అధికారమే అండగా కార్యకర్త స్థాయి మొదలుకొని ‘ముఖ్య’నేత వరకు భూ దోపిడీలకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు పంపిణీనే లక్ష్యంగా అందినకాడికి ఆరగిస్తున్నారు. రాజధాని అమరావతి సాక్షిగా మొదలైన భూముల వేట.. జిల్లాల్లోని శ్మశానాల వరకు సాగింది. ఏ మాత్రం పాపభీతి లేకుండా దేవుడి భూములనూ చెరబట్టారు. చెరువులను సైతం మింగేసి.. మిగిలిన భూ ఆకలిని తీర్చుకోవడానికి దళితులకు చెందిన అసైన్డ్ భూములపై పడ్డారు. మాది ప్రభుత్వం.. మరి ప్రభుత్వ భూములు మావి కాకుండా పోతాయా? అన్నట్లు చెలరేగిపోయారు. అంతటితో ఆగకుండా అవే కబ్జా భూములను బినామీల ద్వారా బ్యాంకుల్లో పెట్టి కోట్లాది రూపాయలు రుణాలుగా పొందారు. ఇలా ఒకటా రెండా.. రాష్ట్రంలో పచ్చ నేతల విపరీత చర్యలు ప్రజలకు తీవ్ర వేదన మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాకాండపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
1 సిక్కోలు
గ్రానైట్ కొండను తవ్వేసిన ‘కళా’ బంధువు
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కిమిడి కళా వెంకట్రావు బంధువుల చేతిలో ఒక గ్రానైట్ కొండే చిక్కుకుంది. వంగర మండలంలో మడ్డువలస సాగునీటి ప్రాజెక్టుకు ఆనుకొని ఇది ఉంది. కళా వెంకట్రావు మరదలు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏడాదిన్నర క్రితం ఈ కొండ ప్రాంతంలో అక్రమంగా కొంతమంది తవ్వకాలు చేపట్టారు. కిమిడి కుటుంబానికి సమీప బంధువైన కిమిడి సీతబాబు ఈ తవ్వకాల వెనుక ఉన్నట్టు విమర్శలున్నాయి. వాస్తవానికి వంగర మండలం పటువర్థనం గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కొండను వారు గ్రానైట్ తవ్వకాల కోసం లీజుకు తీసుకున్నారు. కానీ అక్కడకాకుండా మడ్డువలస గ్రామానికి, ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న పాండవుల కొండపై తవ్వకాలు మొదలెట్టారు. సుమారు ఐదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ కొండ ప్రాంతంలో తవ్వకాల గురించి ‘సాక్షి’ 2016 నవంబర్‌లోనే కథనాలు రాసింది. దీంతో మైనింగ్ అధికారులు స్పందించి ఆ క్వారీని సీజ్ చేశారు. కానీ కొండ మాత్రం కిమిడి కుటుంబీకుల గుప్పెట్లోనే ఉంది.
ఇక్కడున్న గ్రానైట్ విలువ దాదాపు రూ.10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మరో విషయం ఏమిటంటే.. ఈ కొండను సీజ్ చేసిన సమయంలో 60 వరకూ గ్రానైట్ బండలు ఉండేవి. ప్రస్తుతం రెండు, మూడు మాత్రమే ఉన్నాయంటే మిగతావన్నీ ఏమైపోయాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దాదాపు రూ.9 కోట్ల వరకూ పరిహారం కాజేశారు. దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమికి దొడ్డిదారిలో పట్టాలు సృష్టించి మార్గం సుగమం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో గొర్లె విజయ్‌కుమార్, గొర్లె లక్ష్మణరావు, కలిశెట్టి సహదేవుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల మండలంలోనే ఎస్‌ఎం పురం కొండ ప్రాంతంలో శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ దంపతుల కుమారుడు అవినాష్ రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి రంగం సిద్ధం చేశాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ మొత్తం 38 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉంది. వాటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటుంది.
2 తూర్పుగోదావరి
హద్దే లేని పచ్చ నేతల భూదందా
తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భూ కబ్జాలతో రెచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. కాకినాడకు సమీపంలోని తూరంగిలో సర్వే నంబర్ 231లో తన బంధువుల పేరిట ఉన్న 47 ఎకరాలను ఆనుకుని ఉన్న రూ.5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆకుల గోపయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ అనకాపల్లి సెటిల్‌మెంట్ కోర్టు ద్వారా న్యాయపరంగా కొనుగోలు చేసిన స్థలం తనదేనంటూ ఎమ్మెల్యే తన స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారాన్ని అడ్డుపెట్టి చేయని ప్రయత్నం లేదు. అదే సంస్థకు చెందిన 230/2 సర్వే నంబర్‌లోని మరో స్థలాన్ని కూడా సర్వే నంబర్లు మార్చి అనుచరుల పేరిట కట్టబెట్టేశారు. ఇక.. మహాలక్ష్మినగర్ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి స్థలం తనదంటూ అల్లరి మూకలతో వెళ్లి పొక్లెయిన్‌తో తవ్వించేసిన వ్యవహారంపై ఎమ్మెల్యే వనమాడి సోదరుడు సత్యనారాయణ, ఆయన కుమారుడు, కార్పొరేటర్ వనమాడి ఉమాశంకర్‌పై కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో పోలీసు కేసు కూడా నమోదవగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చేశారు. ఇక కొవ్వూరు రోడ్డులోని మూడెకరాల అసైన్డ్ భూమి విషయంలో కూడా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి ఎకరం స్థలాన్ని స్వాహా చేసి ఇళ్ల స్థలాలుగా అమ్మేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలో ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామికి చెందిన 3.73 ఎకరాల భూమి సైతం ఆక్రమణల జాబితాలో చేరిపోయింది. అలాగే కడియం మండలం వేమగిరి పంచాయితీ పరిధిలో 172 సర్వే నెంబర్‌లో 80 సెంట్ల ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా చెప్పుకుని అధికార పార్టీ నేత ఒకరు గ్రావెల్ తవ్వకాలు సాగించారు. ఇక తుని నియోజకవర్గం తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాది మఠం రామచంద్రస్వామికి 410 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో సాగు చేసుకోవడానికి స్థానిక రైతులకు మఠం లీజుకు ఇచ్చింది. ఈ భూములపై టీడీపీ నాయకుల దృష్టి పడింది. దీంతో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి రైతులకు చెందిన భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేసేసుకున్నారు. తొండంగి మండలం పి.అగ్రహారం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 31, 32, 33 నుంచి 59 వరకు ఉన్న 410 ఎకరాల్లో సుమారు 80 ఎకరాలను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, అన్నవరం దేవస్థానం ధర్మకర్త యడ్ల భేతాళుడు, టీడీపీ వాణిజ్య విభాగం మండల ఉపాధ్యక్షుడు సిద్దా ముత్యాలు కుటుంబ సభ్యుల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం భూముల విలువ రూ.25 కోట్ల పైనే ఉంటుంది. సర్వే నంబర్ 33/1, 33/2లో సిద్ధా ముత్యాలు భార్య గంగా భవాని 16.50 ఎకరాలు, సర్వే నంబర్ 33/3, 33/4లో సిద్ధా అచ్చియ్యమ్మ 42 ఎకరాలు, సిద్ధా ముత్యాలు ఏడెకరాలు కబ్జా చేశారు. సర్వే నంబర్ 33/1, 31/591లో యడ్ల భేతాళుడు 8 ఎకరాలు, యడ్ల శ్రీనివాసరావు 4, గెడ్డం శ్రీకాంత్ 6 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.
3 విజయ నగరం
భూబకాసురులు
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి నుంచి అందరూ భూములు ఆక్రమించడంలో ఆరితేరిపోయారు. విజయనగరం, పూసపాటిరేగ, సాలూరు, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో పేదల భూములు, గిరిజనుల భూములతోపాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా సాగుచేసుకుంటున్నారు. విజయనగరం పట్టణ శివారు ప్రాంతం బొబ్బాదిపేట మండల పరిధిలో సర్వే నెంబర్ 4/3లోని 5 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం విజయనగరం మున్సిపాలిటీలో విలీనమై.. ప్రస్తుతం 26వ వార్డు పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో గజం స్థలం ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. ఇప్పటికీ లేఅవుట్‌ను క్రమబద్ధీకరించుకోని స్థల యజమానులు అడ్డదారిలో అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన స్థానిక కౌన్సిలర్‌తో బేరం కుదుర్చుకున్నారు. లేఅవుట్ పక్కగుండా వెళ్లే 60 అడుగుల ఎర్రవాని చెరువు కాలువలో సింహభాగం ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌కి వెళ్లి వచ్చేందుకు రెండు రహదారులను నిర్మించేస్తున్నారు.
ఎర్రవాని చెరువు ఆయకట్టు రైతులు ప్రతిఘటించటంతో స్థానిక కౌన్సిలర్ రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి లేఅవుట్‌కు సరిహద్దులు వేసి వెళ్లగా వాటిని అక్రమార్కులు యథేచ్చగా మార్చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. పార్వతీపురంలో వరహాలగెడ్డ పోరంబోకు సుమారు రెండెకరాలను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించాడు. గెడ్డ ప్రవాహ దిశను మార్చి రూ.2 కోట్లు విలువ చేసే స్థలాన్ని రియల్ ఎస్టేట్‌లో కలుపుకున్నాడు. అలాగే పార్వతీపురం నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ నివాస గృహాన్ని నిర్మిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సుమారు 20 సెంట్ల వరకు గెడ్డను ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారు. అలాగే, ఎమ్మెల్సీ సోదరుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు కూడా వరహాలగెడ్డలో సగం వరకు మట్టిని పోసి గెడ్డను చిన్న పిల్లకాలువలా తయారుచేశారు.
చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో సర్వే నంబర్ 383లో ఆరెకరాల ప్రభుత్వ భూమిని ఆ గ్రామ టీడీపీ ఎంపీటీసీ భర్త కెల్ల రామారావు తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటున్నాడు. నెల్లిమర్లలో మండలపరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని సర్వే నంబర్ 75లో 2.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ రూ.10 కోట్ల పైమాటే. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ ట్రస్టు ఈ భూమిని ఆక్రమించుకుని బోర్డులు సైతం ఏర్పాటు చేసింది. అలాగే నెల్లిమర్ల మండలం మల్యాడలో అదే గ్రామానికి చెందిన గేదెల సత్యం అనే టీడీపీ నేత ఏకంగా 1.65 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఆక్రమిత భూమి విలువ రూ.35 లక్షల పైనే. అలాగే పూసపాటిరేగ మండలం కొల్లాయివలసలో సుమారు 24 ఎకరాల డీపట్టా భూమిని విశాఖకు చెందిన చిట్టిరాజుతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధి దర్జాగా ఆక్రమించుకున్నారు. పెదబత్తివలస రెవెన్యూ పరిధిలో దాదాపు 150 ఎకరాల డీ పట్టా భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. పెదబత్తివలస పరిధిలోని సర్వే నెంబర్ 1లో ఉప్పులాపుకొండ పరిధిలో గతంలో దళితులకు ఇచ్చిన సుమారు రూ.4 కోట్లు విలువైన 8 ఎకరాల డీ పట్టా భూమి వలిరెడ్డి శ్రీరాములు నాయుడు పేరుకు మారింది.
నిరుపేదలకు ఇచ్చిన 18.50 ఎకరాల ప్రభుత్వ డీపట్టా భూములను జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు కాజేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూసపాటిరేగ మండలం కొల్లాయివలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 12914పిలో 20 సెంట్లు, 12913సిలో 15.03 ఎకరాలు, 1303పిలో 0.30 సెంట్లు, 1236పిలో 3 ఎకరాలు ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకోగా, ఆక్రమించిన భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట కొబ్బరి, జామి తోటలును వేసి ఫలసాయం కూడా పొందుతున్నారు. పూసపాటిరేగ ఎంపీపీగా ఆయనే కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు సైతం ఆయన ఆక్రమించిన భూముల వైపు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోతున్నారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్ 40 ఎకరాల ప్రభుత్వ, గ్రామదేవత భూముల్లో చేపల చెరువు ఏర్పాటు చేశారు. ఆర్‌పీ భంజ్‌దేవ్ 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపలచెరువు సాగుచేస్తున్నట్టు రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. ఆర్‌పీ భంజ్‌దేవ్ విశ్వనాథపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 142లో 15 ఎకరాల భూమిలో చేపల చెరువు నిర్మాణానికి దరఖాస్తు చేస్తే, భంజ్‌దేవ్ తమ్ముడైన ఏపీ భంజ్‌దేవ్ కూడా అదే సర్వే నంబర్ భూమిలో మరో 10 ఎకరాల 46 సెంట్ల భూమిలో చేపల చెరువుకు దరఖాస్తు చేశారు. 2015 నుంచి చేపలసాగు చేస్తున్నారు. అయితే ఆ రెండు సర్వే నంబర్లలోని 25 ఎకరాల భూమి ప్రభుత్వానిదని రెవెన్యూ వెబ్‌ల్యాండ్ స్పష్టం చేస్తోంది. ఏపీ భంజ్‌దేవ్ సర్వే నంబర్ 121లో 6 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూమి గ్రామదేవతకు చెందిన భూమిగా రెవెన్యూ అడంగల్‌లో నమోదై ఉండడం గమనార్హం.
4 విశాఖపట్నం
కబ్జారాయుళ్ల ఖిల్లా..
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంతతకు నిలయమైన విశాఖ జిల్లా కబ్జారాయుళ్ల ఖిల్లాగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార టీడీపీ నేతలు జిల్లాను చెరపట్టారు. ప్రభుత్వ, రెవెన్యూ, దేవాదాయ, ఇనాం, వక్ఫ్, అనాధీనం, అటవీ, ఎసైన్డ్ భూములే కాదు.. చివరకు ప్రైవేటు భూములను కూడా లిటిగేషన్‌లో పెట్టి మరీ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను, బలహీనవర్గాల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను, జాతీయ రహదారికి ఇచ్చిన భూములను కుదవపెట్టి వందల కోట్ల రుణాలు కొల్లగొట్టి ఆపై బ్యాంకులకు ఎగనామం పెట్టారు. గత మూడేళ్లుగా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన కథనాల నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ దర్యాప్తు నివేదిక మాత్రం ఇంతవరకు వెలుగు చూడలేదు. అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన కుటుంబ సభ్యులకు భూముల రికార్డుల ట్యాంపరింగ్‌లో సహకరించిన తహశీల్దార్లు బీవీ రామారావు, శంకర్రావులతోపాటు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గణేశ్వరరావులపై కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డుల ట్యాంపరింగ్ కుంభకోణంలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు తప్పించుకోగా మిగిలినవారంతా కటకటాలపాలయ్యారు. విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితుల పేరిట జిల్లాలో గత పదిహేనేళ్లలో పంపిణీ చేసిన 312 ఎకరాల్లో సుమారు 250 ఎకరాలను నకిలీ ఎన్‌వోసీలను అడ్డం పెట్టుకుని అనర్హులకు కేటాయింపులు జరిపారు. పేదలకు ఎసైన్ చేసిన భూముల్లో పెందుర్తి మండలం ముదపాక, నక్కపల్లి మండలం పెదగొడ్డుపల్లిలో 700 ఎకరాలను చంద్రబాబు తనయుడు నారా లోకేశ్.. ఒక జిల్లా మంత్రి తనయుడు, ఓ ఎమ్మెల్యేతో కలిసి కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసి సర్వే చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ముదపాకలో 350 ఎకరాల భూములకు చెందిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌ను ఎకరాకు రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి కాజేసేందుకు యత్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువైన పరుచూరి భాస్కరరావు పద్మనాభం మండలం కృష్ణాపురంలో 20 ఎకరాల డీపట్టా భూములతోపాటు ఆనందపురంలో 11.34 ఎకరాల ప్రభుత్వ భూములను చక్కబెట్టేశారు. గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ భీమిలిలో ఎస్సీలకు ఇచ్చిన 50 ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేశాడు. మరో అనుచరుడు ఎన్.స్వామి సర్వే నెం.294లో 3.76 ఎకరాలు, సర్వే నెం.294/2లో 4.40 ఎకరాలు ఆక్రమించుకుని షెడ్లు వేయిస్తున్నాడు. పద్మనాభం మండల టీడీపీ అధ్యక్షుడు సూరిశెట్టి అప్పారావు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి 130 ఎకరాల ఇనాం భూములను స్వాహా చేసేశాడు. అనకాపల్లి ఆవకండంలో 55 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీని వెనుక అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఉన్నారని చెబుతున్నారు. అనకాపల్లి మండలం శారదా కాలనీలో చిన్నంనాయుడు అనే దివ్యాంగుడికి చెందిన 1.12 ఎకరాల స్థలాన్ని వివాదంలో పడేశారు. న్యాయం చేయాలని కోరితే రూ.8 కోట్ల విలువైన ఆ భూమిని కేవలం రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్నారు. కనీసం ఆ మొత్తం కూడా ఇవ్వకుండా బా«ధితుడ్ని మూడేళ్లుగా తిప్పించుకోవడంతోపాటు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. భీమిలి బీచ్ రోడ్‌లో రామానాయుడు స్టూడియో దిగువన మాజీ సైనికులకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీత భర్త శ్రీనివాసరావు, మంత్రి గంటా అల్లుడి పేర్లతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.
5 పశ్చిమ గోదావరి
ఖాళీ జాగా కనిపిస్తే..
పశ్చిమ గోదావరిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇసుక, మట్టి దందాల్లో రాష్ట్రంలోనే ఆరితేరిన అధికార పార్టీ నేతలు ఖాళీ స్థలాలను కూడా వదలడం లేదు. ఎమ్మెల్యేలు మొదలుకుని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీడీపీ గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌లు, చివరకు జన్మభూమి కమిటీ సభ్యులు కూడా తమ పదవులను అడ్డుపెట్టుకుని అధికారం అండతో భూములను ఆక్రమించేస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కన్ను ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం చెరువుపై పడింది. పోలవరం కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టితో ఈ చెరువును పూడ్చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఎకరాల 76 సెంట్ల వ్యవసాయ భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని ఒక పేద దళిత వ్యవసాయ కూలీ కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటికే ఈ పొలాన్ని సాగు చేసుకుంటున్న రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వేధించారు. బినామీ పేర్లతో ఉన్నా ఇప్పటికీ ఎమ్మెల్యే చేతిలోనే ఈ భూమి ఉంది.
చింతలపూడి మండలంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దెందులూరుకు చెందిన ఒక సామాజికవర్గం వారి బినామీ పేర్లతో 125 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో కొంత అటవీ శాఖ భూమిని కూడా కలిపేసుకున్నారు. ఏలూరు శివారులోని వెంకటాపురం వార్డు సభ్యుడు సుంకరవారితోటలోని చెరువు భూమిని కబ్జా చేశారు. విశాలమైన చెరువు గట్టును ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నారు. ఏలూరు వినాయక్‌నగర్‌లో కామన్‌సైట్‌ను ఆక్రమించి భవనాలు నిర్మించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీ ఎంపీటీసీ స్థానిక కొత్తూరు ఇందిరా కాలనీ, సుందరయ్య కాలనీల్లో ఖాళీ భూములను ఆక్రమించారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఒక్కొక్క ప్లాట్‌ను రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు అమ్ముకున్నారు. శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 9, 10, 11 రోడ్డుల్లో రెవెన్యూ పోరంబోకు భూములను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. తంగెళ్లమూడి బీడీ కాలనీ, నల్లగట్టు ప్రాంతాల్లో రెవెన్యూ భూములను గ్రామ టీడీపీ నాయకులు ముక్కలు చేసుకుని పంచేసుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడొకరు కలసి ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి భూమిని కబ్జా చేశారు. ఏలూరు శివారులో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి.
6 కృష్ణా
శ్మశాన వాటికలూ మాయం
కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలు శ్మశాన వాటికలనూ వదల్లేదు. జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం బైపాస్ రోడ్డులో గోపాల్‌నగర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 185లో 10.84 ఎకరాల్లో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. గతంలోనూ శ్మశాన వాటికను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకోగా ఇటీవల రోడ్డు పక్కన ఉన్న విలువైన స్థలంలో ప్లాట్లు వేసి ముఖ్యమంత్రి అనుచరుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం స్పందించి దీనిపై విచారణకు ఆదేశించారు. అనంతరం ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం అలానే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.36 కోట్లు ఉంది. కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుంచి చేరే నీరు సముద్రంలోకి వెళ్లడానికి ఏకైక మార్గం ఉప్పుటేరు.
గతంలో కలిదిండి మండలంలో ఉప్పుటేరు సమీపంలో సర్వే నెంబర్ 42లో ఉన్న డ్రెయినేజీ భూములను సమీప రైతులకు లీజు పద్ధతిలో ఇరిగేషన్ శాఖ అధికారులు కేటాయించేవారు. అయితే ఉప్పుటేరులో డ్రెజ్జింగ్ పనులు చేసే క్రమంలో స్థలం అవసరం కావడంతో భూములను లీజుకు ఇవ్వలేదు. అయితే టీడీపీ నేత నంబూరి లచ్చిరాజు అనే వ్యక్తి ఈ భూముల్లో 9 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నాడు. ఈ తొమ్మిది ఎకరాల విలువ దాదాపు రూ. 2 కోట్లు ఉంటుంది. హనుమాన్ జంక్షన్ రూరల్ మండలంలోని కోడూరుపాడులో సర్వేనెంబర్ 133లో 44.60 ఎకరాల్లో పెద్దికుంట చెరువు ఉండగా, అందులో 40 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. దీన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేత షేక్ ఖలీషా ఆక్రమించుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. అతనికి మంత్రులు, ఎమ్మెల్యే అండగా ఉండడంతో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. సదరు నాయకుడు చెరువు భూమిని ఆక్రమించి పక్కాభవనం నిర్మించినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.
బెజవాడలో బొండా మాయాజాలం
విజయవాడ సింగ్‌నగర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు కేసీరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి 5.16 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ.50 కోట్లు. కాగా, టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేష్ ఓ వ్యక్తికి రుణం ఇప్పిస్తానని చెప్పి సంతకాలు సేకరించారు. అలా సేకరించిన సంతకాలతో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని ఏకంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు భార్య సుజాత పేర రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇందులో కార్పొరేటర్ గండూరు మహేష్, ఎమ్మెల్యే అనుచరుడు మాగంటి బాబు పాత్ర ఉన్నట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ భూకబ్జా వ్యవహారంలో ఎమ్మెల్యే సతీమణి బొండా సుజాతను ఏ8గా చేర్చి సీఐడీ కేసు నమోదు చేసింది.
7 గుంటూరు
కన్నుపడితే కబ్జానే..
గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల అండతో కనిపించిన స్థలాన్నల్లా కబ్జా చేసేస్తున్నారు. గుంటూరు నడిబొడ్డున నగరపాలక సంస్థకు చెందిన అతి విలువైన స్థలాన్ని ఆక్రమించి అధికార టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించింది. 1999లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అప్పట్లో అరండల్‌పేటలోని పిచుకులగుంట పక్కన టీఎస్ నంబర్ 826లో నగరపాలక సంస్థకు చెందిన వెయ్యి గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. కొన్నాళ్లు తర్వాత దీనిపక్కనే ఉన్న సర్వే నంబర్ 12/3లో మరో 1637 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టు ప్రహరీ నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం.. టీడీపీ కార్యాలయం కోసం ఆక్రమించిన స్థలం విలువ సుమారుగా రూ.40 కోట్లు. రేపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుచరుడు సురేంద్రబాబు ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా 1బీ అడంగళ్లులో నమోదు చేయించుకున్నారు. నిజాంపట్నం మండలం దిండి, కేసనవారిపాలెం, జంపనివారిపాలెం, యామినేనివారిపాలెం, పరిశావారిపాలెం, నర్రా వారిపాలెం, నక్షత్రనగరం గ్రామాల పరిధిలోని 875 సర్వే నంబర్‌లో 416.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
ఈ భూమిని చెరపట్టి తమకు అనుకూలురైన టీడీపీ నేతలు, కార్యకర్తల పేరిట రికార్డుల్లో నమోదుచేశారు. చింతలరేవులో 583 సర్వే నంబర్‌లో ఉన్న 15.13 ఎకరాల అటవీ భూమిని అధికార పార్టీకి చెందిన ఆరుగురికి అక్కడి తహసీల్దారు రాసిచ్చేశారు. ’సాక్షి’లో 2014, డిసెంబర్ 3న అక్రమ పట్టాలు పొందిన అంశంపై వచ్చిన కథనంతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం తప్పును సరిచేసుకుంటూ అక్రమంగా అటవీ భూములకు ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా సత్తెనపల్లిలో వడ్డవల్లి రఘురామ్‌నగర్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన సర్వీసుదారుల మాన్యం భూమి 25 సెంట్లలో అధికార పార్టీ ముఖ్యనేతకు ఓ కాంట్రాక్టర్ విలాసవంతమైన ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఇది సర్వీసుదారుల మాన్యం అని తెలిసినా అధికారులు ఎవరూ అడ్డు చెప్పలేని దుస్థితి. వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పట్లో సంగం డెయిరీని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన పది ఎకరాల భూమిని ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అప్పగించి సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పెదకాకాని మండలం నంబూరులో సర్వే నంబర్ 274లోని 3.89 ఎకరాల భూమి (వాగు పోరంబోకు)ని ఎమ్మెల్యే అనుచరుడు కట్టాపుల్లయ్య చౌదరి ముగ్గురు పేర్లతో జీపీ విక్రయం జరిపి సొంతం చేసుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నేత నుంచి ఎమ్మెల్యే, మంత్రులు సైతం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించినా అధికారులు అడ్డుచెప్పలేని పరిస్థితి. ప్రైవేటు భూములను ఆక్రమించారంటూ బాధితులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అడంగళ్‌లో పేర్లు మార్చడం, తర్వాత తమ అనుచరులతో భూమిలోకి దిగి చుట్టూ ఫెన్సింగ్‌లు వేయడం, అడ్డుకోవాలని వచ్చే బాధితులను పోలీసుల ద్వారా నిలువరించడం జిల్లాలో నిత్యం జరుగుతున్నదే. తమ భూమిని ఆక్రమించారని బాధితులు కోర్టులకు వెళ్లినా వారికి ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు చూపే అధికారే కరువయ్యారు.
8 ప్రకాశం
అన్నదాతల భూములు పచ్చ నేతల పాలు
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములపై అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలుతున్నారు. అధికారమే అండగా అక్రమంగా భూములను వశం చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జా చేస్తే.. మరికొందరు పేద రైతుల భూములనూ వదలడం లేదు. అధికారులను మచ్చిక చేసుకుని కబ్జా చేసిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో బాధితులు తమ భూములు కోల్పోయి లబోదిబోమంటున్నారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం
యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం నర్సింగాపురం రెవెన్యూ పరిధిలోని వెల్లంపల్లిలో 118 ఎకరాల రైతుల భూములను అధికార పార్టీ నేతలు తమ వశం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. వెల్లంపల్లి పరిధిలో 110, 11డి10, 11డి 5, 1డి7, 11డి9, 1సీడీ, 16,171, 173, 18, 1818, 1853, 1856, 1డీ2, 21, 211, 2111, 213బీ, 22, 221, 238, 232, 25, 2635, 2642, 264, 3, 301, 3010బీ, 305, 306, 31, 32, 34, 35, 351, 36, 85 సర్వే నెంబర్ల పరిధిలో 118 ఎకరాల శోత్రియం భూములు ఉన్నాయి. ఈ భూములు పి.లక్ష్మీనర్సింహారావు స్వాధీనంలో ఉన్నాయి. ఈ భూముల్లో 90 ఎకరాల భూములను 1980–90 మధ్య లేళ్లపల్లి, వెల్లంపల్లి గ్రామాలకు చెందిన 70 మంది రైతులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం లక్ష్మీనర్సింహారావు కోడలు రమణకుమారి ఆ భూములు తమవేనని, ఆన్‌లైన్ చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. రైతుల పేరు మీద ఉన్న భూములను రమణ కుమారి పేరుమీద ఆన్‌లైన్ చేసేందుకు తొలుత రెవెన్యూ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత మొత్తం 118 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భూములను తన పేర మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం ప్రకారం ముందు రమణ కుమారి పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని నిర్ణయించారు.
ఇందుకు తొలుత త్రిపురాంతకం రెవెన్యూ అధికారులు సహకరించక పోవడంతో ఏకంగా రెవెన్యూ శాఖా మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఫోన్ చేయించారు. ఒక దశలో రెవెన్యూ మంత్రి కలెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు తహశీల్దార్ జైపాల్ 118 ఎకరాల భూమిని రమణ కుమారి పేరున ఆన్‌లైన్ చేశారు.
ఆ తర్వాత ఈ భూములను పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద మీరం గ్రామానికి చెందిన సత్య కంపెనీ అధినేత వీరసత్యకు విజయవాడలో రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద గతంలో ఆందోళనలు సైతం నిర్వహించారు. ఆన్‌లైన్, రిజిస్ట్రేషన్ చేయడంపై బాధితులు తహశీల్దార్‌ను నిలదీయగా కలెక్టర్, ఆర్డీవోల ఒత్తిడి మేరకే తాను ఆన్‌లైన్ చేయాల్సి వచ్చిందని తహసీల్దార్ వారికి చెప్పారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ అధికార పార్టీ మంత్రి, ముఖ్యనేతకు బినామీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ.. భూములను ఆన్‌లైన్ చేసుకునే ప్రయత్నంలో ఉంది.
9 నెల్లూరు
అడ్డగోలుగా భూదందాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ భూములు, తీర ప్రాంతాలు, సీజేఎఫ్ భూములను అందిన మేరకు ఆక్రమించి రెవెన్యూ యంత్రాంగం సహకారంతో వాటికి పట్టాలు సృష్టిస్తున్నారు. కొందరు భూములను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు సాగు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో జలవనరుల శాఖకు చెందిన పదుల సంఖ్యలో స్థలాలు అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే స్వయంగా రంగంలోకి దిగి భూములు ఆక్రమించి పట్టాలు సృష్టించగా మరికొన్ని చోట్ల మంత్రుల అనుచర గణం భూదందా సాగిస్తోంది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 21 ఎకరాల నిషేధిత ప్రభుత్వ భూమిని తన తండ్రి, అత్త పేరుతో నమోదు చేసేందుకు రికార్డులు సిద్ధం చేయించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉంది.
ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆక్రమణ ఇలా..
కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ బొడ్డువారిపాళెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది. ఇందులో 20.76 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 664–2ఏలో 1.51 , 658–2ఏలో .500 , 651–1లో 7, 656–1ఏలో 1.55 , 664–2బీలో 0.40 సెంట్లు, 656–1బీలో 0.93, 664–1లో 1.90, 657–2లో 2.07, 656–3లో 2.13, 656–2లో 2.57 ఎకరాల నిషేధిత భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ నిషేధిత భూమిని కబ్జా చేసింది సాక్షాత్తూ కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి పోలంరెడ్డి వెంకురెడ్డి, అత్త కోటంరెడ్డి పద్మావతి. ఆక్రమణ చేసిన భూమిలో 664–2ఏలో 1.51, 658–2ఏలో .500 , 651–1లో 7, 656–1ఏలో 1.55 ఎకరాల భూమి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి వెంకురెడ్డి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అలాగే 664–2బీలో 0.40 సెంట్లు, 656–1బీలో 0.93, 664–1లో 1.90, 657–2లో 2.07, 656–3లో 2.13, 656–2లో 2.57 ఎకరాల భూమి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అత్త కోటంరెడ్డి పద్మావతమ్మ (భార్య పోలంరెడ్డి అరుణ తల్లి) పేరిట రెవెన్యూ రికార్డు 1బీలో నమోదు చేసి ఉంది. నిషేధిత భూమిని ఇరువురూ కొనుగోలు చేసినట్లుగా తహశీల్దార్ వెంకటేశ్వర్లు ధ్రువీకరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 18న 1బీలో పొందుపరిచారు. భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను కూడా మంజూరు చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు.
అలాగే ఆలూరు మండలం ఇసుకపల్లి పంచాయితీలోని పట్టపుపాలెంలో ఉన్న లబ్బీపాలెంలో టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సోదరులు 30 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమించి ఆక్వా సాగు చేశారు. అలాగే జిల్లాలోని సూళ్లూరుపేట, కావలి, ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో టీడీపీ నేతలు, వారి అనుచరులు కనిపించిన ఖాళీ స్థలాలను ఆక్రమించి పట్టాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో దళితులకు కేటాయించిన 93,500 ఎకరాల సీజేఎఫ్ భూముల్లో 30 శాతానికిపైగా అధికార పార్టీ నేతల అధీనంలోనే ఉన్నాయి.
10 కర్నూలు
యథేచ్ఛగా భూకబ్జాలు
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో సర్వే నంబర్ 452, 106, 35, 114 సర్వే నంబర్లలోని 14 ఎకరాల ప్రభుత్వ భూములను గోనెగండ్ల మండల టీడీపీ మాజీ కన్వీనర్ టి.నాగేశ్వరరావు అలియాస్ టి.నాగేష్‌నాయుడు సహకార బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాన్ని పొందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా తెలుసుకొని కేసు నమోదు చేశారు. ఎమ్మిగనూరు షరాఫ్‌బజార్‌లో ఐదు దశాబ్దాల నాటి పోతురాజుస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి పట్టణ నడిబొడ్డున ఆదోని – కర్నూలు నాలుగు లైన్ల బైపాస్ రోడ్డుకు ఇరువైపులా 6.83 ఎకరాల భూమి ఉంది. ఇందులో 0.95 ఎకరాలు బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ స్వాధీనం చేసుకొని అందుకు పరిహారం కూడా అందజేసింది. దేవాలయానికి సంబంధించిన పరిహారం కావడంతో కోర్టులో డిపాజిట్ చేశారు. ప్రస్తుతం సర్వే నెం.4401లో 2.53 ఎకరాలు, 4403లో 3.35 ఎకరాల దేవాలయ భూమి మిగిలి ఉంది.
ఈ భూమిని బారికి హనుమంతు, బారికి గోపాల్, బారికి భూపాల్, చిన్న గోపాల్ అనే వ్యక్తులు మూకుమ్మడిగా పవన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ తరఫున మేనేజింగ్ పార్టనర్ అయిన కేఈ ప్రతాప్‌కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లకు పట్టాదారు టైటిల్ డీడీ, రెవెన్యూ అడంగల్, నాన్ అసైన్‌మెంట్ ల్యాండ్ ధ్రువీకరణలను తీసుకునే రిజిస్ట్రేషన్ అధికారులు దేవదాయ భూమి రిజిస్ట్రేషన్‌లో మాత్రం ఇవేమీ లేకుండానే పనికానిచ్చేశారు. అది కూడా దేవదాయ భూమిపై హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు నడుస్తుండగా చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేయించడం గమనార్హం. ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటే పోతే కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ స్థలాలు, బీడు భూములు ఉంటే అక్కడ ఆక్రమించేశారు. మాన్యం, పోరంబోకు, అసైన్‌మెంట్, వక్ఫ్ భూములు, ప్రభుత్వ ఇలా ఏ భూమి కనిపించినా తమ జెండా పాతేశారు. జిల్లావ్యాప్తంగా 1000 ఎకరాల భూములు టీడీపీ నాయకుల అక్రమణలో ఉన్నాయని అంచనా. వీటి విలువ సుమారుగా రూ.500 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
11 ‘అనంత’
ఆక్రమణలు
అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఈ భూములను కొందరు అధికార పార్టీ నేతలు తమ బంధువుల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి స్వాహా చేస్తే, కొందరు కార్యకర్తల పేర్లతో వందల, వేల ఎకరాల భూమిని రాయించుకున్నారు. ఈ మొత్తం భూముల విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుందని అంచనా. ‘అనంత’లో ఆక్రమణలను పరిశీలిస్తే.. శింగనమల నియోజకవర్గంలోని ఆకులేడు, తరిమెల, కొరిపల్లి, జూలా కాలవలో మొత్తం 37 సర్వే నెంబర్లలో 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేశారు. ఇదే తరహాలో ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కూడేరు, కమ్మూరు, మరుట్ల, గుటుకూరు, జల్లిపల్లి గ్రామాల్లో 500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అనంతపురం కార్పొరేషన్ చుట్టూ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఎక్కడ చూసినా సెంటు రూ.6–రూ.10 లక్షల వరకు ఉంది. అంటే ఈ లెక్కన ఎకరా కనీసం రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. సోములదొడ్డి సమీపంలో 2013లో పేదలకు పట్టాలిచ్చిన 4.90 ఎకరాల భూమిలో మంత్రి పరిటాల సునీత అనుచరుడు పామురాయి వెంకటేశ్, పరిటాల పేరుతో ఏకంగా జెండాలు పాతారు. నిత్యం ఏదో ఒకచోట కబ్జా రాయుళ్లు విరుచుకుపడుతున్నా అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. రెవెన్యూ అధికారులు ధిక్కార స్వరం వినిపించకుండా మౌనంగా ఉండిపోతున్నారు. అధికారులు అనధికారికంగా అనుమతి ఇచ్చిన తర్వాత వారికి కొంత ముట్టజెప్పి స్వాహాకు దిగుతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు అధికారుల కబ్జాలకు రూట్‌మ్యాప్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
12 తిరుపతి
రూ.1,962 కోట్ల మఠం భూముల హాంఫట్
తిరుపతి రూరల్ మండలం అవిలాల సర్వే నెంబర్ 13లో 109 ఎకరాల భూమి హథీరాంజీ మఠానికి చెందిన పట్టా భూమిగా రికార్డుల్లో ఉంది. ఓ వైపు తిరుపతికి, మరోవైపు పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారికి అనుకుని ఉంది. ఇక్కడ అంకణం రూ.1.50 లక్షకు పైగానే పలుకుతుంది. అంటే ఈ భూమి విలువ ప్రస్తుతం 1,962 కోట్లు. అత్యంత విలువైన ఈ భూములను కళాపోషకుడు అయిన ఓ ఎంపీ బంధువులు, వేదాంతపురంకు చెందిన టీడీపీ నాయకుడు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన ప్రణాళిక సంఘం సభ్యుడు చెరపట్టారు. ఎవరికి అనుకూలంగా ఉన్న చోట వారు అక్రమ లేఅవుట్‌లను వేసుకున్నారు. అంకణాల చొప్పున అమ్మేసుకుని కోట్లకు పడగలెత్తారు. మఠానికి చెందిన కొందరు సిబ్బంది అక్రమార్కులకు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జేసీగా పనిచేసినప్పుడు ఈ భూముల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న ఇప్పుడు చర్యలకు వెనుకాడుతున్నారు.
13 వైఎస్సార్
అగస్త్యేశ్వరుని ఆస్తులకు ఎసరు
వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వరుని ఆస్తులకు అధికార పార్టీ నాయకులు ఎసరు పెట్టారు. పట్టణంలోని వినాయకనగర్‌లో సర్వే నంబర్ 450ఏబీ, 451ఏబీ, 452ఏబీలలో మొత్తం 25 సెంట్ల స్థలం దేవదాయ శాఖకు చెందింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. ఈ 25 సెంట్ల స్థలం దాదాపు రూ.3 కోట్లు చేస్తోంది. ఇందులో 6.25 సెంట్లను అధికార పార్టీకి చెందిన పట్టుపోగుల పుల్లయ్య ఆక్రమించి భారీ భవనం నిర్మించుకున్నాడు. ఈయన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయుడు. తమ స్థలంలో గృహాలు నిర్మించుకోవడంతో దేవదాయశాఖ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. ట్రిబ్యునల్ దేవాలయ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. అయినా ఇప్పటివరకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ భూమిలో 13 మంది ఆక్రమణలకు పాల్పడగా, రాజకీయ అండ లేని సి.లక్ష్మీనారాయణమ్మ, వి.చిన్నపుల్లయ్యకు చెందిన గృహాలను మాత్రమే దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని అధికార పార్టీకి చెందినవారిని వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment