సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అక్రమ నిర్మాణాల పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొందరు చట్టాలకు అతీతులమన్నట్లు పెట్రేగిపోయి భవన నిర్మాణ దారుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఉండాలంటే తాము చెప్పిన ధరకే అపార్టుమెంట్ ఫ్లాట్‌ను ఇవ్వాలని బలవంతంగా తమ పేరిట రాయించుకుంటున్నట్లు పోలీసు యంత్రాంగం దృష్టికి వచ్చింది. ఇటీవల ఈ ఘటనలపై జీహెచ్‌ఎంసీ, పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.
జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్‌పల్లి సర్కిళ్లలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్న 20 మందిపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఎవరెవరిని బెదిరింపులకు గురి చేశారో..? ఎంత మొత్తంలో దండుకున్నారో పక్కా ఆధారాలతో ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో రోజూ అక్రమ నిర్మాణాలు లక్ష్యంగా చేసుకొని రాత పూర్వకంగా, సోషల్ మీడియా ద్వారా సుమారు 40 కిపైగా ఫిర్యాదులు రావడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. రెండేళ్ల క్రితం అక్రమ నిర్మాణదారులను, ప్రభుత్వ భూముల్లో వెలసిన ఇళ్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ మహిళను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి ఇంట్లో దొరికిన ఫిర్యాదు పత్రాలు, సెల్‌పోన్‌లో నిక్షిప్తం చేసిన బహుళ అంతస్తుల భవనాల ఫొటోలను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తాజాగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని బసంత్‌రాజ్ ఉదంతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే తలెత్తడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
చదవండి: మీర్‌పేట్‌లో వ్యభిచార గృహం సీజ్
పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం!
అక్రమ నిర్మాణాలపై చర్యల విషయంలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అక్రమ నిర్మాణాలు కొన్నయితే.. ఎలాంటి నిబంధనలు లేకుండానే చేపట్టే నిర్మాణాలు మరికొన్ని. అయితే వీటిలో ఎక్కువశాతం నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే తరువాయి అన్నట్లుగా పెద్దఎత్తున ఒత్తిళ్లను తీసుకువచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేవారు కొందరైతే, మరికొందరు ఫిర్యాదులు మొదలుపెట్టి తమకు తాయిలం దక్కే వరకూ బెదిరింపులకు పాల్పడేవారు మరికొందరు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడటం దేవుడెరుగు, ఫిర్యాదుదారులకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇప్పించాల్సిన దుస్థితికి దిగజారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం..
అక్రమ నిర్మాణాల పేరుతో బిల్డర్లను బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే కొంతమందిపై ఫిర్యాదులు అందాయి. పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలి. వారి వివరాలను గొప్యంగా ఉంచి నిందితులపై చర్యలు తీసుకుంటాం.
-సురేందర్‌రావు, ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment