
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కింగ్స్ గార్డెన్ యజమాని షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్‌లు తమకు చెందిన 6.10 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్న విషయానికి సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పూర్తి సమాచారాన్ని తీసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఆ సమాచారంతో తిరిగి పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును ఇచ్చింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఉన్న తమ 6.10 ఎకరాల భూమిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కింగ్స్ గార్డెన్ యజమాని షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్‌లు కబ్జా చేసి, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిషోర్ సహకరించారంటూ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి తరఫున ఆయన జీపీఏ హోల్డర్ తగశిరపు శివనాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్‌లతో దాన కిషోర్ వ్యాపార భాగస్వామిగా ఉంటూ తమ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టా రని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిని కూల్చివేయడంతోపాటు దాన కిషోర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తమ స్థలంలో అక్రమ నిర్మా ణాలు చేస్తున్నారని దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
దానకిషోర్‌కు ఏం సంబంధం?
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా దాన కిషోర్ బాధ్యతలు చేపట్టి ఎంత కాలమైందని ప్రశ్నించారు. ఓ 3 నెలలు అయిందని న్యాయవాది చెప్పగా, మరి అంతకుముందు జరిగిన వ్యవహారాలతో అతనికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.