క్రమబద్ధీకరణ...లేదంటే కూల్చివేతే
Published Sun, Jan 19 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతో పాటు బీబీఎంపీ పరిధిలో అక్రమ కట్టడాలను నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరించుకోక పోతే వాటిని కూల్చి వేయనున్నారు. కనుక వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న అక్రమ-సక్రమ కింద ఇలాంటి కట్టడాలను విధిగా క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత జరిమానాను చెల్లించడం ద్వారా వీటిని క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సవరణ నిబంధనల్లో ఈ ‘నిర్బంధ క్రమబద్ధీకరణ’ను చేర్చింది. ఈ క్లాజు ద్వారా హైకోర్టును ఒప్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో క్రమబద్ధీకరణను
‘చట్టంలో చెడు’గా అభివర్ణించిన హైకోర్టు, దానిపై యథాతథ పరిస్థితిని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పుడు అక్రమ-సక్రమకు నడుం బిగించినా ‘ఏదైనా...కోర్టు తుది ఆదేశాలకు లోబడే’ అని షరతు విధించింది. క్రమబద్ధీకరణకు పౌరులకు ఓ అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోర్టును కోరనుంది. గత ఏడాది అక్టోబరు 19వ తేదీకి ముందు నిర్మించిన కట్టడాలు, భూ పరివర్తన ఆమోదం పొందని వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు, లేఔట్లు, నివేశనాలను అక్రమ-సక్రమ కింద క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రమబద్ధీకరణకు అవకాశం లేని కట్టడాలను కూడా ప్రభుత్వం ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. అవి...నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణను కోరుతూ దరఖాస్తులను సమర్పించని అనధికార లేఔట్లు, కట్టడాలు. క్రమబద్ధీకరణకు అవకాశం లేని లేఔట్లు, కట్టడాలు (అంటే...కాలువలు, రాజ కాలువలు, నదులు, చెరువుల గట్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్ కింద ఉండే ప్రాంతాల్లోని నిర్మాణాలు). నిర్ణీత గడువు లోగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించని కట్టడాలు, లేఔట్లు.
అప్పీలుకూ అవకాశం
పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు లేదా పాలికెలు...అక్రమ కట్టడాలు, లేఔట్లు, నివేశనాలకు క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ క్రమబద్ధీకరణను కోరుతూ సమర్పించిన అర్జీ తిరస్కరణకు గురైతే, అప్పిలేట్ అథారిటీలో సవాలు చేసే అవకాశాన్ని కూడా ముసాయిదా నిబంధనల్లో ప్రభుత్వం కల్పించింది. కాగా ఈ ముసాయిదా నిబంధనల్లో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 31లోగా ప్రజలు తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం ఏడాది పాటు క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది.
ఏటీఎంలకు సరైన భద్రత
= బ్యాంకర్లకు నగర పోలీసు కమిషనర్ సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో ఇటీవల దొంగల కళ్లు ఏటీఎంలపై పడినందున, వాటికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ బ్యాంకర్లకు సూచించారు. తన కార్యాలయంలో శనివారం ఆయన బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఏటీఎంలకు భద్రతతో పాటు వాటిల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం విలేకరులతో వ ూట్లాడుతూ తాము ఎంతగా మొత్తుకుంటున్నా ఇంకా 1,650 ఏటీఎంలకు భద్రత కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ సమావేశంలో 45 మందికి పైగా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement