యనమలకుదురు గ్రామం అక్రమ కట్టడాల అడ్డాగా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు
జి+2కి అనుమతులు.. జి+4 నిర్మాణం
అడ్డగోలుగా అనుమతులిచ్చిన పంచాయతీ అధికారులు
విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్న బాగోతం
యనమలకుదురు గ్రామం అక్రమ కట్టడాల అడ్డాగా మారింది. ఒకటి రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ఇక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఇక్కడ దాదాపు 300కు పైగా భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తే వాటిలో 70 శాతం నిబంధనలు ఉల్లంఘించినవే. ఈ విషయం గ్రామ స్థాయి నుంచి సీఆర్‌డీఏ స్థాయి వరకు అధికారులందరికీ తెలిసినా పట్టించుకునేవారు లేరు.
విజయవాడ : యనమలకుదురు గ్రామ శివారు ప్రాంతం గడిచిన మూడేళ్లలో అనూహ్యంగా అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ హడావుడి అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువగా ఉండటంతో నెలకో అపార్ట్‌మెంట్ నిర్మాణం అనే రీతిలో ఇక్కడ నిర్మాణాలు శరవేగంగా జరిగాయి. ఇంకా ప్రత్యేకంగా యనమలకుదురు నుంచి తాడిగడపకు వెళ్లే డొంక రోడ్డులో 90 శాతం నిర్మాణాలు చేపట్టారు. గ్రామంలో ప్రధాన రహదారులు మినహా మిగిలినవన్నీ 10, 20 అడుగుల రోడ్లే.
కార్యదర్శులే రింగ్ లీడర్లు...
ఇక్కడ హవా అంతా గ్రామ కార్యదర్శులదే. ముఖ్యంగా గత ఏడాది వరకు ఉన్న కార్యదర్శులు పెద్ద సంఖ్యలో అనుమతులు ఇచ్చి భారీగా సొమ్ము చేసుకున్నారు. దరఖాస్తు వచ్చాక కనీసం పరిశీలన కూడా చేయకుండానే అనుమతులు ఇచ్చేశారు. గతంలో ఏడాదికి ఐదుగురు గ్రామ కార్యదర్శులు ఇక్కడ మారేవారు. ఒక కార్యదర్శి హయాంలో కేవలం రెండు నెలల వ్యవధిలో 80కి పైగా భవనాలకు అనుమతులు ఇవ్వటం గమనార్హం. అంతేకాదు.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవాలని వారే సలహాలు కూడా ఇస్తుండటం విశేషం. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో దర్యాపు చేయించి అక్రమ కట్టడాల సమగ్ర చిట్టా సేకరించి విచారణ పర్వం ముగించింది. ఇక చర్యలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి.
ఇక్కడి పరిస్థితి ఇదీ...
►ఇక్కడి రోడ్లలో కార్లు తప్ప మరే పెద్ద వాహనాలూ రాకపోకలు సాగించలేవు.
►గత ఏడాది వరకు గ్రామాల్లో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీలకే ఉండేది.
►ఈ ఏడాది నుంచి సీఆర్‌డీఏ పరిధిలోని పంచాయతీల్లో అనుమతిలిచ్చే అధికారం బదలాయించారు.
► సీఆర్‌డీఏకు ఆ అధికారం అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
► గత ఏడాది వరకు రియల్ ఎస్టేట్
మార్కెట్ బాగా సాగటంతో ఇక్కడ భారీగా అపార్ట్‌మెంట్లు వెలిశాయి.
►కనీసం 360 చదరపు గజాల పైనే స్థలం ఉంటే దానిలో జి+3 భవనం నిర్మాణానికి అనుమతులు ఇస్తారు.
►రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లతో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు.
►గడచిన మూడేళ్లలో ఇక్కడ 160 అక్రమ కట్టడాలు నిర్మితమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారించారు.
►286 చదరపు గజాల విస్తీర్ణంలో జి+2 భవనానికి అనుమతులు తీసుకొని జి+3 భవనాలు 40కి పైగా నిర్మించారు.
►200 గజాల విస్తీర్ణంలో జి+1కి అనుమతులు తీసుకొని జి+2 భవనాలు గ్రూప్‌హౌస్‌ల పేరుతో సెట్‌బ్యాక్, చుట్టూ జాగా లేకుండా సుమారు 37 వరకు నిర్మించారు.