అక్రమ కట్టడాల జోరు!
Published Thu, Sep 26 2013 11:43 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :కొన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వరదొచ్చినా, వానొచ్చినా పండగే. బాధితులకు ప్రభుత్వం అందించే సాయంలోనూ అక్రమాలకు పాల్పడటం వారికి పరిపాటి. ఇదే రీతిలో గ్రామ కార్యదర్శులు, వీజీటీఎం ఉడా సర్వేయర్లు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అందు తున్నాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అన్నిశాఖల సిబ్బంది, అధికారులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు ఇబ్బంది కలగకుండా అనధికారికంగా విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే గ్రామ కార్యదర్శులు, ఉడా సర్వేయర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విమర్శలకు గురవుతున్నారు.
ఉద్యమం పేరుతో అక్రమ కట్టడాలకు ఊతం ఇస్తూ దండుకుంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఉడా పరిధిలోని ఏ గ్రామంలోనైనా కట్టడాలు ప్రారంభమైతే ల్యాండ్ కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్ లేదని గ్రామ కార్యదర్శులు, ఉడా సర్వేయర్లు వీరిని బెదిరిస్తూ కాసులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. బిల్డర్లు ప్లాన్‌కు భిన్నంగా డీవియేన్స్‌తో నిర్మాణాలు జరుపుతున్నా, పెంట్‌హౌస్‌లు కడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా అనధికార కట్టడాలపై ఫిర్యాదు చేస్తే ‘ఉద్యమాన్ని సాకు’గా చూపి విధులకు హాజరుకాలేమని చెబుతున్నారు. బిల్డర్లకు, వీరికి ‘మనీఫిక్సింగ్’ ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ ఉద్యమ కాలంలో ఉడా పరిధిలోని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాల్లో కనీసం 400 వరకు అనధికార కట్టడాలు జరిగి ఉండవచ్చనే అభిప్రాయం అధికారులు, రియల్టర్లు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమ కట్టడాలు ఎక్కువగా గ్రూపు హౌస్‌ల్లోనే జరుగుతున్నాయి. ఉడా పరిధిలోని ఏ గ్రామంలోనైనా 10 మీటర్ల ఎత్తుదాటి ఇళ్ల నిర్మాణం జరగకూడదు. వీటి నిర్మాణానికి ఇంటి ప్లాన్‌లు ఆయా గ్రామ కార్యదర్శులు మంజూరు చేస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా మూడు ఫ్లోరులతో నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం సర్వేయర్లకు ఉన్నప్పటికీ, గ్రామ కార్యదర్శుల ద్వారా మామూళ్లు అందుకోవడం వల్ల పట్టించుకోవడం లేదు. అపార్టుమెంట్ల నిర్మాణం చేపడుతున్న బిల్డర్లు ఇటీవల కాలంలో పెంట్‌హౌస్‌ల నిర్మాణాలను నిలిపివేసినప్పటికీ, సెట్‌బ్యాక్‌లు, డీవియేషన్లకు పాల్పడుతున్నారు.
స్థలాల ధరలు పెరిగి అక్రమ కట్టడాలు...
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సిటీ పరిధి దాటిన తరువాత కొన్ని ప్రాంతాల్లోని స్థలాల ధరలు అధికంగా పెరగడంతో ఈ అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, ఉండవల్లి, తెనాలి రూరల్, మంగళగిరి రూరల్, గుంటూరు రూరల్‌లోని పలకలూరు, పేరేచర్ల, కృష్ణాజిల్లాలోని గొల్లపూడి, యనమలకుదురు, పెనమలూరు, కంకిపాడు, రామవరప్పాడు, ప్రసాదంపాడు తదితర గ్రామాల్లో ఈ అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవల యనమలకుదురులో అక్రమ కట్టడాలు నిర్మించిన 26 మందికి జిల్లా పంచాయతీ అధికారి నోటీసు జారీచేశారు. ఈ అక్రమ కట్టడాల విషయమై ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా, ప్రస్తుత పరిస్థితిలో చేయగలిగిందీ ఏమీ లేదన్నారు. అక్రమ కట్టడాలపై ఎవరైనా తన దృష్టికి తీసుకువస్తే వైస్ చైర్మన్ ద్వారా తనిఖీ చేయించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉద్యమం కారణంగా ఉడాకు సంబంధించి అనేక సమస్యలు పెరుగుతుండటంతో సిబ్బందిని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసేందుకు ఈ నెల 30వ తేదీన వారితో సమావేశం నిర్వహించాలని వైస్ చైర్మన్‌కు చెప్పానని వివరించారు.
Advertisement
Advertisement