బెంగళూరు నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్
దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరంగా గుర్తింపు
బెంగళూరులో ప్రస్తుతం జనాభా కంటే వాహనాలే అధికం
పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్న బీబీఎంపీ..
సాక్షి బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర వాసులకు ట్రాఫిక్ అనేది నేడు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. రద్దీ సమయాల్లో ఒక్కో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
ప్రశాంత వాతావరణం, నిండైన పచ్చదనంతో ఒకప్పుడు ఉద్యాననగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రస్తుతం జనాభా సంఖ్య కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నగరంలో రోడ్ల సమర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 1.40 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్ల విస్తరణకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అడుగులు వేస్తోంది.
దశాబ్ద కాలంలో మారిన నగరం..
శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం కావడం, కాంక్రీటీకరణ, అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ తదితర కారణాల వల్ల బెంగళూరు గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో మారిపోయింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మెట్రో, ఫ్లయ్‌వోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరకడంలేదు. రోడ్ల విస్తరణ అభివృద్ధికి కావాల్సిన స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు అవసరమైన ఆరి్థక వనరులు బీబీఎంపీ వద్ద లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఒక మహిళ ఇటీవల ఎక్స్‌లో చేసిన చిన్న పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుందని, అంత సేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటారని, బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందంటూ ఇక్కడి ట్రాఫిక్‌ని ఎద్దేవా చేస్తూ అనఘ అనే మహిళ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ట్వీట్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో భారీ చర్చకు తెరతీసింది. అయితే బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి ఆమె ట్వీట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని, నగరవాసులను ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ట్రాఫిక్ వ్యథలు వందల కొద్దీ చెబుతారని నెటిజన్లు అంటున్నారు.
బీబీఎంపీ పరిధిలో రహదారుల పొడవు: 12,878 కి.మీ
ఇందులో ఆర్టిరియల్, సబ్ ఆర్టిరియల్ (అధిక సామర్థ్యంగల) రోడ్లు: 1344.84 కి.మీ
నగరంలో రిజిష్టర్ అయిన వాహనాల సంఖ్య: 1.40 కోట్లు
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారందేశంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 1
ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 6
నగరంలో సగటున 10 కి.మీ ప్రయాణించేందుకు పట్టే సమయం: 28 నిమిషాలు
Comments
Please login to add a commentAdd a comment